Published : 09 May 2020 00:50 IST

నా రాక ఆలస్యమైందా.?

కొత్త ఉద్యోగం.. కోటి కలలతో హైదరాబాద్‌ చేరుకున్నా.. భిన్న స్నేహితులు, విభిన్న యాసలు.. ఉల్లాసంగా సాగుతోన్న రోజులవి.. ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వచ్చిందో ఓ శివంగి సేన. చూడ్డానికి అందగత్తెలే.. అయినా కోతి చేష్టలకేం తక్కువ లేదు.. మా డిపార్ట్‌మెంట్‌ కాదు. వారు అలా నడిచొస్తుంటే.. వినువీధిలో చుక్కల్లా మెరిసిపోయే వారు.. అందరి కళ్లు వారిపైనే. నా కళ్లు మాత్రం తననే వెతికేవి. ఇంతలో ‘అందంగా ఉంది కదరా కృష్ణా.. అలానే అనిపిస్తుంది.. ఇదంతా ఆకర్షణే’నని నాలోని ఆత్మారాముడి ఇన్‌పుట్స్‌. నిజమేకదా! అనుకుని లైట్‌ తీసుకునే వాడిని. కొన్ని రోజుల తర్వాత ఆ బ్యాచ్‌లో ఓ అమ్మాయి నా గురించి అడుగుతోందని నా ఫ్రెండు చెప్పింది. ఆట పట్టించడానికేమోనని నవ్వి ఊరుకున్నా. ఓ రోజు తను నా కొలీగ్‌తో మాట్లాడుతుంటే మా దోస్తులు చూసి.. ‘అదిగో ఆ అమ్మాయే. మనోడిని నీ గురించే అడుగుతోంది’ అని చూపించారు. చూసి షాక్‌ అయ్యా. నా కళ్లు వెతికింది ఈ దొరసాని కోసమే.. దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్యే, అనుకుంటుండగానే ఆత్మారామ్‌ మళ్లీ మొదలెట్టాడు. మళ్లీ వెనక్కి తగ్గా. అసలే మొదటి ఉద్యోగం.. ఇంకా శిక్షణలోనే ఉన్నాం.. ఇప్పుడలాంటివి వద్దనుకున్నా. కానీ, తను నా గురించి ఎందుకు ఎక్కువగా అడుగుతోందో తెలుసుకుందామని ఓ రోజు కాల్‌ చేశా. ‘నీకేం కావాలి? ఎందుకు నా గురించి అందర్నీ అడుగుతున్నావ్‌?’ అని కాస్త గట్టిగానే అడిగా! అటు నుంచి ఒకే మాట.. స్వీట్‌ వాయిస్‌తో ‘సారీ అండి.. మీరు బాగుంటారు.. మా ఫ్రెండ్స్‌ ముందు కాస్త బిల్డప్‌ ఇద్దామని అడిగానంతే’ అంది. ఆ గొంతులోని మాధుర్యం విన్నాక నా గొంతులోని గాంభీర్యం.. నాలోని ఆవేశం ఆవిరైపోయాయి. మాటామాటా కలిసింది.. ఇక ఫోన్‌ ముచ్చట్లు.. వాట్సాప్‌ చాట్‌లు షరా మామూలే. తనతో మాట్లాడుతుంటే నాతో నేను మాట్లాడుకున్నట్టే. ఎంత అల్లరి పిల్లనో అంత బాధ్యతలు, కుటుంబం, ఫ్యూచర్‌ గురించి ఆలోచిస్తుంది.

చూస్తుండగానే రోజులు కరిగిపోయాయి.. ఓ రోజు ఫోన్‌ చేసి ‘జాబ్‌ మానేస్తున్నా. నాన్నకి ఇంట్లో ఇబ్బంది అవుతుందంటా.. రమ్మన్నారు.. ఇక అక్కడే.. ‘నిజానికి ఉద్యోగం మానేయడం అస్సలు ఇష్టం లేదు. కానీ తప్పదు’ అంది. వారం రోజుల్లో తన ప్రయాణం. ఒకసారి బయట కలుద్దామా కృష్ణా అంది. ఓ రోజు కలిసి రెస్టారెంట్‌కి వెళ్లాం. సరదా మాటలతో సమయమే తెలియలేదు. తిరిగి వెళ్లేటపుడు ఆశగా ఒక సెల్ఫీ అంది. అదే మా ఇద్దరి ఫస్ట్‌ ఫొటో.. ఫస్ట్‌ మీటింగ్‌ కూడా. ‘రేపే బయల్దేరుతున్నా.. నా జీవితంలో మరిచిపోలేని రోజులివి మళ్లీ ఎప్పుడు కలుస్తామో.. ఇక వెళ్లొస్తా కృష్ణా..’ అంది. ఆ క్షణం తన కళ్లు నాకు ఏదో చెప్పడానికి ప్రయత్నించి చెప్పలేకపోయినట్లు నా మనసు పసిగట్టింది. తను ఇంటికెళ్లినా.. దూరం మా ఇద్దరిని మరింత దగ్గర చేసింది. ఉన్నట్టుండి ఓ రోజు ‘కృష్ణా నీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా.. నీవంటే నాకు చాలా ఇష్టం.. నాకు నీతో లైఫ్‌ పంచుకోవాలనుంది.. నీవు నాపక్కన ఉంటే ఏదో తెలియని ధైర్యం.. చాలా ఆలోచించా.. నేనంటే నీకిష్టమా! మనం పెళ్లి చేసుకోవచ్చుగా’ అని అడిగేసింది. నేనంటే తనకు ఇష్టమని తెలుసు కానీ ప్రేమని గుర్తించలేకపోయా. ఒక్కసారిగా మౌనం ఆవహించింది. తనంటే నాకూ ఇష్టమే కానీ పెళ్లి చేసుకునేంత ప్రేమ ఉందో లేదో తెలీదు. అయినా ప్రేమ మీద నాకు మంచి అభిప్రాయం లేదు. భయం కూడా.. మళ్లీ ఆత్మారాముడు.. ‘ఇంట్లో ఒక్కడివే కొడుకువి.. ఉమ్మడి కుటుంబంలో నీవే పెద్దోడివి.. బాధ్యతలు అదనం.. నీపైనే కోటి ఆశలు పెట్టుకున్న అమ్మకు మంచి కోడలు, మన కుటుంబాన్ని మరో అమ్మలా చూసుకునే అమ్మాయి కావాలి కదా.. అంత పెద్ద నిర్ణయం ఇంత తక్కువ సమయంలో ఎలా తీసుకుంటావ్‌’ అని మొదలెట్టాడు. నాకు కొంచెం టైం కావాలన్నా. తనైతే నా గురించి ఇంట్లో చెప్పి ఒప్పించేసింది కూడా. ఆ మాట చెప్పేసరికి షాక్‌! ఒకింత ఆనందం ఉన్నా. ఏం చేయలేని నిస్సహాయత. ఇంట్లో ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోలేని పరిస్థితి. తనకి ఏం అర్థమయ్యిందో. నాతో మాట్లాడడం కాస్త తగ్గించింది. రోజులు గడుస్తున్నాయి. తనని మిస్‌ అవుతున్నానేమో అనిపించింది. అమ్మతో చెబితే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అంది. తన మాటలు.. నాపై చూపించిన ప్రేమ.. ఇవన్నీ మొద్దుబారిన నా మనసును నిద్ర లేపాయి. అప్పుడిక ఆత్మారాముడు రాలేదు. అంటే.. నాది నిజమైన ప్రేమే అని అర్థమయ్యింది. నా జీవితంలో తను ఉంటే బాగుంటుందనే నమ్మకంతోపాటు తను లేకుంటే ఏమై పోతానో అని భయమేసింది. నా ప్రేమని చెబుదామని ఫోన్‌ చేశా. కానీ, స్విచ్‌ ఆఫ్‌. రోజూ చేస్తుంటే.. ఓ రోజు కలిసింది. కానీ, తను మాత్రం నాకు అందనంత దూరం వెళ్లిపోయింది. నిజాయతీగా నా ప్రేమని చెబుదామనుకునే లోపే. తన పెళ్లి వార్త నా ఆలస్యాన్ని విషంగా మార్చేసింది. తన మాటలు నన్ను నిలువెల్లా కాల్చేశాయి.. ‘ఆలస్యమైంది కృష్ణా. అమ్మాయినైనా నేనే ప్రేమిస్తున్నా అని చెప్ఫా మా ఇంట్లో ఒప్పించా. నీ కోసం వేచి చూశా. నీ నుంచి సమాధానం లేదు. నాపై పెళ్లి చేసుకునేంత ఇష్టం లేదనుకున్నా. నీకు ఫోన్‌ చేయలేక.. ఇంట్లో వాళ్లు తెస్తున్న పెళ్లి ప్రపోజల్స్‌కి నో చెప్పలేక నరకం అనుభవించా. ఇంట్లో వాళ్లు నా మాటకి విలువిచ్చి నీతో పెళ్లికి ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ల మాటకి విలువిచ్చి వాళ్లు చూసిన సంబంధాన్ని ఒకే చేశా. ఇప్పుడు నేను నడి సంద్రంలో తుపాను తర్వాత అలల తాకిడికి ఒడ్డుకు చేరిన పడవని. చేరుకున్న తీరం నుంచే జీవితాన్ని మొదలెట్టాలి. అదే న్యాయం..’ అంది. నా నోట మాట రాలేదు. తనకేం సమాధానం చెప్పాలి? నాకు నేను ఏం సమాధానం చెప్పుకోవాలి? ఇద్దరి మధ్యా నిశ్శబ్దం. తనే ఫోన్‌ కట్‌ చేసింది. కొన్ని నెలల తన జ్ఞాపకాలు కళ్లముందుకి వచ్చాయి.

నన్ను నన్నుగా ఇష్టపడిన అమ్మాయి.. నేను చేసిన ఆలస్యానికి నా నుంచి దూరమైపోతుంటే గుండె తట్టుకోలేకపోతోంది. వాళ్ల నాన్నకి కాల్‌ చేసినా ఫలితం లేదు. నన్ను ఇంతలా ఇష్టపడి నా జీవితంలోకి రావాలని కలలుగన్న అమ్మాయిని ఇలా బాధ పెట్టానా?.. ఎన్నో ప్రశ్నలు. ఒంటరిలా అనిపించింది. కొన్ని నిద్ర కరువైన రాత్రుల నడుమ.. చాలా రోజులకు నాలో ఆత్మారాముడు మళ్లీ వచ్చి మాట్లాడాడు.. ‘రేయ్‌.. ఏమయ్యింది? నీదీ నాదీ ఏం తప్పులేదు. కాలం ఓ జ్ఞాపకాన్ని మనకి రుచి చూపించి ముందుకెళ్లిపోతుంది. ముందు తీపి.. తర్వాత చేదు. చేదునే గుర్తు చేసుకుంటే ఎలా? తీపినీ గుర్తు తెచ్చుకో. తనెప్పటికీ నీకో తియ్యని జ్ఞాపకం. నువ్వు కావాలని ఆలస్యం చేయలేదు.. తను తప్పించుకోవడానికి తొందరపడలేదు. పాత్రలు.. వాటి తీరుతెన్నులు మారాయంతే. ఆమెకి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పి నీ పాత్రకి న్యాయం చెయ్యి’ అన్నాడు. నిజమే కదా!! తన పేరు ప్రియా.. ‘నువ్వు సంతోషంగా ఉండాలి ప్రియా!!’

- కిట్టూ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని