ప్రింట్‌.. ఇంటికే పంపిస్తారు!

ఓ డాక్యుమెంట్‌ ప్రింట్‌ కావాలంటే ఆన్‌లైన్‌ కేంద్రం లేదా జిరాక్స్‌ సెంటర్‌కి వెళ్లాలి. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఆ సదుపాయం

Published : 03 Apr 2021 01:04 IST

కెరీర్‌.. వ్యాపారం.. స్టార్టప్‌.. భిన్న దారిలో వెళ్తేనే సక్సెస్‌! ఇదే సూత్రంతో ‘అవర్‌ ప్రింట్‌’ ప్రారంభించారు చీకోటి ప్రవీణ్‌, బి.గోపీకృష్ణలు. ఈ వినూత్న ఆలోచన విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండటంతోపాటు వారికి ప్రశంసలు దక్కుతున్నాయి.

ఓ డాక్యుమెంట్‌ ప్రింట్‌ కావాలంటే ఆన్‌లైన్‌ కేంద్రం లేదా జిరాక్స్‌ సెంటర్‌కి వెళ్లాలి. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఆ సదుపాయం లేకపోతే పొరుగూరికైనా వెళ్లాల్సిందే. ఇది డబ్బు, కాలయాపనతో కూడిన వ్యవహారం. ఆ ఇబ్బంది లేకుండా మీకు కావాల్సిన ప్రింట్‌ను ఇంటికే తీసుకొచ్చి ఇస్తే? ఇదే ఆలోచనతో స్టార్టప్‌ ప్రారంభించారు ప్రవీణ్‌, గోపీకృష్ణలు.
ప్రవీణ్‌ది కామారెడ్డి జిల్లా భిక్కనూరు. ఇంజినీరింగ్‌ తర్వాత మాస్టర్స్‌ కోసం జర్మనీ వెళ్లాడు. అక్కడి ప్రొఫెసర్లు పాఠాలు వేగంగా చెప్పేవాళ్లు. నోట్స్‌ రాసుకునే సమయమే ఉండేది కాదు. మెటీరియల్‌ గ్రూపులో వాట్సాప్‌ చేసేవారు. పరీక్షలు, ప్రాజెక్టుల కోసం ఈ మెటీరియల్‌ ప్రింట్‌ తీసుకోవాల్సి వచ్చేది. ప్రవీణ్‌కి దీనికోసమే మూడు నెలలకోసారి రూ.ఆరువేలు ఖర్చయ్యేది. పరిష్కారం ఏంటని సీనియర్‌ మిత్రుడు కరీంనగర్‌కు చెందిన గోపీకృష్ణతో చర్చించాడు. ఇద్దరూ కలిసి ఈ సమస్య భారత్‌లో ఎలా ఉందని సర్వే చేశారు. ఏడాదిలో ఎన్ని ప్రింటౌట్‌లు అవసరమవుతాయి? ఎంత ఖర్చు చేస్తారు? గ్రామీణ ప్రాంతాల్లో ప్రింట్‌ పేపర్‌ తీసుకునేందుకు ఏవైనా సమస్యలున్నాయా? ప్రాజెక్టు పని కోసం విద్యార్థులు, పోటీ పరీక్షల కోసం నిరుద్యోగులు మెటీరియల్‌ ప్రింట్‌లో పడుతున్న ఇబ్బందులు గమనించారు.

ఇలా మొదలైంది
విద్యార్థుల సమస్యలు తీర్చేలా స్టార్టప్‌ ప్రారంభించాలనుకున్నారు. మాస్టర్స్‌ పూర్తి కాగానే ఇండియా వచ్చి 2019 అక్టోబర్‌లో ఓ వెబ్‌సైట్‌ తెరిచి కంపెనీ ప్రారంభించారు. వెబ్‌సైట్‌ నుంచే ప్రింట్‌ మెటీరియల్‌ ఇవ్వడం మొదలెట్టారు. లాక్‌డౌన్‌కి ముందు పాఠశాల, కళాశాల విద్యార్థులు దాన్ని చాలా వరకు ఉపయోగించుకున్నారు. 2020 జూన్‌లో ‘అవర్‌ ప్రింట్‌’ పేరుతో యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. అవర్‌ ప్రింట్‌’ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుని రిజిస్టర్‌ చేసుకోవాలి.అందులో పీడీఎఫ్‌ ఫైల్‌ని అప్‌లోడ్‌ చేస్తే చాలు. కావాల్సిన ప్రింట్‌ మనం ఇచ్చిన అడ్రస్‌కి వచ్చేస్తుంది. అఫీషియల్‌ డాక్యుమెంట్స్‌ సర్వీసులో బాండ్‌పేపర్‌ తదితర పేపర్లనూ ప్రింట్‌ తీసుకోవచ్చు. ప్రింటౌట్లు పెద్దసంఖ్యలో బుక్‌ల రూపంలో తీసుకుంటే అందులో ఉద్యోగ అవకాశాలు, ఇంటర్న్‌షిప్‌లు, పార్ట్‌టైం జాబ్‌లు, సాంకేతిక శిక్షణ.. వివరాలూ అదనంగా జత చేస్తారు. ధర తక్కువే. మెయిల్‌ నుంచి ఒక ప్రింటౌట్‌ తీసుకోవాలనుకుంటే రూపాయి లోపే అందిస్తున్నారు. పరిమాణం, స్టైల్‌.. ఏదైనా సరే. ఇప్పటికి 12 రాష్ట్రాల్లో సేవలందించారు. ఇండియన్‌ పోస్ట్‌ ద్వారా మారుమూల పల్లెలకు సైతం చేరవేస్తున్నారు.

- నిఖిల్‌ గెంటిల, నిజామాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని