Published : 16 May 2020 00:57 IST

మేడం..నా ప్రేమలో తప్పుందా?

నా పేరు నాగార్జున్‌.. అందరూ ముద్దుగా అర్జున్‌ అని పిలుస్తారు. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం. ఓ రోజు పనిలో భాగంగానే వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. తనని అక్కడే చూశా. అందానికి నిర్వచనంలా ఉంది. పేరు గిరిజ. మొదటిసారి ఓ అమ్మాయి నా కళ్లను దాటి మనసు వరకూ వచ్చింది. దీంతో కళ్లైతే విసుగ్గా నాతోనే వచ్చాయిగానీ.. మనసు మారాం చేసి అక్కడే ఆగిపోయింది. ఇక నేను ఎప్పుడు వాళ్లూరు వెళ్లినా తనని అదే పనిగా గమనించేవాడిని. తను మాత్రం ఇవేమీ పట్టనట్టు తనపని తను చేసుకునేది. ఓ రోజు మాత్రం చూసింది. జులై 10. నేను ఎప్పటికీ ఆ తేదీని మర్చిపోలేను. ఒకరోజు వాళ్ల కంపెనీలో ముగ్గుల పోటీ జరుగుతోంది. ఎలాగైనా అక్కడ తనతో మాట కలపాలి అనుకొని వెళ్లా. కావాలనే తనకి ఎదురుపడ్ఢా ఏం మాట్లాడాలో తెలియక... ‘ఎక్కడుంటారు?’ అని అడిగా. తనిచ్చిన సమాధానం అటుంచితే.. తన చూపు మాత్రం గుండెల్లో గుచ్చుకుంది. నేనూ తన కంట్లో పడ్డందుకు సంబరపడిపోయా. కొన్ని రోజులకు మా డిపార్ట్‌మెంట్‌తో తనకి పని పడింది. అప్పుడే మళ్లీ మా మధ్య మాట కలిసింది. తను నా పేరు తప్పు పలకడంతో చొరవ తీసుకుని నేనే మాట్లాడా. పని నిమిత్తం ఫోన్‌ నంబర్లు మార్చుకున్నాం. కానీ, నేను ఏదో ఒక వంకతో తనకి ఫోన్‌ చేసేవాడిని. తనని ఎప్పుడూ ‘మేడం..’ అని పిలిచే వాడిని.. తను కొంటెగా నవ్వేది. రోజులన్నీ క్షణాల్లా వెళ్లిపోతున్నాయి..

ఓ రోజు రాత్రి తనకి నా మనసులో మాట చెప్పేశా. ఫిబ్రవరి 20 ఆ రోజు. తను ఒప్పుకుంది. ఆ క్షణం ప్రపంచాన్ని జయించినట్టే అనిపించింది. రాత్రంతా నిద్ర పోలేదు. తెల్లారి తనను కలిసి మళ్లీ నా ప్రేమను చెప్పాకే మనసు కుదుటపడింది. ఆ క్షణం నా ప్రియమైన మేడం కళ్లలో ఆనందం, తన చిరునవ్వు ఎప్పటికీ మర్చిపోలేను. అది మొదలు తన మాటతోనే సూర్యోదయం అయ్యేది. హైదరాబాద్‌ నగరంలో ప్రేమికులకు కేరాఫ్‌ అడ్రస్‌లుగా ఉన్న అన్ని చోట్లా మా ఊసులే. మేడంకి నా పుట్టిన రోజంటే పండగే. నాపై చూపించిన ప్రేమను కొలవలేనేమో అనిపించేది. ఎంత మందిలో ఉన్నా నేను ‘మేడం!!!’ అని పిలిస్తే చాలు. ఎక్కడున్నానా? అని నన్ను వెతికేది. ఓ రోజు వాళ్ల కుటుంబ ఫంక్షన్‌లో అనుకుంటా.. తనని మొదటిసారి చీరలో చూశా. మన సంస్కృతి, సంప్రదాయాలకు ఆ క్షణమే సలామ్‌ చేయాలని అనిపించింది. దేవతలా నా ముందు నడిచి వెళ్తూ నన్ను చూసి.. కళ్లతోనే మాట్లాడింది. పెదాలపై చిరునవ్వుతోనే పలకరించింది. సినిమాల్లో చూడ్డమేగానీ.. నిజ జీవితంలోనూ ప్రేమ ఇంత అందంగా ఉంటుందా అనిపించింది. అలా మా ప్రేమ చాలా కాలం సాగింది. కానీ, ఓ రోజు నేను ఊహించని కుదుపు. ఫోన్‌ చేసి ‘మా ఇంట్లో ఒప్పుకోరు నన్ను మర్చిపో’ అంది. నాకు ఏం అర్థం కాలేదు. తేరుకుని మళ్లీ అడిగితే.. ‘నన్ను మర్చిపో అర్జున్‌. కారణాలు అడిగి ఇబ్బంది పెట్టకు’ అంది. నాకు ఉన్నట్టుండి జీవితం తలకిందులు అయినట్టు అనిపించింది. ప్రేమించడమే తెలిసిన నేను తనను ఎలా ఇబ్బంది పెడతా? తను ఒక్కసారి నా స్థానంలో ఉండి ఆలోచిస్తే తెలిసేది. నా బాధేంటో.. తనే లోకం అనుకుంటున్న సమయంలో ఇలా ఎందుకు మారిందో అర్థం కాలేదు. తనతో ఊహించుకున్న భవిష్యత్తు ఇప్పుడు చీకటి అయిపోయింది.

‘మేడం... నేను ఒకవేళ తప్పు చేస్తే ఇప్పటి వరకూ నువ్వు నాతో మాట్లాడని రోజులన్నీ శిక్షలే నాకు. తెలియక ఎప్పుడైనా నేను ఇబ్బంది పెట్టుంటే... క్షమించు. నన్ను మర్చిపో అని చాలా సింపుల్‌గా చెప్పావు. కానీ, నువ్వు నాపై చూపిన ప్రేమ నువ్వు చెప్పినంత సింపుల్‌గా లేదు. నా భవిష్యత్తు మొత్తం నువ్వే నిండిపోయావ్‌. ప్రేమంటే కలిసున్నప్పటి క్షణాలే కాదు.. విడిపోయినప్పుడు పడే బాధ కూడా. అంతెందుకు ఇప్పుడు నేను కలవాలని చేసే ప్రయత్నంలోనూ కొలవలేనంత ప్రేముంది మేడం!! ఇది చదివి నాతో మళ్లీ నువ్వు మాట్లాడతావని నేను కోరుకోవడం.. నీ ప్రేమని నేను అర్థించడమే అవుతుంది. నేను పడుతున్న బాధని నువ్వు అర్థం చేసుకుంటే చాలు. అప్పుడు నీకే తెలుస్తుంది. మన ప్రేమ కారణాలకు బలయ్యేంత బలహీనమైంది కాదని. నీ కోసం ఎదురు చూస్తుంటా అని చెప్పనుగానీ.. నీ జ్ఞాపకాలతో బతికుంటా అని మాత్రం చెబుతాను..

- మీ అర్జున్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు