Published : 23 May 2020 00:28 IST

వాస్తవాల నడుమ నేను.. నా ప్రేమ

ఆ రోజు మా చెల్లి పెళ్లి. అప్పుడే తనని మొదటిసారిగా చూశా. నేను హీరో.. తను హీరోయిన్‌ కాకపోయినా.. పెళ్లి పందిట్లో స్క్రీన్‌ ప్లే మాత్రం అచ్చం సినిమాలానే.. తనని చూద్దామని ప్రయత్నిస్తే తన నల్లని కురులు కారు మబ్బుల్లా అడ్డొస్తున్నాయ్‌.. ఏదో వంకతో ఇంకో వైపు వెళ్లి చూశా.. నా రాక ఆలస్యమైందన్నట్టుగా తనని చూసే లోపే చటుక్కున వెనక్కి తిరిగి ఎవరితోనో మాట్లాడుతోంది. తను ధరించిన లంగా ఓణీ నా తొలిప్రేమకి బోణీగా అనిపించింది. మండపంలో నేనూ, తనూ మాత్రమే ఉన్నట్టుగా చూస్తుండిపోయా. తను వెనక్కి తిరగడం.. నన్ను చూసీ చూడనట్టుగా దాటుకుని వెళ్లిపోవడం.. అంతా క్షణాల్లో జరిగిపోయింది. తేరుకుని తననే చూస్తున్న నాకు.. మా వాళ్లు ఎంతలా పిలిచినా చెవికెక్కడంలేదు. పెళ్లిలో అల్లరంతా తనదే. వడ్డింపుల్లో.. పంపకాల్లో.. తనవైపు నా అడుగులు.. పెళ్లయ్యాక చెల్లి, బావ కారులో తనూ ఎక్కింది. తన కోసం నేనూ కారెక్కా. బావ వాళ్లూరెళ్లిపోయా..! ప్రయాణంలో మెల్లగా తనతో మాట కలిపా. తన నంబర్‌ తీసుకున్నా. మరుసటి రోజు తిరిగి ఊరు పయనమయ్యా. ఊరెళ్లగానే ఫోన్‌ చేశా. తన మాటల్లోనే తెలిసింది. తనకు నేను బావ వరసవుతానని.. కొన్నిరోజులకి వాట్సాప్‌ చాట్‌లు, ఫోన్‌కాల్‌లు, వారాంతాల్లో మీటింగ్‌లు షరా మామూలే.. నెలలు గడుస్తున్నాయ్‌. ఓ రోజు ఇక నా మనసులో మాట చెప్పేద్దాం అని తనని కలిసేందుకు బయలుదేరా. తనకెంతో ఇష్టమైన ప్రదేశంలో కలిశాం. కుశల ప్రశ్నలయ్యాక.. నా నోటి నుంచి మాట జారుతుండగా..!! ఆ మాటే కాస్త ముందుగా తనే చెప్పింది. అదీ కాస్త తడబడుతూ.. ‘నీ ప్రవర్తనా, మాటతీరు నాకెంతగానో నచ్చేశాయ్‌ చిన్నా. నీతో ఉంటే జీవితాంతం ఇలాగే సంతోషంగా ఉంటాననిపిస్తోంది. నిన్ను ప్రేమిస్తున్నా. నువ్వూ ఆలోచించుకొని నిర్ణయం చెప్పు’ అంటూ తన మనసులో మాట చెప్పి పరుగున అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంకేముంది లోలోపలే ఎగిరి గంతేయడం నా వంతైంది.

ఇక ప్రతీ క్షణం తన గురించే ఆలోచన. తనతో నా జీవితం ఎలా సాగుతుందో.. తన మనసు గెలిచినందుకు సంతోషం కంటే తనని ఎలా చూసుకుంటానో అనే భయమే ఎక్కువైంది. ఎందుకంటే ఉన్నత కుటుంబం తనది. తనేది కోరినా క్షణాల్లో ముందుంచే తల్లిదండ్రులు. మరి, నేను? ఉద్యోగం, సద్యోగం ఏమీ లేదు. ఇదే విషయం తనకి చెప్తే ‘జీవితాంతం నువ్వు నా వెన్నంటి ఉంటే అదే నువ్వు నాకిచ్చే నిజమైన సంతోషం’ అంది. తనకి నాపై ఉన్న ప్రేమ అలాంటిది. అయినా ఎందుకో నా మనసు ఒప్పుకోవడం లేదు. తన స్థాయికి తగినట్టు తనని ఆనందంగా చూసుకునే అబ్బాయే సరైన జోడి అనిపించింది. ఇక ఆ రోజు నుంచి తనని దూరం పెట్టా. ఓ రోజు కావాలనే గొడవ చేశా. ఆ రోజు నుంచి పూర్తిగా తను నాతో మాట్లాడ్డం మానేసింది. రోజులు, వారాలు గడిచిపోయాయి. నా జీవితం నన్ను వదిలి దూరంగా పరుగెడుతున్నట్లు అనిపించింది. ‘చిన్నా..’ అని తన నోటి నుంచి వచ్చే ఆ రెండక్షరాలు నాకెన్నో అందమైన రాత్రుల్నిచ్చాయి. జీవితాంతం తన నోటి వెంట ఆ పేరు వినాలనుకున్నా. నిర్ణయం మార్చుకున్నా. మరుసటి రోజే సిటీ బయలుదేరా. ఉద్యోగం కోసం ఎన్నో ఆఫీసులు తిరిగా! ఉద్యోగం సంపాదించా. తనకి విషయం చెబుదామని ఊరు బయల్దేరా. కానీ నేను చేసిన గాయం పెద్దదయ్యింది. ఆ బాధ తన మాటల్లో తెలిసింది.. ‘నువ్వేంటో పూర్తిగా తెలీకుండా నిన్ను ఇష్టపడ్ఢా నువ్వే జీవితం అనుకున్నా. కానీ, నువ్వు చేతగాని వాడిలా మాట్లాడావ్‌. నీ మాటలతో నా మనసుని విరిచేశావ్‌. నీతో ఉంటే జీవితం సంతోషంగా ఉంటుందనే ఆలోచనే రాకుండా చేశావ్‌. నమ్మకం పోయింది. దానితో పాటు ప్రేమ కూడా చచ్చిపోయింది. నన్ను మర్చిపో.’ అంది. తనకు సమాధానం చెప్పుకునే స్థానంలో నేనున్నా.. వినే స్థితిలో తను లేదు. కంగారు పడి నేను వేసిన తప్పటడుగుతో నా గొంతు మూగబోయింది. నచ్చచెప్పేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నించా. కానీ, ప్రయోజనం లేదు.

తెలిసీ తెలియక పుట్టే ప్రేమ తర్వాత.. మనకు ఎన్నో వాస్తవాలు ఎదురవుతాయి. అవి భయపెడతాయి. అప్పుడు మనం భయపడాలి కూడా. అప్పుడే ప్రేమని గెలిపించుకోవాలనే ఆరాటం పుడుతుంది. అది కాస్తా సంకల్పం అవుతుంది. ఈ క్రమంలో తెలిసో తెలియకో ఏదైనా తప్పటడుగు వేస్తే.. అది మళ్లీ బలంగా నిలబడేందుకే. అది నువ్వు అర్థం చేసుకుంటే మన ప్రేమ నిలుస్తుంది.. గెలుస్తుంది.. ఇక నీ ఇష్టం.. నీ కోసం ఎదురు చూస్తా అని చెప్పనుగానీ. నిన్ను కలకాలం సంతోషంగా చూసుకునేందుకు సిద్ధంగా ఉంటా అని ధైర్యంగా చెప్పగలను.

- నీ చిన్నా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని