బతుకు ఇద్దామనుకుంటే.. జీవచ్ఛవాన్ని చేశారు

ఐదేళ్లు.. ఊపిరి తీసుకొని వదిలినంత వేగంగా కరిగిపోయాయి, మా పెళ్లైన కొత్తలో. ఇప్పుడు..? రోజు ఒక యుగంలా గడుస్తోంది.

Updated : 06 Feb 2021 01:33 IST

ఐదేళ్లు.. ఊపిరి తీసుకొని వదిలినంత వేగంగా కరిగిపోయాయి, మా పెళ్లైన కొత్తలో. ఇప్పుడు..? రోజు ఒక యుగంలా గడుస్తోంది.
‘చినుకొస్తే చెరవవుతోంది.. ఎండకి మాడిపోతున్నాం.. ఇంకా ఎన్నాళ్లయ్యా? పూరి గుడిసెలో కాపురం వెలగబెట్టేది? మన పరిస్థితి మారదా?’ ఎనిమిదేళ్ల కిందట లత అన్నదామాట. అప్పుడు తను నా ప్రాణం. నేను టౌనులో కరెంటు పని చేసేవాణ్ని. అరకొర జీతం. అయినా ఇంట్లో సంతోషాలు అపారం. నా అర్ధాంగి ఆవేదన ఆ రాత్రి నిద్ర లేకుండా చేసింది. ఎలాగైనా బాగా సంపాదించాలి. మంచి ఇల్లు కట్టాలనే పంతం పట్టా. పండగలు, అర్ధరాత్రుళ్లు.. ఏవీ గుర్తొచ్చేవి కావు. పనీ పనీ.
‘రేయ్‌.. కుమార్‌ ఇంట్లో లైట్లు వెలగడం లేదు. అర్జెంట్‌గా ఓసారొచ్చి చూడు’ ఓ రోజు మనోజ్‌ గారొచ్చి చెప్పారు. ఊళ్లో డబ్బు, పలుకుబడి ఉన్న మనిషాయన. పరుగెత్తుకెళ్లా. మరోసారి డబ్బులిద్దామని వచ్చారట. అప్పట్నుంచి ఫ్యాను చెడిపోయిందనో, ఫ్యూజు పోయిందనో.. వస్తూనే ఉన్నారు. నేను ఉన్నా, లేకున్నా. ఊర్లో చెప్పుకుంటున్న గుసగుసలు నా చెవిదాకా వచ్చేవి. పని ధ్యాసలో పడి నేనేం పట్టించుకునేవాణ్ని కాదు. నేను పట్టించుకునేసరికి తను నా భార్యతో కలిసి ఉన్నాడు, ఒకే మంచంపై. గుండె రగిలిపోయింది. ఆవేశం కట్టలు తెంచుకుంది. సర్వస్వం అనుకున్న ఆడది పరాయి మగాడితో ఉండటాన్ని తట్టుకోలేకపోయా. జీవితంలో మొదటిసారి తనపై చేయి చేసుకున్నా. వాడినీ చంపేద్దామన్నంత కసి పుట్టింది. కత్తి కోసం వెతుకుతుంటే కన్నుగప్పి పారిపోయాడు. వదిలిపెట్టాలనుకోలేదు. వాడి ఇంటి మీదకి వెళ్లా. నలుగురు మనుషులొచ్చి నన్ను ఈడ్చి పడేశారు.
డబ్బు ఆశ చూపి నా ఆలిని లోబర్చుకున్నాడని తర్వాత తెలిసింది. పేదోడినైనా నాకూ ఆత్మగౌరవం ఉంది. పరువు పోయిందని మథనపడ్డా. నా భార్య పుట్టింటి వారిని పిలిపించా. వాళ్లు తనకి చీవాట్లు పెట్టి మరోసారి తప్పుడు పని చేయకుండా కట్టడి చేస్తారనుకున్నా. కానీ జరిగింది వేరు. అంతా కలిసి నన్ను వంచించారు. నాదే తప్పన్నారు. వాడి పలుకుబడి ఉపయోగించి నాపై గృహహింస కేసు పెట్టి అరెస్టు చేయించారు. ఇదెక్కడి న్యాయం? తప్పు చేసింది వాళ్లు. కటకటాల పాలైంది నేను. పదిహేను రోజుల తర్వాత ఓ స్నేహితుడి దయతో బెయిల్‌పై బయటికొచ్చా. ఇంటికొచ్చాక మరో చావు కబురు. నా భార్య ఇంట్లో ఉన్న బంగారం, తన పేరున వేసిన డబ్బు అంతా ఊడ్చుకొని ఆ దుష్టుడితో వెళ్లిపోయిందట. తనెళ్లిపోవడమే కాదు.. నా జీవితాన్నీ తీసుకెళ్లిపోయింది. ఆఖరికి మంచి చెప్పాల్సిన అత్తామామలు వాడి పంచనే చేరారు. ఆ క్షణం నాకు నిజంగానే చావాలనిపించింది. ఎవరితో చెప్పుకోవాలి? ఎక్కడికెళ్లాలి? చేతిలో చిల్లిగవ్వ లేదు. వాళ్లతో పోరాడే సత్తువ లేదు. నా భార్య తిరిగి రావాలని, నా పిల్లల్ని మళ్లీ గుండెలకు హత్తుకోవాలని ప్రతి గుడి, మసీదు, చర్చికెళ్లి వేడుకుంటున్నా ఏ దేవుడూ నా మొర ఆలకించడం లేదు. చచ్చే ధైర్యం రాక.. బ్రతికే మార్గం లేక జీవచ్ఛవంలా రోజులు గడుపుతున్నా. ఎప్పటికైనా నా పిల్లలు నన్ను వెతుక్కుంటూ వస్తారనే ఒకే ఒక ఆశతో.

- కుమార్‌ (పేర్లు మార్చాం)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని