Loneliness: ఓడిద్దాం.. ఒంటరితనాన్ని

స్నేహితులతో బాతాఖానీలు బంద్‌ అయ్యాయి...ఆఫీసుల్లో గాసిప్‌లకు బ్రేక్‌ పడింది...సరదాగా అలా అలా తిరిగొచ్చే ఛాన్సే కరువైంది...

Updated : 22 May 2021 08:02 IST

స్నేహితులతో బాతాఖానీలు బంద్‌ అయ్యాయి...
ఆఫీసుల్లో గాసిప్‌లకు బ్రేక్‌ పడింది...
సరదాగా అలా అలా తిరిగొచ్చే ఛాన్సే కరువైంది...
లాక్‌డౌన్‌, కరోనా భయం.. ఏదైతేనేం ఉరకలేసే కుర్రకారు నాలుగ్గోడలకే పరిమితం అవుతున్నారు...
ఈ ఒంటరితనం కొత్త మానసిక సమస్యలు తీసుకొస్తోంది. ఆపాలంటే యువతరం ఏం చేయాలి?

* ఆన్‌లైన్‌ ముచ్చట్లు: ఫోన్‌ కాల్‌ లేదా వీడియో చాట్‌ కావొచ్చు. కుదిరితే వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాలు.. సాధనం ఏదైనా రోజూ స్నేహితులతో అభిప్రాయాలు పంచుకోవాలి. ఇంటికి దూరంగా ఉంటుంటే తరచూ కుటుంబ సభ్యులతోనూ మాట్లాడాలి. ఆత్మీయుల గురించి మనమెంత ఆందోళన చెందుతుంటామో మన గురించీ వాళ్లు అలాగే ఆలోచిస్తుంటారని గుర్తించాలి. వీలుంటే బాల్కనీలో దూరం నుంచే ఇరుగు పొరుగుతోనూ మాట్లాడొచ్చు. ఇలా మనలోని భావాలను ఇతరులతో పంచుకుంటే మనసు తేలిక పడుతుంది.
* అవకాశం: సమస్యలను అవకాశాలుగా మలచుకున్నవారు జీవితంలో విజయం సాధిస్తారంటారు. ఒంటరితనాన్ని కూడా ఇలాగే భావించొచ్చు. అనూహ్యంగా లభించిన ఈ సమయాన్ని మన గురించి, మన సమస్యల గురించి ఆలోచించుకోవటానికి వినియోగించుకోవచ్చు. మన లక్ష్యాలను చేరుకోవటానికి అవసరమైన మార్గాలను అన్వేషించటానికి వాడుకోవచ్చు. అలాగే స్నేహితులు, కుటుంబసభ్యులు సాధించిన విజయాలను గుర్తుచేసి వారిని మెచ్చుకోవచ్చు. ఇలాంటి వాటితో ఒంటరితనాన్ని దూరం చేసుకోవటమే కాదు. సామాజిక, కుటుంబ అనుబంధాలనూ పెంచుకోవచ్చు.
* వాస్తవిక ధోరణి: మన చేతుల్లో లేనివాటిని మనమేమీ చేయలేం. ఇష్టమున్నా లేకున్నా కరోనా మన చేతులను కట్టి పడేసింది. ఆరోగ్యం దగ్గర్నుంచి ఆర్థిక పరిస్థితుల వరకూ అన్నింటినీ ప్రభావితం చేస్తోంది. ఈ వాస్తవాన్ని గ్రహించి, దానికి అనుగుణంగా మసలుకోవటం తప్ప చేయగలిగిందేమీ లేదు. ప్రస్తుత పరిస్థితిని తలచుకొని కుమిలిపోవటంతో ఒరిగేదేమీ లేదు. మనమే కాదు, మనలాగే మరెంతోమంది సతమతమవుతున్నారు. దీన్ని గ్రహించగలిగితే ఒంటరితనం భారంగానే అనిపించదు. దూరంగా ఉన్నా మానసికంగా ఒకరికి మరొకరు దగ్గరగా ఉన్నామనే భావన కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.
పనుల్లో నిమగ్నమవ్వాలి: ఇంట్లోనే ఉంటున్నామని ఖాళీగా ఉండటం తగదు. ఖాళీగా ఉంటే మనసు పరిపరివిధాల పోతుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు ముంచెత్తుతాయి. ఏదో ఒక పని ముందేసుకోవటం మేలు. ఇంట్లో చిన్న చిన్న పనులైనా సరే. రాసే అలవాటుంటే మనసులోని భావాలను కాగితం మీద పెట్టొచ్చు. బొమ్మలు వేయటం, సంగీతం వంటి హాబీలుంటే తిరిగి కొనసాగించొచ్చు. లేదూ కొత్త హాబీలను అలవరచుకోవచ్చు.
* మానేద్దాం: ప్రతికూల దృక్పథాన్ని వదులుకోవాలి. సానుకూల ఆలోచనా ధోరణిని అలవరచుకోవాలి. సంతోషాన్ని, ఆనందాన్ని పంచే వారితో గడపటం, మాట్లాడటం మేలు. దీంతో మన మనసులోనూ అలాంటి ఉత్సాహపూరిత వాతావరణమే నెలకొంటుంది. ఒంటరి భావన తొలగిపోతుంది.
* దయతో మెలగాలి: మనతోనే కాదు, ఇతరులతోనూ దయతో మెలగాలి. కారుణ్యాన్ని కనబరచాలి. మనకు ఆనందం, సంతోషం కలిగించే పనులు చేయటమే కాదు, వీలైతే ఇతరులకూ సాయం చేయటం మంచిది. ఇది కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. గాఢమైన అనుబంధాలు పెనవేసుకునేలా చేస్తుంది.
* ప్రణాళికాబద్ధంగా: ఇంట్లో ఉంటే రోజువారీ పనుల్లో వేళాపాళా అంటూ ఉండదు. ఏ పనైనా ఎప్పుడైనా చేసుకోవచ్చులే అనే బద్ధకం పెరిగిపోతుంది. పొద్దుపోయాక నిద్రలేవటం, ఆలస్యంగా భోజనం చేయటం వంటివి చేస్తుంటారు. ఇది మంచిది కాదు. ఆఫీసుకు వెళ్తే ఎలా ఉంటామో అంతే క్రమశిక్షణతో మెలగాలి. వ్యాయామం చేయటం, అల్పాహారం, భోజనం వంటివన్నీ కచ్చితంగా ఆయా సమయాలకే పూర్తి చేయాలి. రోజూ ఒకే సమయానికి పడుకోవటం, ఒకే సమయానికి లేవటం తప్పనిసరి. లేకపోతే శరీరంలో జీవక్రియలన్నీ అస్తవ్యస్తమవుతాయి. ఇది మున్ముందు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాగే ఆత్మీయులతో గడిపే సమయాన్ని.. మనకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగించే పనులను నిర్లక్ష్యం చేయరాదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని