Published : 18 Apr 2020 00:46 IST

కారణాలతో మిగలొద్దు

అమ్మాయిలంటేనే ఆమడ దూరంలో ఉండే నేనేనా.. ఇలా రెండోసారి ప్రేమ విషయంలో భంగపడింది? నామీద నాకే జాలేస్తుంది. మనసులోని భావాలను బయటకు చెప్పలేని ఇంట్రావర్ట్‌ని. పైగా అమ్మాయిలతో మాట్లాడటం నేరం అనే అభిప్రాయం ఉన్న స్కూల్‌, కాలేజీల్లో చదువు. అలాంటిది పీజీలో ఓ అమ్మాయి తెగ నచ్చేసింది. కానీ, నా మాటలను మౌనం అడ్డుకుంది. చూస్తూ చూస్తూనే కేవలం చూపులతోనే సంవత్సరం గడిచిపోయింది. రెండో యేడు ఎలాగోలా కష్టపడి తనతో మాట కలిపా. తనకి స్నేహితుడ్నయ్యా.. కొన్ని నెలల స్నేహం తర్వాత నా మనసులో మాట తనకు చెప్పా. నువ్వంటే నాకూ ఇష్టమే. కానీ ప్రేమపై నాకంత నమ్మకం లేదు. మంచి ఫ్రెండ్స్‌గా ఉందాం అంది. కానీ తనపై ప్రేమని స్నేహంగా భావించలేను. మా విషయం తెలిసిన స్నేహితులు.. ‘ప్రియా వాడు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మీ పెళ్లి సాధ్యం కాదని నువ్వు పొరపాటున చెప్పినా తట్టుకోలేడు’ అని తనతో చెప్పారు. ఆ రోజు నుంచి క్రమంగా మాటలు తగ్గాయి. ఫోన్‌ చేస్తే మాట్లాడేది కాదు. తనను మర్చిపోలేక పీజీ అయిపోయిన తరువాతా రోజూ కాలేజీకి వెళ్లేవాడిని. తనతో గడిపిన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఓ సంవత్సరం గడిపేశాను. అలా మెల్లమెల్లగా తనని మర్చిపోతున్న సమయంలో ఓ రోజు బస్‌స్టాప్‌లో తను కనబడింది. ఆ రోజే తెలిసింది తనకు       పెళ్లైపోయిందని, ఆనందంగానే ఉందని.. అలా నా మొదటి ప్రేమ ఆరాధనతోనే సరిపోయింది.
 అవన్నీ మర్చిపోయి ఓ ఉద్యోగంలో చేరా. ప్రియా తర్వాత అంతలా నచ్చిన ఓ అమ్మాయి. తనని చూస్తే ప్రియని చూసినట్టే ఉండేది. మా టీమ్‌లో జూనియర్‌. పేరు కావేరి. ఎంతో చలాకీ. త్వరగానే స్నేహితులమయ్యాం. ఇద్దరి మనసులు కలవడానికీ ఎక్కువ సమయం పట్టలేదు. నా మీద తను చూపే ప్రేమ అపారం. నా ఆలోచనలకు అనుగుణంగా తన అభిప్రాయాలను మార్చుకునేది. ప్రతి విషయంలో నా వెన్నంటే ఉండేది. మూడేళ్ల మా ప్రేమలో ఏనాడూ హద్దులు దాటలేదు. అలా ప్రశాంతంగా సాగిపోతున్న మా ప్రేమలో అనుకోని కుదుపు ఉన్నతోద్యోగం రూపంలో వచ్చింది. తనకు బెంగళూరులో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. వెళ్లాలా వద్దా అని నన్నడిగింది. హ్యాపీగా వెళ్లమని చెప్పా. రోజూ మెసేజ్‌లు, కాల్స్‌.. అప్పుడప్పుడూ నన్ను చూడటానికి తనే వచ్చేది. చూస్తుండగానే సంవత్సరం అయిపోయింది. కానీ ఈ సంవత్సర కాలంలో ఎన్నో మారాయ్‌!! తన ఉద్యోగం కారణంగా ఇద్దరం మాట్లాడుకునే సమయం చాలా తగ్గింది. దాంతో నాలో అంతర్మథనం. ఏవేవో పిచ్చి ఆలోచనలు, అనుమానాలు. నువ్వు కావాలనే నాకు సమయం ఇవ్వట్లేదంటూ ప్రతి చిన్నదానికీ కోప్పడేవాడిని. దీంతో రోజూ ఏదో గొడవ. కానీ ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం. కేవలం నా పని ఒత్తిడి వల్లే నీకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నా అర్థంచేసుకో..’ అంటూ అన్ని రకాలుగా చెప్పే ప్రయత్నం చేసేది. నేను ఫోన్‌ చేయకున్నా, మెసేజ్‌ చేయకున్నా తనే చేసేది.. ఓ రోజు మళ్లీ అదే గొడవ. అనుమానంతో తనను అనేక మాటలన్నా.. కాల్‌ కట్‌ చేసింది. తర్వాత తనే చేస్తుందిలే అని అలా ఊరుకున్నా.. రెండు రోజులైనా తన నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇక చేసేదేం లేక ఓ మెసేజ్‌ పెట్టాను. జవాబు లేదు.
కాల్‌ చేశా.. అదే తనతో నా చివరి కాల్‌ అవుతుందనుకోలేదు. ఆ రోజు తను మాట్లాడిన మాటల్లో తనని నేనెంతగా ఇబ్బంది పెట్టానో తెలిసింది.. ‘ఇప్పటికే నీ వల్ల చాలా కోల్పోయా! నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. కొన్ని రోజులుగా నువ్వు మాట్లాడిన ప్రతి మాటా నా మీద అభద్రతా భావంతోనే మాట్లాడినట్టు ఉంది. ఇక నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు. ఈ రెండు రోజులు నీ గురించే ఆలోచించాను. నీతో జీవితం పంచుకుంటే ఎప్పటికీ నేను నేనుగా ఉండలేను’ అని చెప్పి కాల్‌ కట్‌ చేసింది. ఓ రెండు నిమిషాలు నా గుండె ఆగినంత పనైంది. ఆ క్షణం   నా తప్పేంటో తెలుసుకున్నా. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. తర్వాత నా మెసేజ్‌లకు రిప్లై లేదు. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చివరగా కావేరి నీకో మాట ‘నువ్వు లేని నా జీవితం అసంపూర్ణం. నిన్ను అర్థం చేసుకోలేకపోయా. నీమీద నాకున్న పిచ్చి ప్రేమే నన్నలా మాట్లాడించింది. క్షమించు.. ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. జీవితాంతం నిన్ను ఆనందంగా చూసుకుంటానని భరోసా ఇస్తున్నా. నా విన్నపాన్ని ఆలకిస్తావని ఆశిస్తున్నా.
ఫ్రెండ్స్‌... ఒకసారి ప్రేమ నన్ను మోసం చేసింది. మరోసారి ప్రేమను నేను నిర్లక్ష్యం చేశాను. అనుభవంతో చెప్తున్నా... మిమ్మల్ని ప్రేమించేవారిని ఎలాంటి కారణంతోనూ విస్మరించకండి. నాలా బాధపడకండి.

- పి.పి.రెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు