వంచనతో వగచినా.. వరమందుకున్నా

‘హాయ్‌.. నా పేరు లక్ష్య. నీపేరో..’ తనే చొరవగా చేయందిస్తుంటే నా కళ్లలో మెరుపులు. ఎంసీఏలో చేరిన రెండు నెలలకు పలకరించిందామె. మా స్నేహం ప్రేమ రంగు పులుముకోవడానికి అట్టే రోజులు పట్టలేదు. కాలేజీ గోడల మీదే కాదు.. మా గుండె గోడలపైనా జంటగా పేర్లు రాసుకున్నాం....

Published : 10 Apr 2021 00:28 IST

‘హాయ్‌.. నా పేరు లక్ష్య. నీపేరో..’ తనే చొరవగా చేయందిస్తుంటే నా కళ్లలో మెరుపులు. ఎంసీఏలో చేరిన రెండు నెలలకు పలకరించిందామె. మా స్నేహం ప్రేమ రంగు పులుముకోవడానికి అట్టే రోజులు పట్టలేదు. కాలేజీ గోడల మీదే కాదు.. మా గుండె గోడలపైనా జంటగా పేర్లు రాసుకున్నాం.
ప్రాజెక్టువర్క్‌ కోసం ఇద్దరం సిటీకెళ్లాం. ఇంకేం.. మాకు రెక్కలొచ్చాయి. పార్కులు.. సినిమాలు.. సరదాలు.. అన్నిచోట్లా మేమే. ఓరోజు తను ఊరెళ్లి వస్తానంది. జాగ్రత్తలు చెప్పి పంపించా. తిరిగొచ్చేటప్పుడు ఓ వార్త మోసుకొచ్చింది. అది నా గుండెను నిప్పుల కొలిమిలోకి తోసింది. తను వేరే అబ్బాయితో నిశ్చితార్థం చేసుకొని వొచ్చిందట. ఎంత దగా! ‘ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చేయి వదలను’ అన్న గొంతే ‘మన కులాలు వేరు. నీకుద్యోగం లేదు.. ఇంట్లో ఒప్పుకోరనీ..’ అంటూ నసిగింది. తన జ్ఞాపకాల గాయాల్లోంచి కోలుకోవడానికి చాలాకాలమే పట్టింది నాకు. కోలుకున్నాక కసిగా పుస్తకం అందుకున్నా. తను ఈర్ష్య పడేలా మంచి జాబ్‌ సాధించా.
కొలువు ముంబయిలో. కొత్త పరిచయాలతో పాత బాధలు మర్చిపోతున్న తరుణం. ఓరోజు కొత్త నెంబర్‌ నుంచి ఫోన్‌. ‘హాయ్‌ సర్‌.. నా పేరు శ్రావ్య. మీ సబ్‌ జూనియర్‌ని. ప్రాజెక్ట్‌వర్క్‌ కోసం మీ హెల్ప్‌ కావాలి. మన కాలేజీ ప్రొఫెసర్‌ మీ నెంబర్‌ ఇచ్చారు’ అని. సాయం కోరి వచ్చింది కదా.. కాదనలేకపోయా. ప్రాజెక్టువర్క్‌లో భాగంగా చాలా చర్చించుకునేవాళ్లం. ఒక్కోసారి వ్యక్తిగత విషయాల్లోకీ వెళ్లేవాళ్లం. ‘మీ పద్ధతి.. అమ్మాయిలతో ప్రవర్తించే తీరు నాకు నచ్చింది. మీరంటే నాకిష్టం’ అందోరోజు సడెన్‌గా. ఇప్పటికే ఓసారి ప్రేమలో దెబ్బతిన్నా. రెండోసారీ ఆ పరిస్థితి ఎదురైతే తట్టుకోలేను. నా గతం వినిపించా. ‘మీకేంటి ప్రాబ్లెమ్‌? మన కులం ఒకటే. అమ్మానాన్నలకు నేనెంత చెబితే అంత. ప్లీజ్‌ కాదనొద్దు’ అంది. అంగీకరించా. కబుర్లు, కలుసుకోవడాలు ఎక్కువయ్యాయి. అయినా ఏ మూలనో అనుమానం. దాన్ని తీర్చడానికా అన్నట్టు ఓసారి వాళ్లమ్మతో ఫోన్‌ చేయించింది. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. కూతురి ముందు సరేనన్నా తనటు వెళ్లగానే ‘మా అమ్మాయికి అమెరికా సంబంధం చూస్తున్నాం. మీతో పెళ్లి జరగదు’ అంటూ మాట మార్చిందా పెద్దావిడ. నేను ఊహించిందే జరిగింది. ఇక శ్రావ్యని మర్చిపోవాలనుకున్నా. కానీ తను వదల్లేదు. ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం అంది. కన్నవాళ్లకి తలవంపులు తెచ్చే ఆ పని చేయలేనన్నా. నా తీరు నచ్చలేదేమో.. మెల్లగా నన్ను దూరం పెట్టసాగింది. ఫోన్‌ ఎత్తదు.. మెసేజ్‌కి రిప్లై ఇవ్వదు. కొన్నాళ్లకి తన పెళ్లికార్డు పంపింది. ‘నీకు ధైర్యం లేదు. పెద్దవాళ్లని ఇంకా ఆపే ఓపిక నాకు లేదు. అందుకే ఈ నిర్ణయం’ అంది. నా అంత దురదృష్టవంతుడు లేడనుకొని కుమిలిపోయా.
శ్రావ్య చెప్పిందే నిజమైతే.. ఈపాటికి తను నా తలపుల్లోంచి కనుమరుగయ్యేదే! జరిగింది వేరు. తను అరేంజ్డ్‌ మ్యారేజీ అని చెప్పిందంతా అబద్ధం. నన్ను కాకుండా వేరొకర్ని ప్రేమించి.. చస్తానని బెదిరించి ఇంట్లోవాళ్లని ఒప్పించి లవ్‌ మ్యారేజీ చేసుకుందట. ఒకే సమయంలో ఇద్దరితో లవ్‌. అతడికి దగ్గరయ్యేందుకే నన్ను దూరం పెట్టిందని అర్థమైంది. రెండోసారీ నేను దారుణంగా మోసపోయా. ఈ రెండు వంచనలతో ఆడవాళ్ల మీదే నమ్మకం పోయింది. జీవితంలో ఏ అమ్మాయిని నా జీవితంలోకి రానివ్వద్దు అనుకున్నా. కన్నవాళ్లు బతిమాలారు. వేరొకరు చేసిన మోసానికి నీ జీవితాన్ని ఎందుకు బలి తీసుకుంటావ్‌? అన్నారు. చివరికి వాళ్ల ఒత్తిడితో ఒక అమ్మాయి చేయందుకున్నా. నేను ఏడడుగులు నడిచాకే తెలిసొచ్చింది ఆడవాళ్లంతా ఒకేలా ఉండరని. నా భార్య బంగారం. నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. అమ్మలా ప్రేమ పంచుతుంది. చేదు తర్వాత తినే తీపికి తీయదనం ఎక్కువంటారు. చేదు గుళికల్లాంటి ఆ ఇద్దరి తర్వాత నా జీవితంలోకి వచ్చిన నా భార్య పంచదార చిలకే. మా కాపురం తీయగా సాగిపోతోంది.  

- దిలీప్‌ (పేర్లు మార్చాం)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని