ఆలోచించండీ.. అమ్మానాన్నలూ..

నాన్నంటే.. రెండక్షరాల భరోసా. చిటికెన వేలు పట్టుకొని జీవితాన్ని నడిపించే దారి. కానీ ఆ పదం వింటేనే నా కన్నీటి ప్రవాహానికి అంతుండదు. గుండెలోని బాధల ఊట ఆగదు.

Updated : 20 Mar 2021 06:30 IST

నాన్నంటే.. రెండక్షరాల భరోసా. చిటికెన వేలు పట్టుకొని జీవితాన్ని నడిపించే దారి. కానీ ఆ పదం వింటేనే నా కన్నీటి ప్రవాహానికి అంతుండదు. గుండెలోని బాధల ఊట ఆగదు.
అమ్మ, అమ్మమ్మ, అత్తయ్య, మావయ్య.. అందరూ ఉన్నా నాన్నే లేరు. ఊహ తెలిసిన దగ్గర్నుంచీ అంతే. మేనమామ కూతురు తండ్రి దగ్గర చేసే గారాబం చూసినప్పుడు.. నా ఫ్రెండ్స్‌ వాళ్ల తండ్రుల గురించి గొప్పగా చెప్పినప్పుడూ నాన్న లేకపోవడం పెద్ద లోటు అనిపించేది.
వయసుతోపాటు నాన్న గురించి తెలుసుకోవాలనే ఆరాటం పెరుగుతుండేది. మాటల్లో పెట్టి ఓరోజు అత్తని అడిగా. ‘వేస్ట్‌ ఫెలో’ అంది. వేరేవాళ్లని కనుక్కున్నా. ‘మీ అమ్మతో గొడవపడి విడిపోయి రెండో పెళ్లి చేసుకున్నాడు’ అన్నారు. అప్పుడు నాన్న నాకో విలన్‌లా కనిపించారు. ఆయన గురించి తెలుసుకోవాలనే ఆరాటం మాత్రం తగ్గలేదు. ఎలాగైతేనేం.. కొన్నాళ్లకి ఆయన ‘చిరునామా’ కనుక్కున్నా.. వెళ్లిపోయా. అప్పుడు వినాయకచవితి వేడుకల్లో ఉన్నారు. నిండైన విగ్రహం.., మాటల్లో గాంభీర్యం.. కన్నతండ్రిని చూడగానే కళ్లు చెమర్చాయి. పరుగెత్తుకెళ్లి గుండెలకు హత్తుకోవాలనిపించింది. కానీ ఎప్పుడో పరాయినైన నేను ఆ క్షణం నీ కూతురినని ఎలా చెప్పుకునేది? చాటుగానే ఉండిపోయా. మంచివాడనీ, సాయం చేసే గుణమనీ.. గొప్పగా చెప్పారు అక్కడివాళ్లు. అందరి తండ్రుల్లాగే ఆయనా నాకు హీరోలా అనిపించారు.
ఓసారి బంధువుల పెళ్లికెళ్లాం. అక్కడ కనిపించారు నాన్న. నా కళ్లు విప్పారాయి. కొత్త జంటతో ఫొటోలు దిగుతున్న సందర్భం.  పిన్ని, వాళ్ల కూతురుతో స్టేజీ ఎక్కారు. నాన్న చేసిన తమాషాకి అంతా పడీపడీ నవ్వుతున్నారు. నేనూ వాళ్ల పక్కనే ఉన్నట్టూ.. వాళ్లతో కలిసి ఫొటోలు దిగుతున్నట్టు ఊహించుకున్నాను. మనసారా నవ్వుకున్నాను. నాన్న వాళ్లు స్టేజీ దిగుతున్నారు. మావయ్య, నేను ఎక్కుతున్నాం. అనుకోకుండా వాళ్లిద్దరి చూపులు కలిశాయి. అంతే వేగంగా మొహాలు తిప్పుకున్నారు. ఆ వెంటనే నావైపు చూశారు నాన్న. రెండు క్షణాలు. ఆయన కళ్లలో సన్నటి కన్నీటి పొర. తల దించుకొని వడివడిగా వెళ్లిపోయారు.
అసలేం జరిగింది? మాకెందుకు దూరమయ్యారు? ఆరా తీశా. నివ్వెరపోయే నిజాలు తెలిశాయి. నానమ్మ, తాతయ్యలకు చాదస్తం. ఎప్పుడూ ఏదో అనేవాళ్లు. అమ్మకు నచ్చకపోయేది. ఓసారి ఇల్లు కడిగింది. వెంటనే తుడవలేదు. నానమ్మ జారి పడితే చెయ్యి విరిగింది. నాన్న కోపంతో అరిచాడు. అమ్మ పుట్టింటివాళ్లకు ఫోన్‌ చేసింది. మావయ్య, తాతయ్య వచ్చారు.. నిలదీశారు. మాటా మాటా పెరిగింది. వాళ్లిద్దరు నాన్నపై చేయి చేసుకున్నారు. ఎవరూ తగ్గలేదు. కన్నవాళ్లు విడిపోయారు. రెండేళ్ల నేను తండ్రి ఉండీ అనాథనయ్యా.
ఆ క్షణం అమ్మకు సొంతంగా ఆలోచించే జ్ఞానం లేదు. మావయ్య వెనక్కి తగ్గలేదు. నాన్న నా గురించి పట్టించుకోలేదు. ఓ చిన్న సంఘటన జీవితాంతం నాకు నాన్న అనే పిలుపునకు నోచుకోకుండా చేసింది. జీవితాంతం ఉండేది ఒకే నాన్న. కంటికి కనిపించే దూరంలో ఉన్నా మాట్లాడలేని దుస్థితి. ఆయన ప్రేమ పొందలేని దౌర్భాగ్యం. నా పరిస్థితి ఎవరికీ రావొద్దు. ఇది చదివాకైనా పిల్లల జీవితాల్ని పణంగా పెట్టే అనవసర పంతాల జోలికి ఏ తల్లిదండ్రులూ వెళ్లరని ఆశిస్తున్నా.                       

- ఎం.ఎస్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని