నీ మాటలే స్ఫూర్తి మంత్రం

అక్షరం మనసుని ఏమార్చుతుందా? మాటకి మనిషిని మార్చేంత మహత్తు ఉంటుందా? తన మాటతో, అక్షరంతో ఓ వ్యక్తి గాఢమైన ప్రభావం చూపుతాడా? అన్నీ జరుగుతాయి. లేకపోతే.. మాటల పొదుపరైన నేను నా తీరుకు గర్వపడేలా చేసింది ఆ మాటకారే...

Published : 07 Nov 2020 11:38 IST

అక్షరం మనసుని ఏమార్చుతుందా? మాటకి మనిషిని మార్చేంత మహత్తు ఉంటుందా? తన మాటతో, అక్షరంతో ఓ వ్యక్తి గాఢమైన ప్రభావం చూపుతాడా? అన్నీ జరుగుతాయి. లేకపోతే.. మాటల పొదుపరైన నేను నా తీరుకు గర్వపడేలా చేసింది ఆ మాటకారే.

‘రేయ్‌ ఏం మాట్లాడవే?’, ‘మూగవాడిలా ఉంటే కష్టంరా ఈ సమాజంలో?’ ఎవరైనా ఇలా అంటుంటే కుమిలిపోయేవాణ్ని. అతిగా మాట్లాడితే నాకు నసలా అనిపిస్తుంది. అది నా తప్పా? ఆ విషయం తెలియక నన్నర్థం చేసుకున్నవాళ్లే ఉండేవాళ్లు కాదు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలిసేది కాదు. అదుగో.. అప్పుడు నన్ను ఆదుకున్నాడు నా గురువు. మాటల మాంత్రికుడు. 

ఆయనతో పరిచయం లేదు. బంధువు అంతకన్నా కాదు. అయినా తనని తలచుకోని రోజుండదు. నన్నూ, నా ఆలోచల్ని ఎవరూ మార్చలేకపోయారు. ఈ రెండూ తను చేశారు. వీడికి మాట్లాడటం రాదు అనే పరిస్థితి నుంచి వీడితో మనం మాట్లాడలేం అని వేరేవాళ్లు అనుకునే స్థాయికి తీసుకెళ్లారు. ఇది అతిశయోక్తి అనిపించవచ్చు. నాకు మాత్రమే తెలుసు అది మీరు నాకిచ్చిన శక్తి అని. మీ మాటల వ్యసనమే ఇందుకు కారణం. నేను మాటలు నేర్చుకుంటున్నప్పుడు తను మాటలు రాయడం మొదలుపెట్టారు. నాకు మాట్లాడటం రాదేమో అని సందేహించిన ప్రతిసారీ నాలో ధైర్యం నింపారు. మనిషికి వర్తమానంలో ఏదైనా నచ్చితే దానికి సంబంధించి గతం అన్వేషిస్తాడు, భవిష్యత్తు ఆరా తీస్తాడు. నేనూ మీ గురించి అదే చేశాను. మీ అభిమానిగా మారాను. ‘క్లాస్‌లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్‌ చెప్తాడు కానీ ఎగ్జామ్‌లో రాసేవాడే టాపర్‌ అవుతాడు’ ఆయన రాసిన ఒక్క డైలాగ్‌ ఏదో తెలియని అనుభూతి పంచింది. ‘నేనూ వస్తాను’ అని హీరోయిన్‌ అంటే ‘నేనే వస్తాను’ అని హీరో చెప్పే డైలాగ్‌ నా ఆలోచనా విధానాన్నే మార్చేసింది. రెండు వాక్యాలు ఒకేలా అనిపించినా, ఒకే విధంగా కనిపించినా, ఒక్క అక్షరం మాత్రమే మారినా.. అందులోని భావం వేరు. ఇలా రాయడం, చెప్పడం అనుకున్నంత సులభం కాదు. కేవలం ఈ ఒకే ఒక్క సంభాషణ నాలో లోతుగా ఆలోచించే తత్వం నేర్పింది. ఇవి రెండు నా చెవిన పడక ముందు మీరెవరో ఏం చేస్తారో నాకు సంబంధం లేదు. ఇది విన్నాక మీ గురించి తెలుసుకునే వరకు మనసు ఆగలేదు. వెంటనే మీ గురించి అన్వేషించాను. ఈ ప్రక్రియలో మీ రాతలతో నవ్వించారు, ఏడ్పించారు, ఆలోచన రేకెత్తించారు. అందుకేనేమో మిమ్మల్ని అందరూ మాటల మాంత్రికుడు అంటారు. మీ ప్రభావం వల్ల నా స్వభావం మారిపోయింది. నాలో ఉన్న భయం పోయింది. నా ఈ మనసులో మాట మీకు చేరుతుందని ఆశిస్తున్నాను. పుట్టిన రోజున శుభాకాంక్షలు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ గారూ..!

 - రవిసారథి 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని