ఉందిలే మంచీ కాలం..
కొంచెం తీపి.. కొంచెం చేదు.. కొంచెం పులుపు.. కొంచెం వగరులా ఈ ఏడాది యువతకు అన్నిరకాల రుచులు చూపించింది. ఎవరికైనా బతుకు బండి టాప్ గేర్‌లో దూసుకెళ్లాలంటే కొలువులు దక్కి ఆర్థికంగా స్థిరపడితేనే సాధ్యం. ఆ రకంగా చూస్తే ఈ ఏడాది చేదునే ఎక్కువ చవిచూపించింది. నోటిఫికేషన్ల జాడ లేదు. సర్కారు కొలువులు కల్లలయ్యాయి. కలల రంగం ఐటీలోనూ పెద్దగా కూడికలేం లేవు. గుడ్డిలో మెల్లలా గడ్డు కాలంలో ఫార్మా రంగం కొలువులిచ్చి ఆదుకుంది. ఈ-కామర్స్ సైతం నేనున్నానంటూ వంత పాడింది. ఈ ఏడాది మొదటి మూడు నెలలు మూడు పార్టీలు, ఆరు మీటప్లతో సరదాగా సాగిపోతున్న యువత జీవితాల్లో భారీ కుదుపు. కరోనా కసిగా విరుచుకుపడటంతో కుర్రకారు లైఫ్స్టైల్లో ఊహించని మలుపులు వచ్చాయి. బయటే ఎక్కువ షికార్లు చేస్తూ ఇంటికి చుట్టపుచూపుగా వచ్చే సరదారాయుళ్లు కొవిడ్ భయంతో కాలు బయట పెట్టడం మానేశారు. క్యాంపస్, క్యాంటీన్లలో అడ్డా వేసే కాలేజీ విద్యార్థులు తప్పనిసరై ఆన్‌లైన్‌కే అతుక్కుపోయారు. బయట బాతాఖానీలు బంద్ అయ్యాయి. కలుసుకోవడాలకు కామా పడింది. ఆన్లైన్, సెల్ఫోన్లలోనే హాయ్, హలోలతోనే సర్దుకుపోవడం మొదలు పెట్టేశారు. యువ ఉద్యోగులైతే ఇంటినే ఆఫీసుగా మార్చేసి ల్యాప్‌టాప్‌లో తల పెట్టేశారు. అయినా ఈ పాడు కొవిడ్ చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. జీతం, జీవితాల్లో పెను మార్పులొచ్చాయి. దీని కారణంగా దేశంలో దాదాపు 41 లక్షల మంది ఉద్యోగాలు ఉఫ్మన్నాయని అంచనా. చల్నే దో గాడీ.. జీవితాన్ని ఎలాగోలా నెట్టుకురావొచ్చు అని తేలిగ్గా ఉన్నవాళ్లకి తత్వం బోధ పడింది. గడ్డుకాలంలో బతికే మార్గాలు వెతకడం షురూ చేశారు. కష్టాలు రానీ, కరోనా రానీ తట్టుకునేలా మనసుని గట్టి చేసుకోవడం మొదలెట్టేశారు. ఒక్క కొలువునే నమ్ముకుంటే నట్టేట మునిగే అవకాశం ఉందని తెలుసుకొని స్టాండ్‌బై సంపాదన కోసం సాధన చేయడం ప్రారంభించారు. ఈ కొవిడ్‌తో ఇంటికే పరిమితమైపోయిన వాళ్లలో కొందరు మేం బందీలమయ్యాని బాధ పడుతుంటే.. కుటుంబంతో గడిపే సమయం దక్కిందని సంతోషించిన వాళ్లూ లేకపోలేదు. వినోదం విషయానికొస్తే టాలెంట్ ఎవడి సొత్తు కాదంటూ సామాజిక మాధ్యమాలను తమ సత్తా చూపించే వేదికలుగా మార్చుకున్నారు. యూట్యూబ్‌ని సంపాదనకు మార్గంగా మార్చేస్తే.. టిక్‌టాక్‌లో దూరి టాలెంట్ ఎంటో నిరూపించుకుంటూ సూపర్స్టార్లలా పోజులు కొట్టేశారు. ఇంతలో ఉరుమిరిమి మంగళం మీద పడ్డట్టు ప్రభుత్వం టిక్‌టాక్ సహా పలు యాప్‌లపై నిషేధం విధించింది. సామాజిక మాధ్యమ కళాకారుల ఆశలపై నీళ్లు చల్లింది. ముందు కలత చెందినా వాళ్లేం కదలకుండా ఉండిపోలేదు. టిక్‌టాక్ పోతే టకాటక్ లేదా అనుకుంటూ ప్రత్యామ్నాయాలవైపు షిఫ్ట్ అయిపోయారు. ఇక ఇన్స్టాగ్రామ్ వాళ్లకి ఓ మార్కెటింగ్ టూల్‌గా మారిపోయింది. సినిమాలు తగ్గినా.. వెబ్‌సిరీస్‌ల హవా ఎక్కువైందీ ఈ ఏడాదే. ఒక్క ఛాన్స్ అంటూ అవకాశాల కోసం ఎదురుచూసినవాళ్లు అదిరిపోయే నటనతో ఆకట్టుకున్నారు. మొత్తానికి 2020 కొంచెం ఇష్టం.. కొంచెం కష్టంలా యూత్‌కి మిక్స్డ్ అనుభవాలు పంచింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Telangana News: గూగులమ్మకు యూట్యూబ్ కళాకారుల బోనాలు
-
Politics News
Andhra News: నా ఫోన్ కూడా నిఘాలో ఉందనుకుంటున్నా: ఎమ్మెల్సీ విఠపు
-
Ap-top-news News
Andhra News: సీఎం ఓఎస్డీతో కలిసి ప్రయాణించాననడంలో వాస్తవం లేదు: ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి
-
World News
Musharraf: ధోనీ జులపాల జుత్తుకు ముషారఫ్ మెచ్చుకోలు
-
Sports News
Shubman Gill: టిండర్‌లో శుభ్‌మన్ గిల్
-
Crime News
Andhra News: ప్రియురాలికి వేరొకరితో నిశ్చితార్థం.. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు