జాను..ఏమై పోయావు?

వేసవి సెలవులొస్తుంటే.. ఆమె కళ్లే గుర్తొస్తున్నాయి. మౌనంగా మాట్లాడుకున్న సందర్భాలే మదిలో మెదులుతున్నాయి...

Published : 11 Apr 2020 00:45 IST

వేసవి సెలవులొస్తుంటే.. ఆమె కళ్లే గుర్తొస్తున్నాయి. మౌనంగా మాట్లాడుకున్న సందర్భాలే మదిలో మెదులుతున్నాయి. అప్పుడే.. డిగ్రీ రెండో సంవత్సరం పరీక్షలు రాశాను. వేసవి సెలవులు భారంగా గడుస్తున్న రోజులవి. స్నేహితులందరూ ఊరెళ్లిపోయారు. ఏం చేయాలో తోచక మా ఊరి రామాలయం దగ్గర కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్న ఓ ఆదివారం ఉదయమది. ఇంతలో మా గల్లీలోకి ముందెన్నడూ చూడని ఓ అమ్మాయి.. అమ్మానాన్నలతో కలిసి దూరంగా నడుచుకుంటూ వస్తున్నట్లుంది. లంగాఓణీ, వాలు జడ, తలలో పూలు, పట్టీల సవ్వడితో పాతతరం అమ్మాయిని తలపించింది. అలా కొంచెం కొంచెం దగ్గరకి వస్తుంది. చామనఛాయే అయినా ఆమె ముఖారవిందం, నక్షత్రాల్లాంటి కళ్లు నాపై ఓ వల విసిరాయల. నేను తదేకంగా చూస్తున్న సంగతి గమనించిందో ఏమో..! వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి ఓ చూపుతో హాయ్‌ చెప్పిపోయింది. ఆ చూపు మనసుకి కాస్త బలంగానే తగిలినట్టుంది.. అందుకేనేమో నా కళ్లు.. కాళ్లు.. తన వైపు వెళ్లమని బలవంతం చేస్తున్నాయి. కానీ, అసలే పల్లెటూరు మాది. అందరూ తెలిసినోళ్లే. ఎవరేమనుకుంటారో అనే భయం. అసలా అమ్మాయి ఎవరి ఇంటికి వచ్చిందో? ఏంటో? మూడు నిమిషాల వ్యవధిలో సవాలక్ష ప్రశ్నలు. సరిగ్గా మా ఇంటికి ఆరు ఇళ్ల అవతల ఇంటికి వెళ్లారు. వెంటనే ఆ పక్కన ఇంట్లో ఉండే నా మిత్రుడు రాముని అడిగి ఆరా తీస్తే తెలిసింది.. ఆమె పేరు జానకి అని.. వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికొచ్చిందని..

ఆ మరుసటి రోజు వాళ్ల అమ్మానాన్నలు తనను ఇక్కడే విడిచి వెళ్లారు. ఇక ఆ రోజు నుంచి పొద్దున్నంతా ఆమె కళ్లల్లో పడటానికి ఎదురుచూపులు.. చీకటి పడ్డాక ఆమె ఊహల్లో తేలిపోవడం.. ఇదే నా పని. తను వచ్చిన నాలుగో రోజు సాయంత్రం అది.. తన అత్తతో కలిసి రామాలయం దగ్గర కోలాటం నేర్చుకోవడానికి వచ్చింది. ఇక తన దృష్టిని ఆకర్షించాలని విశ్వప్రయత్నాలు నావి. కానీ, ఫలితం శూన్యం. కనీసం కన్నెత్తి అయినా చూడలేదు. కానీ, చివరిలో ఓ చూపు చూసి.. చిన్న నవ్వు నవ్వి వాళ్ల అత్తతో కలిసి వెళ్లిపోయింది. ఆ రోజంతా కాలు నేల మీద నిలవలేదు. నాలుగైదు రోజులు ఇదే తంతు. ఇక నా మనసులో మాటను తనకు చెప్పేయాలనుకున్నా! ఓ రోజు తను ఒంటరిగా ఉన్నప్పుడు ‘‘పిల్లా.. నీతో కాస్త మాట్లాడాలి’’ అన్నా.. కోపంగా చూసి.. చెప్పు అంది. ఏం చెప్పాలో తెలీక ‘‘సారీ ఏమీ లేదు.. వెళ్లు’’ అన్నాను. ‘‘ఎందుకు పిలిచావు మరి పిల్లా అని’’.. అంటూ ఓ నవ్వు నవ్వి నువ్వు ఏం చెప్పాలనుకున్నావో నాకు తెలుసు అంటూ వెళ్లిపోయింది. కొంటెగా తన అంగీకారాన్ని తెలిపినట్లనిపించింది నాకు. ఆ రోజు నుంచి పెద్దగా మాట్లాడుకునే అవకాశం లేకపోయినా కళ్లతోనే సందేశాలు పంపుకునేవాళ్లం. హావభావాలను ప్రదర్శించే ఆమె సుకుమార నేత్రాలను చూస్తూ ఓ జీవితకాలాన్ని హాయిగా గడిపేయొచ్చేమో. అలా చూస్తూ.. చూస్తూనే వేసవి సెలవులన్నీ వేగంగా వేడికి కరిగిపోతున్నాయేమో అన్పించింది. మరో రెండు రోజుల్లో తను ఊరెళ్లి పోతుందని తెలిసిన క్షణం నుంచి కంటికి కునుకులేదు, మనసుకు కుదురులేదు.. తన గురించే ఆలోచన. తనతో మాట్లాడదాం అనుకుంటే వీల్లేకుండా వాళ్ల అత్త ఎప్పుడూ వెంటే ఉండేది. ఒకటి రెండు సార్లు తప్ప మిగతా రోజులన్నీ మౌన ప్రేమ సందేశాలే. చివరి రోజు ఎలాగైనా తెగించి తనతో మాట్లాడి, తన గురించి తెలుసుకోవాలనుకున్నా! ఆ రోజు యథావిధిగా తన కోసం రామాలయం దగ్గర ఎదురుచూశాను. కోలాటం నేర్చుకోవడానికి వాళ్ల అత్త ఒక్కతే వచ్చింది తను రాలేదు. నాకేం అర్థం కాలేదు. పరుగుపరుగున రాము దగ్గరకు వెళ్లి అడిగితే.. నిన్న రాత్రి వాళ్ల నాన్న వచ్చి తీసుకెళ్లిపోయాడంట్రా. నాకూ ఇప్పుడే తెల్సింది అన్నాడు. ఒక్కసారిగా నా గుండె ఆగినంతపనైంది. తను ఎక్కడుంటుందో, ఏం చేస్తుందో.. మళ్లీ ఎప్పుడొస్తుందో ఏం తెలీదు. అప్పటి నుంచి తనకోసం ఎదురుచూస్తూనే ఉన్నా తను వస్తుందనే ఆశతో..! జానూ.. ఏమైపోయావు.. ఎలా ఉన్నావు..?? ఎప్పుడొస్తావు..??

- సతీశ్‌ జీవీ, కాకినాడ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని