కలల వెంట తను... రెక్కలు తెగి నేను!

‘గంగా తరంగ రమణీయ జటాకలాపం..’ ఆలయ మండపం దగ్గర కూర్చొని భక్తి గీతం వింటున్నా. కోరుకున్న కాలేజీలో ఇంజనీరింగ్‌ సీటు రావటంతో పట్టుబట్టి గుడికి తీసుకెళ్లింది అమ్మ. ఇంటర్‌ వరకూ క్లాస్‌ టాపర్‌ని. నాకు రాకుండా ఎక్కడికి పోతుందిలే అన్న గర్వం నాది.

Published : 22 May 2021 00:26 IST

‘గంగా తరంగ రమణీయ జటాకలాపం..’ ఆలయ మండపం దగ్గర కూర్చొని భక్తి గీతం వింటున్నా. కోరుకున్న కాలేజీలో ఇంజనీరింగ్‌ సీటు రావటంతో పట్టుబట్టి గుడికి తీసుకెళ్లింది అమ్మ. ఇంటర్‌ వరకూ క్లాస్‌ టాపర్‌ని. నాకు రాకుండా ఎక్కడికి పోతుందిలే అన్న గర్వం నాది.
గుళ్లో ఎవరో గలగలా మాట్లాడుతుంటే తల తిప్పి చూశా. నలుగురు ఫ్రెండ్స్‌తో వచ్చింది తను. చూడగానే బాగుంది అనిపించింది. వారం తర్వాత కాలేజీ బస్సు ఎక్కితే, మళ్లీ అవే గలగలలు. లేచి చూశా. గుర్తుపట్టటానికి అట్టే సమయం పట్టలేదు.. తనే. బస్సు దిగి క్లాస్‌రూం వివరాలు కనుక్కుని వెళ్లి కూర్చున్నా. తనూ వచ్చింది. గుడిలో, బస్‌లో, క్లాస్‌లో... కోఇన్స్‌డెన్సే అయినా ఏదో ఫీలింగ్‌.
తన పేరు వర్షిణి. స్వభావానికి తగ్గ పేరే! తెలివైన విద్యార్థే. నాలుగు నెలలయ్యేసరికి మంచి ఫ్రెండ్స్‌ అయ్యాం. మిగిలిన స్నేహితులతో కలిసి లంచ్‌ అవర్‌లో బాతాఖానీలు మామూలుగా జరిగిపోతుండేవి. థర్డ్‌ ఇయర్‌కి వచ్చేసరికి తనంటే విపరీతమైన ఇష్టం పెరిగింది. తను కూడా నా మీద ఇంట్రస్ట్‌ చూపిస్తున్నట్లనిపించేది.
ఓరోజు ధైర్యం చేసి ఐలవ్యూ చెప్పేశా. కాసేపు తటపటాయించింది. ‘చూడు విశాల్‌! నువ్వంటే ఇష్టమే. కానీ, లవ్‌ కన్నా కెరీర్‌ ముఖ్యం. బాగా చదువుకుని మంచి పొజిషన్‌కి వెళ్లాలి’ అంటుంటే, ఓరి బాబోయ్‌ ఇదేం క్లాస్‌ అనుకున్నా. కానీ, తను ఒప్పుకున్నందుకు ఆనందం అలై పొంగింది. అప్పుడే నాన్న బైక్‌ కొనిచ్చారు. కాలేజీ వదిలింది మొదలు తన ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టటం, ఆమె ఇంటి దగ్గర పడిగాపులు కాయటం... నాకు తెలియకుండానే నా తీరు మారింది.
టైం వేస్ట్‌ చేస్తున్నందుకు వర్షిణి చాలా తిట్టేది. నాతో బైక్‌ మీద షికార్లకు రావాలని చాలాసార్లు పట్టుబట్టాను. చదువుకోవాలంటూ తిరస్కరించేది. ‘లోకంలో నువ్వొక్కదానివే చదువుతున్నట్టు మరీ ఓవర్‌ చేస్తున్నావ్‌. నీకు నిజంగా నా మీద ప్రేమ ఉందా?’ అని ఎగిరిపడేవాణ్ని. నన్ను బాధపెట్టటం ఇష్టంలేక రెండుసార్లు గుడికి వచ్చింది. తన ధ్యాసలో పడి చదువుని నిర్లక్ష్యం చేస్తే మా ప్రేమకి అర్థమే ఉండదని హెచ్చరించేది. నాకవేవీ పట్టేవి కాదు. తన ఊహలు, ఊసుల్లో గడిపేస్తుండేవాణ్ని. ఏడాది తిరిగేసరికి థర్డ్‌ ఇయర్‌లో మూడు బ్యాక్‌లాగ్స్‌! అప్పుడు నాన్న చూసిన చూపు జీవితంలో మర్చిపోలేను.
‘ఛీ... నువ్విలా అవుతావని అనుకోలేదు. మన ఫ్రెండ్స్‌లో నువ్వొక్కడివే ఫెయిల్‌. సిగ్గుగా అనిపించట్లేదా. నాకెంత గిల్టీగా ఉందో తెలుసా’ వర్షిణి కళ్లలో అసహ్య భావం.  
నాకు తల కొట్టేసినట్టయ్యింది. వేగంగా బైక్‌ నడుపుతూ డివైడర్‌ని గుద్దేశా. కాలు విరిగింది. ఓరోజు ఫ్రెండ్స్‌తో కలిసి వర్షిణి నన్ను చూడ్డానికొచ్చింది. ‘ఎందుకురా ఇలా తయారయ్యావ్‌? సరే, గెట్‌ వెల్‌ సూన్‌’ అని వెళ్లిపోయింది. తర్వాత తన నుంచి ఫోన్‌ కూడా లేదు. తిరిగి నడవటానికి నాలుగు నెలలు పట్టింది. చూస్తుండగానే నా ఫ్రెండ్స్‌ అందరికీ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో ఉద్యోగాలొచ్చాయి. రెక్కలు కూలి నేను మిగిలిపోయాను. నాలుగేళ్లు గడిచిపోయాయి. తను పెళ్లి చేసుకుని యూఎస్‌ వెళ్లిపోయింది. చదువు ఆగిపోయి నేను చిన్న ఉద్యోగం చేసుకుంటుంటే, లాక్‌డౌన్‌లో అదీ పోయింది. నా జీవితం ఇలా అవ్వటానికి అక్షరాలా కారణం నేనే. జీవితం పట్ల తను ఒక క్లారిటీతోనే ఉంది. నేనే నిర్లక్ష్యం చేశాను. గడిచిన కాలం వెనక్కి వెళితే ఎంత బాగుంటుందో కదా అని రోజూ అనుకుంటుంటాను. కానీ, అది జరగని పని కదా.. ఎందుకంటే అది కాలం!   

 - వీఎం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని