నువ్వు కాదన్నావ్‌..నేను గెలిచాను

లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌.. ఈ మాట ఎప్పుడూ నాకు ఫూలిష్‌లా అనిపించేది. అనన్యని చూశాక ఆ అభిప్రాయం మారింది. ఆరోజు మా ఇంటి దగ్గరి బస్టాపులో మెరుపుతీగెలా కనపడింది తను. ఒక్కసారిగా నా గుండెలో కోటి గిటార్లు మోగాయి. తను కనిపించినప్పుడల్లా నా ప్రమేయం లేకుండానే అనుసరించేవాణ్ని. రోజూ ఫాలో అవుతున్నా ఒక్కరోజైనా ఓర కంట చూసేది కాదు.

Updated : 24 Oct 2020 01:39 IST

లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌.. ఈ మాట ఎప్పుడూ నాకు ఫూలిష్‌లా అనిపించేది. అనన్యని చూశాక ఆ అభిప్రాయం మారింది. ఆరోజు మా ఇంటి దగ్గరి బస్టాపులో మెరుపుతీగెలా కనపడింది తను. ఒక్కసారిగా నా గుండెలో కోటి గిటార్లు మోగాయి. తను కనిపించినప్పుడల్లా నా ప్రమేయం లేకుండానే అనుసరించేవాణ్ని. రోజూ ఫాలో అవుతున్నా ఒక్కరోజైనా ఓర కంట చూసేది కాదు. అయినా ఏదోలా తంటాలు పడి వివరాలు కనుక్కున్నా. ‘చాలా డీసెంట్‌ అమ్మాయి. లవ్వూ గివ్వూ తనకి నచ్చవు. వెంటపడి టైం వేస్ట్‌ చేసుకోకు’ సమాచారంతోపాటు సలహా ఇచ్చాడో ఫ్రెండ్‌. ఆ మాట విన్నాక తనపై ఇష్టం రెట్టింపైంది. అదే ధ్యాసతో రెండేళ్లు తన వెనకాలే తిరిగా.
ఫేర్‌వెల్‌ డే నాడు మొదటిసారి మాట్లాడింది. మాట కలిపింది అనడం కన్నా నాకు వార్నింగ్‌ ఇచ్చింది అనొచ్చు. ‘మిస్టర్‌ రాజ్‌.. నన్ను ఫాలో చేసింది చాలు. ఇక మీదటైనా కెరీర్‌ చూస్కో’ అంది. ఆ మాటతో నా గుండెకు రెండు గాయాలయ్యాయి. ఒకటి ఇండైరెక్టుగా నాతో మాట్లాడనని చెప్పింది. రెండోది చదువు పూర్తవడంతో నాకు దూరమైపోతోంది.  

మనం గాఢంగా కోరుకుంటే ఈ ప్రపంచం మొత్తం సాయం చేయడానికి ముందుకొస్తుందట. ఎక్కడో చదివిన గుర్తు. తనపై నా ఇష్టం అంత గాఢంగా ఉంది కాబట్టే మళ్లీ నాకు కనపడింది. మా ఇంటికి దగ్గర్లో ఉన్న డిగ్రీ కాలేజీలోనే చేరింది. ఎప్పట్లాగే ఫాలోయింగ్‌ మొదలుపెట్టా. కానీ ఈసారి ఏళ్లకొద్దీ తిరిగే ఓపిక లేదు. ఓరోజు ధైర్యం చేసి అడిగేశా. ‘నీ వెనకాల కాదు.. నీ పక్కన, నీకు జతగా జీవితాంతం నడిచే అవకాశం ఇవ్వవూ’ అని. మర్నాడు ఓ లెటర్‌ చేతిలో పెట్టింది. తన అంగీకారాన్ని లేఖగా మలిచి ఇచ్చింది కాబోలు అనుకున్నా. కానీ జరిగింది వేరు. ‘నీ చదువేంటి? తర్వాత లక్ష్యమేంటి? దాన్నెలా సాధించాలనుకుంటున్నావ్‌? నువ్వు సెటిలైన తర్వాత మా పేరెంట్స్‌ని ఒప్పించే ధైర్యం ఉందా?’ ఒక్కో అక్షరం నన్ను నిలదీస్తోంది. తనేంటి మరీ ఇంత ప్రాక్టికల్‌గా ఉందనుకున్నా.
ఆలోచిస్తే తను అన్నదే సబబనిపించింది. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ ఉంటే హ్యాపీగా ఉండొచ్చు. వాళ్ల బతుకు బాగుండాలంటే వాళ్లు స్థిరపడాల్సిందే. ఆమె మాటలనే ఛాలెంజ్‌గా తీసుకున్నా. చిన్న కంపెనీలో ఇంటర్న్‌గా చేరా. నా ధ్యాస, లక్ష్యం ఒక్కటే. తను మెచ్చుకునేలా మంచి స్థాయిలో ఉండాలి. చదువు, మరోవైపు పని. బాగా కష్టపడ్డా. ఆ టైంలోనే మంచి జాబ్‌ ఆఫర్‌ వచ్చింది. చేరిపోయా. నా మీద నాకు నమ్మకం పెరిగింది. ఏడాది గడిచింది. ఎంత బిజీగా ఉన్నా తన రూపం మదిలోంచి తొలగిపోలేదు. ఒకరకంగా చెప్పాలంటే నేను జీవితంలో స్థిరపడినట్టే. అయినా అంతటితో ఆగిపోకుండా సొంతంగా స్టార్టప్‌ ప్లాన్‌ చేస్తున్న. ఈమధ్యే ఏదో వెతుకుతుండగా తన లెటర్‌ దొరికింది. మళ్లీమళ్లీ చదివా. తను నా ప్రేమను అంగీకరించలేదు. ఒకవేళ ఓకే అంటే ఏ పార్కుల్లోనే, సినిమా హాళ్లలో తిరుగుతూ ఉండేవాళ్లమేమో! తన మాటలతోనే నాలో గెలవాలన్న కసి పెరిగింది. చివరికి నేను గెలిచాను.
నా ఏళ్లకేళ్ల నిరీక్షణకు తెర దించుతూ ఓరోజు తన ముందున్నా. హాయ్‌ చెప్పి తన చేతిలో లెటర్‌ పెట్టా. ‘రెండేళ్లు నీ చుట్టూ తిరిగినా నీ మనసు గెలవలేకపోయానని చాలాసార్లు బాధపడ్డా. అప్పుడు నువ్వడిగిన ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. ఇంకెప్పుడూ నీకు ఎదురుపడకూడదు అనుకున్నా. ఇప్పుడు నువ్వడిగినవన్నీ నా దగ్గరున్నాయని గర్వంగా చెబుతున్నా. ప్రేమంటే ఫాలోయింగ్‌లు, గంటలకొద్దీ మాట్లాడుకోవడం, సరదాలు, షికార్లే కాదు. ప్రేమంటే ఎదుటివాళ్లు మెచ్చేలా ఎదగడం. దానికి ప్రేరణ నువ్వే’ అని రాసి మనసు తెరిచా. ఈసారి తను వార్నింగ్‌ ఇవ్వలేదు. బదులుగా ఏ ఉత్తరమూ చేతిలో పెట్టలేదు. చిరునవ్వులు చిందించింది. నన్ను అంగీకరిస్తున్నట్టుగా.                            

- రాజ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని