చదువుల గ్యారేజీ

పాతికేళ్ల వయసులో ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఇల్లు కట్టుకుని, పెళ్లి చేసుకుని స్థిరపడిపోతారు...

Published : 11 Apr 2020 00:39 IST

ప్రేరణ

ఇక్కడ కోచింగ్‌ ఉచితం

చదువుకునేందుకు సాయం కావాలా? నా దగ్గరకు రండి..

ఉద్యోగం లేదా? వచ్చే మార్గం చూపిస్తాను నాతో రండి.. ఈ మాటలంటోంది ఎవరో ధనవంతుడు కాదు. పల్లెటూర్లో సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన ఓ యువకుడు...

పాతికేళ్ల వయసులో ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఇల్లు కట్టుకుని, పెళ్లి చేసుకుని స్థిరపడిపోతారు చాలామంది. కానీ అతడు తన చుట్టుపక్కల ఉన్న వారి శ్రేయస్సు కోసం ఆరాటపడ్డాడు. తోటి యువతనూ తనలా సొంత కాళ్ల మీద నిలబడేలా చేయాలని కోరుకున్నాడు. అందుకోసం ఓ కోచింగ్‌ సెంటరే ప్రారంభించాడు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా గ్రామీణ యువతకు శిక్షణ ఇస్తున్నాడు. వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి విజయతీరాలకు చేరుస్తున్నాడు ఎన్ని ప్రసాద్‌.. సొంతూరు శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని ఈదురాపల్లి గ్రామం. వ్యవసాయ కుటుంబం. ఉద్యోగరీత్యా 2013లో హైదరాబాద్‌ వచ్చాడు. నగర శివారు నారపల్లిలోని తన అక్క వాళ్లింట్లో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. తిరుమలగిరిలో సైన్యానికి చెందిన సివిలియన్‌ మెస్‌లో ఉద్యోగం.

చుట్టూ ఉన్న యువతని చూశాకే..

నారపల్లిలో చాలావరకూ రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలవి. చదువు మధ్యలోనే ఆపేసి పనికి వెళ్లేవారు కొందరైతే, చదువుకుని ఖాళీగా తిరిగేవాళ్లు ఇంకొందరు. ఎలాంటి లక్ష్యం లేకుండా బతికేస్తున్న వాళ్లకు ఏదైనా చెయ్యాలి అనుకున్నాడు. ఇద్దరు యువకుల్ని ఎంపిక చేసుకుని వారికి చదువుకుంటే జీవితంలో ఎంత చక్కగా స్థిరపడొచ్చో చెప్పాడు. రోజూ సాయంత్రం పూట రమ్మని కోచింగ్‌ ఇచ్చాడు. పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని సందేహాల్ని నివృత్తి చేసేవాడు. దీంతో పాటు శారీరక దారుఢ్య మెలకువలు నేర్పేవాడు. శిక్షణ స్టార్ట్‌ చేసిన మూడు నెలలకే సైనికదళంలో పి.ఈ.టి. ఉద్యోగం వచ్చింది ఒకరికి. ఈ విషయం తెలిసి ఆ గ్రామంలోని ఇతర యువకులూ ప్రసాద్‌ దగ్గరికి వచ్చారు. మొత్తం 40మంది అయ్యారు. అప్పుడు ‘మధుశ్రీ’ పేరుతో అకాడమీని నెలకొల్పాడు. సాయంత్రం 5 నుంచి రాత్రి తొమ్మిది వరకు ఫిట్‌నెస్‌ క్లాసులు, సమకాలీన అంశాలు, జనరల్‌నాలెడ్జ్‌, వర్తమాన వ్యవహారాలు, ఇంటర్వ్యూ స్కిల్స్‌ మీద తరగతులు నిర్వహించేవాడు. స్నేహితుల సాయంతో బయటినుంచి నిపుణులను పిలిపించి పాఠాలు చెప్పిస్తున్నాడు ప్రత్యేకంగా జిమ్‌ కూడా ఏర్పాటు చేశాడు. తన దగ్గరకు వచ్చి, ఉచిత శిక్షణ పొందిన వాళ్లలో 16 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. సైన్యం, నావికాదళం, పోలీసు తదితరాలకు వారు ఎంపికయ్యారు. ఈ అకాడమీ నిర్వహణతో పాటు ప్రసాద్‌.. చలివేంద్రాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటాడు.

- శాంతి జలసూత్రం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని