ఇన్‌స్టాలో..ఇలా బెస్ట్‌!

నేటి తరానికి ఇన్‌స్టాగ్రామ్‌ ప్రధాన అడ్డాగా మారిపోయింది. ఎంత మంది ఫాలో అయితే అంత ఇమేజ్‌ ఉన్నట్టు. తెలిసిన కళల్ని ప్రపంచానికి పరిచయం...

Published : 09 May 2020 00:53 IST

‘సోషల్‌’ చిట్కాలు

నేటి తరానికి ఇన్‌స్టాగ్రామ్‌ ప్రధాన అడ్డాగా మారిపోయింది. ఎంత మంది ఫాలో అయితే అంత ఇమేజ్‌ ఉన్నట్టు. తెలిసిన కళల్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఇన్‌స్టాతో సెలబ్రిటీలైనవారు అనేక మంది ఉన్నారు. అంతేకాదు.. ఆలోచన ఏదైనా క్షణాల్లో నలుగురికీ తెలిసేలా చేసేందుకు ‘సోషల్‌’గా అధిక ప్రాధాన్యత ఇన్‌స్టాకే. లాక్‌డౌన్‌తో మరింత ఫ్రీ టైమ్‌ చిక్కడంతో విస్తృతంగా ఇన్‌స్టాపైనే సందడి చేస్తూ కనిపిస్తున్నారు యువత. మరి, మీకు ఇన్‌స్టాగ్రామ్‌ ఎకౌంట్‌ ఉందా? మీరెంత చురుకుగా ఉన్నారు? ఇవిగోండి ఈ చిట్కాలతో ఫాలోయింగ్‌ని పెంచుకొని మీరూ సెలబ్రిటీలైపోండి!

పంచుకుంటేనే పెరుగుతారు..

ఏదో అప్పుడప్పుడూ ఓ ఫొటోనో.. వీడియోనో.. పెట్టి నన్ను ఎవ్వరూ ఫాలో అవ్వడం లేదు అనుకోవడం పొరపాటు. ఎప్పటికప్పుడు చురుకుగా అన్ని అంశాలపై మీదైన స్పందనని తెలియజేస్తుండాలి. మీదైన స్టైల్‌తో ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేయాలి. సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ సంస్థలు కూడా తమ సర్వేల్లో ఇదే విషయాన్ని చెబుతున్నాయి. సందర్భోచితంగా మీ చుట్టూ జరిగే సంఘటనల్నీ నిశితంగా పరిశీలిస్తూ వాటిపైనా తగిన పోస్ట్‌లు పెడుతూ ఫాలోవర్స్‌ని పెంచుకోవచ్చు.

టాలెంట్‌ చూపించండి

‘ఎవరిని వారు ప్రత్యేకంగా నిరూపించుకుంటూ గుర్తింపు పొందడం’ సోషల్‌ మీడియాకు ఉన్న ప్రధాన లక్ష్యం. దాంట్లో భాగంగా మీలోని టాలెంట్‌ని ప్రదర్శించేందుకు ప్రధాన అడ్డాగా వాడుకోండి. ఉదాహరణకు మీరో ఫొటోగ్రాఫర్‌ అయితే మంచి ఫొటోలను పోస్ట్‌ చేయండి. రోజుకో థీమ్‌ని పెట్టుకుని పలు అంశాలపై ఫొటోల్ని తీసి పంచుకోండి. వాటికి తగిన ‘రైట్‌అప్‌’లు రాసి ఫొటో వెనకున్న ఆలోచనని పంచుకోండి. దీంతో మీరు టైమ్‌పాస్‌ వ్యక్తులు కాదు.. పక్కా ప్రొఫెషనల్‌ అని అర్థం అవుతుంది. అలా ఫొటోగ్రఫీని ఇష్టపడే వాళ్లందరూ మీకు ఫాలోవర్స్‌ అవుతారు.

కంటెంట్‌లో విషయం ఉండాలి

ఏదో ఒకటి షేర్‌ చేస్తున్నాం అంటే సరికాదు. మీరు పంచుకునే వాటిలో విషయం ఉండాలి. ఇతరుల్ని ఆలోచింపజేసేలా.. ఆగి మీ పోస్ట్‌ చూసేలా చేసినప్పుడే మీ కంటెంట్‌లో ఆసక్తికరమైన విషయం ఉన్నట్టు. ఆకతాయిగా అనిపించిందేదో పోస్ట్‌ చేస్తే మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఒక్కటే గుర్తుంచుకోవాలి.. మీకెవరైనా ఫాలోవర్‌ అయ్యారంటే తన విలువైన సమయాన్ని కొంత మీకు వెచ్చిస్తున్నట్టు.

వీడియోలు కూడా..

ఇన్‌స్టా అంటే... అదేదో కేవలం ఫొటో షేరింగ్‌లకే పరిమితం అనుకోవద్ధు వీడియోలతోనూ ఫాలోవర్స్‌ని పెంచుకోవచ్ఛు కొన్ని సర్వేల ప్రకారం ఫొటోలు పోస్ట్‌ చేసే వారికంటే తరచూ వీడియో క్లిప్‌లు, లైవ్‌, స్టోరీలు పోస్ట్‌ చేస్తున్న వారికే ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉందట. అందుకే కనీసం రెండురోజులకో స్టోరీ పోస్ట్‌ చేస్తూ అప్‌డేట్‌లో ఉండండి.

హ్యాష్‌ట్యాగ్‌లు జోడించాలి..

మీరు పెట్టిన పోస్ట్‌, షేర్‌ చేసిన వీడియో వీలైనంత ఎక్కువ మందికి చేరాలంటే? మీ పోస్ట్‌కి మరిన్ని లైక్‌లు రావాలంటే?.. హ్యాష్‌ట్యాగ్‌లు తప్పనిసరి. ఏదో ఒక హ్యాష్‌ట్యాగ్‌ కాకుండా మీ పోస్ట్‌కి తగిన కీవర్డ్స్‌ని ఉపయోగించండి. అలాగే, లొకేషన్‌ ట్యాగ్‌లు.. మీరేదైనా లొకేషన్‌లో ఫొటో దిగితే ఆ ప్రాంతాన్ని తెలుపుతూ లొకేషన్‌ని ట్యాగ్‌ చేయండి. దీంతో మీ అభిరుచులు, అభిప్రాయాలకు తగిన నెటిజన్లు మిమ్మల్ని ఫాలో అవుతారు.

‘టచ్‌’లో ఉండాలి..

ఫాలోవర్స్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండండి. మీ పోస్ట్‌కి వారు కామెంట్‌ చేస్తే రిప్లై ఇవ్వండి. లేదా సింపుల్‌గా ఓ లైక్‌ కొట్టండి. ఫాలోవర్స్‌ని సంపాదించడమే కాదు.. వారిని కాపాడుకోవడమూ ఓ కళే. ఎప్పుడూ ఫాలోవర్స్‌ని పెంచుకోవడమే కాదు. మీరూ ఇతరుల్ని ఫాలో అవ్వండి. అప్పుడే మీరూ ఇన్‌స్టాలో ఉన్నారని ఇతరులకు తెలుస్తుంది. అప్పుడే వాళ్లూ ఫాలో బ్యాక్‌ అవుతారు. అలాగే, ఇన్‌స్టాలో అధిక ఫాలోవర్స్‌ ఉన్న సెలబ్రిటీలనూ ఫాలో అవ్వండి. దీంతో ట్రెండింగ్‌లో ఉన్న అంశాలపై వారెలా స్పందిస్తున్నారో అర్థం చేసుకోవచ్ఛు అంతేకాదు.. వారి అప్‌డేట్స్‌ని ఫాలో అవుతూ సోషల్‌ మీడియా ప్రొఫైల్‌ని ప్రొఫెషనల్‌గా ఉంచడం ఎలాగో అర్థం చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని