ఆ కళ్లకు సంకల్ప బలముంది

చూపు లేకపోయినా అమ్ముందిగా చాలనుకున్నాడు. వేలు పట్టి నడిపిస్తుందిలే అని ధైర్యంగా తొలి అడుగులు వేశాడు. ఇంతలోనే విధి ఉన్న ఆశని మిగేసింది..అమ్మని తీసుకెళ్లిపోయింది. దారంతా మళ్లీ చీకటే.. అయినా నడక ఆపలేదు.. అమ్మమ్మ చేయందుకున్నాడు. స్కూలు..కాలేజీ చదువులు దాటేశాడు..

Published : 30 May 2020 00:51 IST

ప్రేరణ

చూపు లేకపోయినా అమ్ముందిగా చాలనుకున్నాడు. వేలు పట్టి నడిపిస్తుందిలే అని ధైర్యంగా తొలి అడుగులు వేశాడు. ఇంతలోనే విధి ఉన్న ఆశని మిగేసింది..అమ్మని తీసుకెళ్లిపోయింది. దారంతా మళ్లీ చీకటే.. అయినా నడక ఆపలేదు.. అమ్మమ్మ చేయందుకున్నాడు. స్కూలు..కాలేజీ చదువులు దాటేశాడు.. అంతేనా..  బ్యాటు పట్టి క్రికెట్‌ ఆడాడు.. కెప్టెన్‌గా టీమ్‌ని ముందుండి నడిపించాడు.. అంతర్జాతీయంగా రాణించేందుకు సిద్ధమయ్యాడు..మళ్లీ విధి యాక్సిడెంట్‌ రూపంలో యార్కర్‌ వేసింది.. కాలి గాయంతో మూడు నెలలు మంచం దిగనివ్వలేదు.. ఆట ఆవిరైపోయింది.. అయితేనేం.. తన కళ్లకున్న సంకల్పబలంతో మరో లక్ష్యం వైపు అడుగులేశాడు.. బ్యాంకు పీఓ అయ్యాడు... ఇంతకీ అతనెవరంటే విద్యాసాగర్‌రెడ్డి..ఊరు విశాఖపట్నం.. పుట్టుకతోనే అంధుడినైనా కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో నా ఈ జర్నీ సాగిస్తున్నా అని ‘ఈతరం’తో మాట కలిపాడు..
నాన్న ప్లంబర్‌. అమ్మ టీచర్‌. నా అంధత్వం నాకు ఎప్పటికీ అవరోధం కాకూడదని నన్ను ఎన్నో రకాలుగా ప్రోత్సహించారు. వారి మాటలు నన్ను చదువుల తల్లికి దగ్గర చేశాయి. అమ్మ నేను మూడో తరగతి చదివేటప్పుడే చనిపోయింది. తర్వాత అమ్మమ్మే నా స్కూల్‌ చదువుకి దిక్సూచిగా మారింది. బ్రెయిలీ లిపిలోనే నా చదువంతా. పదో తరగతిలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడినయ్యా. తర్వాత ఇంటర్‌ ‘హెచ్‌.ఇ.సి.’. అధ్యాపకులు చెప్పే పాఠ్యాంశాలను సెల్‌ఫోన్లో రికార్డు చేసుకుని పదేపదే వింటూ నోట్సు రాసుకునే వాడిని. డిగ్రీలో హెచ్‌.ఇ.పి. కోర్సును తీసుకుని ప్రథమ శ్రేణిలో పాస్‌ అయ్యా. తర్వాత  ఆంధ్రవిశ్వవిద్యాలయంలో అర్థశాస్త్రంలో ఎం.ఎ. పూర్తి చేశా. అమ్మ కోరిక మేరకు మంచి ఉద్యోగం సాధించాలనుకున్నా. బ్యాంకు ఉన్నతాధికారిగా స్థిరపడాలనుకున్నా. దీంతో పీజీ తర్వాత బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు మినహా ఏ ఇతర పోటీ పరీక్షలు రాయలేదు. మొత్తం పదకొండుసార్లు వివిధ బ్యాంకుల పీఓ పరీక్షలు, ఐ.బి.పి.ఎస్‌. పీఓ పరీక్షలు రాశా. పదకొండు సార్లూ ఇంటర్వ్యూ వరకే వెళ్లా. తాజాగా ఇండియన్‌ బ్యాంకు, ఆంధ్రప్రగతి   గ్రామీణ బ్యాంక్‌లకు పీఓగా ఎంపికయ్యా.
క్రీడల్లోనూ ముందే..
చదువులోనే కాదు క్రీడల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు విద్యాసాగర్‌. ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడల్లోనూ రాణించాలని భావించాడు. 20 ఏళ్ల వయసులో సాధన మొదలెట్టి.. ఏడాది తిరగకుండానే విశాఖ అంధుల క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌ అయ్యాడు. ఎనిమిదిసార్లు జాతీయస్థాయి పోటీల్లోనూ, ఆరుసార్లు సౌత్‌జోన్‌ పోటీల్లోనూ ఆంధ్రప్రదేశ్‌ తరఫున ఆడాడంటే క్రికెట్లో అతని ప్రతిభ అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రతిభతోనే భారత్‌ తరఫున ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లే అంధుల జట్టుకు 25 మంది ప్రోబబుల్స్‌ను ఎంపిక చేయగా అందులో ఒకడిగా విద్యాసాగర్‌రెడ్డి ఎంపికయ్యాడు. కానీ అనుకోని రోడ్డు ప్రమాదం తనని పోటీలో పాల్గొనే అవకాశాన్ని దూరం చేసింది. ఆ ప్రమాదంలో తన కుడికాలు తీవ్రంగా దెబ్బతింది. దీంతో తరువాతి కాలంలో పూర్వపుస్థాయిలో ఆడలేక క్రికెట్‌కు దూరమయ్యాడు.


కంప్యూటర్‌ పరిజ్ఞానంలోనూ..
అంధులు ఎలాంటి ఇబ్బందీ పడకుండా కంప్యూటర్‌ను ఉపయోగించడానికి వీలుగా అందుబాటులోకి వచ్చిన ‘జాస్‌’ సాఫ్ట్‌వేర్‌ను కూడా నేర్చుకున్నాడు. విశాఖలోని ఎల్‌.వి.ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌లో మూడు నెలల శిక్షణ పొంది అంధుడిగా తనకున్న పరిమితుల్ని అధిగమించి కంప్యూటర్‌ను కూడా పూర్తిస్థాయిలో ఉపయోగించగలుగుతున్నాడు.
- బి.ఎస్‌.రామకృష్ణ, ఈనాడు, విశాఖపట్నం


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని