యాప్‌ చెప్పే.. బీటెక్‌ పాఠాలు..

భవిష్యత్తు సాంకేతిక అవసరాలను ముందే ఊహించి ఆ దిశగా అడుగులేయడం తెలివైన టెక్కీల లక్షణం...

Updated : 16 May 2020 05:40 IST

భవిష్యత్తు సాంకేతిక అవసరాలను ముందే ఊహించి ఆ దిశగా అడుగులేయడం తెలివైన టెక్కీల లక్షణం. అదే చేశారు ఇద్దరు మిత్రులు. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు చెప్పేందుకు ఓ యాప్‌ రూపొందించారు. అది కరోనా కాలానికి సరిగ్గా సరిపోయింది. వరంగల్‌కు చెందిన ధీరజ్‌ అల్లంనేని, హైదరాబాద్‌కు చెందిన వంశీకృష్ణతో కలిసి ‘సైనో హబ్‌’ అనే అంకుర సంస్థను ప్రారంభించారు. దీని ద్వారా ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ వల్ల కళాశాలలు మూత పడ్డాయి. విద్యార్థులు ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో వీరు యాప్‌ ద్వారా వేలాది మందికి ఉచిత తరగతులు నిర్వహిస్తున్నారు.

ధీరజ్‌, వంశీ హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ కళాశాలలో 2017లో ఈసీఈ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ధీరజ్‌ అమెరికాలోని లోవా విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్‌ పూర్తి చేశారు. వంశీ ఓ అంకుర సంస్థలో కొలువులో చేరారు. అప్పుడే క్యాంపస్‌ల నుంచి కొలువులకు వచ్చాక ఎదురయ్యే సమస్యలు ఏంటో వారికి తెలిశాయి. మన దేశంలో ఇంజినీరింగ్‌ పూర్తయినా సరైన నైపుణ్యాలు లేక వారి అర్హతకుతగ్గ కొలువులు సాధించడం లేదని భావించి, వారి కోసం ఏదైనా కొత్తగా ప్రారంభిద్దామనుకున్నారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే సైనోహబ్‌. మంచి పేరున్న ఇంజినీరింగ్‌ కళాశాలల అధ్యాపకుల ద్వారా ఆన్‌లైన్‌ తరగతులు చెప్పిస్తూ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. రోజులో కొంత సమయం లైవ్‌ తరగతులు కూడా ఉంటాయి. లైవ్‌ క్లాసెస్‌కు ముందు అలర్ట్స్‌ వెళతాయి. దాన్ని బట్టి ఆ సమయంలో ఎవరైనా ఆన్‌లైన్‌ తరగతులు నేరుగా వినొచ్ఛు కొవిడ్‌ లాక్‌డౌన్‌ వల్ల ఆన్‌లైన్‌ తరగతులకు ఆదరణ పెరగడంతో యాప్‌ వాడే వారి సంఖ్య బాగా ఎక్కువయ్యిందట. అనేక ఇంజినీరింగ్‌ కళాశాలలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నా, నెట్‌ కనెక్షన్‌ సరిగా లేక, మారుమూల ప్రాంతాల్లో ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్న వారు వీరి యాప్‌ ద్వారా తరగతులు వింటున్నట్టు ధీరజ్‌ చెబుతున్నారు.

కొన్ని ప్రత్యేకతలు..

విద్యార్థులు రోజులో ఎప్పుడైనా యాప్‌ ద్వారా క్లాసులు వినొచ్చు.

ఇప్పటికి ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులకు పాఠాలు అందుబాటులో ఉన్నాయి. మిగతా సంవత్సరాల వారి కోసం రూపొందిస్తున్నారు.

తరగతులు వింటూ నోట్సు రాసుకోవడం, లైవ్‌ తరగతులు విని సందేహాలు కూడా నివృత్తి చేసుకునే విధంగా యూజర్‌ ఫ్రెండ్లీగా యాప్‌ను తీర్చిదిద్దారు.

గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఆండ్రాయిడ్‌ మొబైళ్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇందులో పాఠాలు చెప్పే అధ్యాపకులు పలు ఐఐటీ, ఎన్‌ఐటీల్లో పనిచేస్తున్నవారు కూడా ఉన్నారు.

- జి.పాండురంగశర్మ, ఈనాడు, వరంగల్‌

- వేల్పుల కుమారస్వామి, ఈనాడు జర్నలిజం స్కూల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని