నేపథ్యం భిన్నం కెమెరాతో స్నేహం!

సుస్మితా రెడ్డి ఐటీ ఉద్యోగి... అవినాష్‌ మెడిసిన్‌ విద్యార్థి... భానుప్రసాద్‌ డేటా సైంటిస్ట్‌... గోపి ఇంజినీర్‌... అందరిదీ తిరుపతే. అందరికీ ఫొటోగ్రఫీ అంటే ప్రాణం. అదే జట్టుగా మార్చింది... అందమైన ఫొటోలను

Published : 22 May 2021 00:26 IST

మే 23 ప్రపంచ తాబేళ్ల దినోత్సవం

సుస్మితా రెడ్డి ఐటీ ఉద్యోగి... అవినాష్‌ మెడిసిన్‌ విద్యార్థి... భానుప్రసాద్‌ డేటా సైంటిస్ట్‌... గోపి ఇంజినీర్‌... అందరిదీ తిరుపతే. అందరికీ ఫొటోగ్రఫీ అంటే ప్రాణం. అదే జట్టుగా మార్చింది... అందమైన ఫొటోలను ఒడిసిపట్టడమే కాదు.. ఈ కుర్ర బృందం అరుదైన జీవజాలాన్ని కాపాడేందుకూ శ్రమిస్తోంది... తాజాగా ఆలివ్‌ రిడ్లే తాబేళ్ల జీవన ప్రస్థానాన్ని చిత్రీకరిస్తూ జనాలకు అవగాహన కల్పిస్తున్నారు. భారత్‌లో ఎక్కువగా కనిపించే ఆలివ్‌ రిడ్లే తాబేళ్ల జీవనశైలి భిన్నంగా ఉంటుంది. పసిఫిక్‌ రిడ్లేగా పిలిచే ఈ తాబేళ్లు ఎక్కువగా పసిఫిక్‌, హిందూ మహాసముద్రాల్లో జీవిస్తుంటాయి. తమ సంతతి అభివృద్ధి కోసం మన దేశంలోని సాగర తీరాలకు లక్షల సంఖ్యలో చేరుకుని.. గుడ్లు పెట్టి, పొదిగి.. అవి పిల్లలుగా మారాక తిరిగి సముద్రంలోకి వెళ్తాయి. ‘అరిబాడా’గా పిలిచే ఈ ప్రక్రియ అత్యంత మనోహరంగా ఉంటుంది. దీన్ని చిత్రీకరించటంతోపాటు వాటి జీవనానికి ఎదురవుతున్న సవాళ్లను సమాజానికి తెలియచెప్పే ప్రయత్నం చేస్తోందీ ఫొటోగ్రాఫర్ల బృందం.

శ్రీకాకుళంలోని వజ్రపుకొత్తూరు నుంచి నెల్లూరు జిల్లా నవాబ్‌పేట వరకూ సముద్ర తీరప్రాంతాలకు తాబేళ్లు పెద్దసంఖ్యలో చేరుకుంటాయి. పొడి ప్రదేశాన్ని ఎంచుకొని అడుగున్నర లోతు గోతులు తవ్వి వాటిలో సుమారు 150 వరకూ గుడ్లను పెడతాయి. తర్వాత 45-55 రోజుల తర్వాత గుడ్ల నుంచి ఆలివ్‌ రిడ్లే తాబేలు పిల్లలు బయటికి వస్తాయి. కానీ ఈ ప్రక్రియకు ప్రస్తుతం చాలా అవాంతరాలు ఏర్పడుతున్నాయి. అభివృద్ధి పేరుతో తీర ప్రాంతాలు కనుమరుగవడం, ఈ సమయంలోనే చేపల వేట, ఇతర జంతువులు గుడ్లను ఎత్తుకెళ్లడంలాంటి వాటితో అత్యంత అరుదైన జాతి మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. వీటి పరిరక్షణకు అటవీశాఖ, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. డాక్యుమెంటరీలో ఇవన్నీ ప్రస్తావిస్తూనే, ప్రకృతిలో జీవవైవిధ్యం సమతుల్యత ఎంత అవసరమో చాటి చెబుతున్నారు. మత్య్సకారులు టేకు వలలు వాడకుండా, ఈ సీజన్‌లో చేపల వేటకు వెళ్లకుండా ఉండాలని కోరుతున్నారు. వేట నిషేధించిన సమయంలో మత్స్యకారులకు జీవనోపాధిని కల్పించాలని వేడుకుంటున్నారు. వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్లుగా వీళ్లు ముప్పైకిపైగా దేశాల్లో తిరిగి అరుదైన జంతువుల చిత్రాలను తమ కెమెరాల్లో బంధించారు.

- శ్రీహర్ష నెక్కంటి, ఈటీవీ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని