Published : 25 Apr 2020 00:41 IST

అది నిజం.. నేను అబద్ధం!

శీతకాలం సాయంత్రం. సూరీడు మెల్లగా కొండగుహల్లోకి జారిపోతున్నాడు. మసక మసక వెలుతురు. గిలిగింతలు పెట్టే చలి. ఆఫీస్‌ నుంచి వస్తున్నాన్నేను. భాగ్యనగర శివారులో మా ఇల్లు. ప్రధాన రహదారి నుంచి మా ఇంటికి రెండు దార్లుంటాయి. రోజూ వెళ్లే దారిలో కాకుండా.. ఎందుకో యూటర్న్‌ తీసుకున్నా. బస్‌స్టాప్‌లో ఇంజినీరింగ్‌ కాలేజీ పిల్లలు. వారికి కాస్త దూరంగా ఒకరున్నారు. ఆమె కంటపడగానే చప్పున బండి ఆపేశా! బస్సు కోసం ఎదురు చూస్తోందామె. ఆ చూపులు ఎందుకో నాకు తగిలాయి. ఆ విశాల నేత్రాలు గతంలో చాలాసార్లు చూసిన గుర్తు. ఇంతలో ఆమె కళ్లలో నేను పడ్డాను. రెండు నిమిషాలు అయోమయంగా చూసింది. తర్వాత అనుమానంగా చూసింది. మరుక్షణంలోనే ఆప్యాయంగా అరనవ్వు నవ్వింది. నేనూ నవ్వాను! దగ్గరగా వెళ్లాను.
‘నువ్వూ!..’ అని ఆమె పూర్తి చేయకముందే.. ‘నేనే! బాగానే గుర్తుపట్టావే!’ అన్నా! ‘ఓహ్‌! ఎలా ఉన్నావ్‌ నాగరాజు’.. వెంటనే.. ‘గ సైలెంట్‌!’ అన్నాన్నేను. పకపకా నవ్వింది. ‘ఎన్నేళ్లయ్యింది చూసి. ఎలా ఉన్నావ్‌! ఏంటి ఇక్కడ?’ ప్రశ్నలు కురిపించా. ‘ఈ పక్కన ఇంజినీరింగ్‌ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నా! నువ్వేంటి ఇక్కడ?’ అడిగింది. ‘మా ఇల్లు ఈ పక్కనే ఉన్న కాలనీలో’ అని బదులిచ్చా. ఇంతలో బస్సు వచ్చింది. ‘బై. ఇంకోసారి కలుద్దామ’ంటూ బస్సు ఎక్కబోయింది. ‘రేపు ఓకేనా!’ అడిగా. ‘ఈవెనింగ్‌ ఫైవ్‌ థర్టీకి స్టాప్‌లో ఉంటాన’ని బస్సు ఎక్కేసింది.
తనతో కలిసి చదువుకుంది ఒకే ఏడాది. ఎనిమిదో తరగతిలో. సెలవులు, బందులు, ఇతర ఇబ్బందులు పోను ఎనిమిదిలో ఎనిమిది నెలలు రోజుకు ఎనిమిది గంటలు కలిశాం అనుకుంటా! అంతదానికే ఇంతలా ఎందుకు గుర్తుందంటే.. అరుదైన రూపం ఆమెది. అపురూప జ్ఞాపకం తను. అందంగా ఉండేది. అమాయకంగా కనిపించేది. నోరెత్తితే ప్రవాహమే. మెరుపు వేగంతో మాట్లాడేది. ఆ చిలుక పలుకుల్లో కొన్ని అక్షరాలు ఎగిరిపోయేవి. గలగల మాట్లాడేస్తుంటే ఆమె పెదాల వంకే చూసేవాణ్ని. ముడుచుకుంటూ, విచ్చుకుంటూ మాయాజాలం చేసేవి. ఆ పెదిమలపై తేటగీతిలో ఓ శతకం రాసేయొచ్చు. మౌనంగా ఉన్నప్పుడు చూపులతో మాట్లాడేది. ఆ కళ్ల గురించైతే ఏకంగా కావ్యాలే రాయొచ్చు. అందుకే పదహారేళ్ల తర్వాత తారసపడినా నా కళ్లు వెంటనే పసిగట్టాయి. మనసు మరుక్షణం గతి తప్పింది. ఎప్పుడు తెల్లారుతుందా.. ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నా.
మర్నాడు ఆఫీసుకు సెలవు పెట్టేశా! సాయంత్రం ఐదు గంటల కల్లా బస్‌స్టాప్‌ చేరిపోయా! సరిగ్గా ఐదున్నరకు తనొచ్చింది.
‘ఎప్పుడొచ్చావ్‌ నారాజు’ అంది కొంటెగా!
‘నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నానంటే నమ్ముతావా!’
‘అలాంటోడివే నువ్వు’ అని కొంటెగా నవ్వింది.
‘ఇంకా మర్చిపోలేదా!’ అడిగా!
‘ఫస్ట్‌ లవ్‌ లెటర్‌ ఎవరు మర్చిపోతారు’ అంది.
ఎనిమిదిలోనే తనకు ఎనిమిది పంక్తుల్లో అందమైన కవిత రాసి ప్రపోజ్‌ చేశా. వాళ్ల నాన్నకు చెప్పింది. ఆయన కానిస్టేబుల్‌. స్కూలుకొచ్చి వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోయాడు. నేను మాత్రం తనను చూడటం ఆపలేదు. మాట్లాడటం మానలేదు. మళ్లీ ఆ సంఘటన గుర్తు చేసుకొని నవ్వుకున్నాం. కుశల ప్రశ్నలు అయ్యాయి. ఫోన్‌ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. బస్సు వచ్చింది. ఎక్కబోతుంటే.. ‘నేను డ్రాప్‌ చేస్తాలే! బస్సు వెళ్లనీ’ అన్నా! ‘ఇప్పుడు నేను స్టూడెంట్‌ కాదబ్బాయ్‌! లెక్చరర్‌ని’ అని నవ్వేసి బస్సు ఎక్కింది. నాలుగు రోజులు అభిమానాలు ‘చాట్‌’కున్నాం. రెండు నెలల్లో మరింత దగ్గరయ్యాం.
ఓ ఆదివారం విశ్రాంతిగా కలవాలనుకున్నాం. ఇద్దరం కలిసి రెస్టారెంట్‌కు వెళ్లాం. ఎందుకో ఉత్సాహంగా కనిపించలేదు. కళ్లు చిన్నబుచ్చుకున్నాయి. మోవి మొగ్గలా ముడుచుకుంది. ఎందుకలా ఉన్నావంటే.. ‘ఏం లేదం’ది. లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని.. ఏం ఆర్డరిద్దాం’ అంటూ మెనూ కార్డు చేతుల్లోకి తీసుకుంది. లంచ్‌ పూర్తయింది. బయటకొచ్చాక.. బుగ్గల మీదికి జారిన కన్నీరు తుడుచుకుంటూ కనిపించింది. ‘ఏమైంది? నీ ప్రాబ్లమ్‌ నాతో షేర్‌ చేసుకోకూడదా!’ అనడిగా! ఓయూ క్యాంపస్‌కి వెళ్దామంది. ఆర్ట్స్‌ కాలేజ్‌ పక్కన పచ్చికలో కూర్చున్నామిద్దరం. ‘ఇప్పుడైనా చెప్పు ఏమైంది?’ అడిగా. ‘ఇప్పటికీ ఇష్టపడుతున్నావా నన్ను?’ అంది. ‘అవును’ అన్నా! ‘నీ దగ్గరో విషయం దాచాను’ అంది. ‘నాకు మూడేళ్ల కిందట పెళ్లయింది. రెండేళ్ల బాబు కూడా! మా ఆయన ఉద్యోగం చేయడు. ఇంట్లోనే ఉంటాడు. నన్ను ప్రేమగా చూసుకోడు. నా జీవితం ఇక శూన్యం అనుకుంటున్న టైంలో.. నువ్వు కలిశావు. కొత్త ఉత్సాహాన్నిచ్చావు. నీ ఆప్యాయతలో నాకు ఓదార్పు దొరికింది. రోజంతా నీ గురించే ఆలోచిస్తున్నా’ అని ఆగిపోయింది. గొంతు సవరించుకున్నాను. ‘నేను కలవక ముందు ఎప్పుడైనా గుర్తొచ్చానా?’ అడిగా. లేదంది. ‘కలవకపోయుంటే.. నా గురించి ఆలోచించేదానివా’ అడిగా.. మళ్లీ లేదంది. ‘రోజులో మీ ఆయన, బాబు ఎన్నిసార్లు గుర్తొస్తారు’ అడిగా.. ఎప్పుడూ వారి ధ్యాసే నాకు అని బదులిచ్చింది. ‘అది నిజం. నేను అబద్ధం. అది జీవితం. ఇది కల. నీ సమస్యకు పరిష్కారం నా ఆప్యాయత కాదు. మీ ఆయనలో మార్పు. నీలో పట్టుదల. ఓ స్నేహితుడిగా నా సపోర్ట్‌ ఎప్పుడూ ఉంటుంది’ అని చెప్పి ఆగిపోయా!‘ఆలస్యమైంది వెళ్దామా’ అంది. ఇంటి దగ్గర దిగబెట్టి.. మా ఇంటికి వచ్చేశా!! నాలుగు రోజుల తర్వాత ఆమె నుంచి మెసేజ్‌. ‘థ్యాంక్యూ ఫర్‌ యువర్‌ సపోర్ట్‌. మా ఆయన్ను మార్చుకుంటాను. కానీ, నిన్ను కలవలేను. బై నారాజు’ అని సందేశం పంపింది. అదే ఆమె పంపిన చివరాఖరి మెసేజ్‌. మళ్లీ నేను తనకు మెసేజ్‌ చేయలేదు. తనూ నాకు ఫోన్‌ చేయలేదు. మూడేళ్ల తర్వాత.. మూడో వ్యక్తి ద్వారా ఇప్పుడు వాళ్లిద్దరూ బాగుంటున్నారని సందేశం పంపింది. ఓ మంచి స్నేహితుడిగా మిగిలిపోయానన్న తృప్తి నాకు మిగిలింది.

- నా(గ)రాజు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు