మెలిపెడుతూనే ఉంది

ఫోన్‌ మోగింది. నా కళ్లు మెరిశాయి. తనే! ‘మీ ఫ్రెండ్‌ రఘు అట. అర్జెంట్‌గా ఫోన్‌ చెయ్యాలట. నంబర్‌ రాసుకోండి’ అంది. రాసుకున్నాను. కొన్నాళ్ల కిందట. ఫోన్‌ మాట్లాడుతూ రోడ్డు దాటుతుంటే,

Published : 29 May 2021 01:02 IST

ఫోన్‌ మోగింది. నా కళ్లు మెరిశాయి. తనే! ‘మీ ఫ్రెండ్‌ రఘు అట. అర్జెంట్‌గా ఫోన్‌ చెయ్యాలట. నంబర్‌ రాసుకోండి’ అంది. రాసుకున్నాను.
కొన్నాళ్ల కిందట. ఫోన్‌ మాట్లాడుతూ రోడ్డు దాటుతుంటే, ఎవడో బైక్‌ మీద దూసుకొచ్చి లాక్కెళ్లిపోయాడు. ఆర్నెల్ల కింద కొన్న ఖరీదైన మొబైల్‌ అది. బాధ పడుతూనే రెండు రోజులాగి ఇంకో ఫోన్‌ కొన్నా. పాత నెంబర్‌ కలిసి రాలేదని కొత్తది తీసుకున్నా.
చాలా రోజుల వరకూ నా పాత ఫోన్‌కి కాల్‌ చేస్తే స్విచాఫ్‌ వచ్చేది. ఓరోజు మాత్రం ఇదిగో ఈ అమ్మాయి ఎత్తి ‘హలో’ అంది. ఆ గొంతు వినగానే నాలో మైమరపు! కొద్దిక్షణాల్లో తేరుకొని ‘ఎవరండీ మీరు. మీ ఫోన్‌ నాది. బైక్‌ మీద వచ్చి లాక్కెళ్లిన వ్యక్తి మీకేమవుతాడు’ అని గద్దించా. ‘హలో హలో.. మీ ఫోన్‌తో నాకేం పని. ఇది నాది. ఓ నెంబర్‌ కొన్నాళ్లు వాడకపోతే దాన్ని మరొకరికి ఇస్తారని తెలీదా?’ చిరాగ్గా అంది. విషయం అర్థమై సారీ చెప్పా. పోయిన ఫోన్‌పై ఆశలు వదిలేసుకున్నా. కానీ ఆ గొంతులో మాధుర్యం నన్ను నిలవనీయలేదు. తర్వాత రోజు మళ్లీ ఫోన్‌ చేసి ‘ఇంతకీ మీ పేరు చెప్పలేదు. మీ వాయిస్‌ చాలా బాగుంది. భోజనం అయ్యిందా...’ అంటుంటే ‘మీ మగాళ్లంతా ఇంతే. అమ్మాయి కనిపిస్తే ఫ్లర్టింగ్‌ చెయ్యటమేనా. మారండ్రా బాబూ’ కటువుగా అంది.
ఇదిగో ఇన్నాళ్లకు మళ్లీ తనే ఫోన్‌ చేసింది. ‘అప్పుడలా మాట్లాడినందుకు సారీ అండీ’ అన్నా. ‘ఇట్స్‌ ఓకే. రోజూ ఎంతమందిని చూడట్లేదు. అమ్మాయిలకి కూడా కొన్ని బాధ్యతలుంటాయి. నాన్నకి కొన్ని అప్పులున్నాయి. అవి తీర్చటానికి హైద్రాబాద్‌లో జాబ్‌ చేస్తున్నా’ అంది. ‘ఓ అవునా.. నేను కూడా హైద్రాబాదే. ఎక్కడుంటారు మీరు?’ నా మాటల్లో ఆత్రుత. ‘హలో! అదే వద్దంటోంది. ఈ ఆరాటం తగ్గించుకోండి’ అని పెట్టేసింది.
నెల తర్వాత ఉదయాన్నే తన నుంచి ఫోన్‌. ఫ్రెండ్‌కి ఏదో ఆపరేషన్‌ అట. ‘బ్లడ్‌ ఇస్తారా. రెండు యూనిట్లు కావాలి. అర్జంట్‌’ అంది. ఫ్రెండ్‌ని తీసుకొని గంటకల్లా ఆమె ముందున్నా. ఒద్దికైన రూపం. పేరు రాగిణి అట. తనని చూడగానే నాలో ఆరాధనా భావం మొదలైంది. తర్వాత అప్పుడప్పుడు ఫోన్‌ చేసి పలకరించేవాణ్ని. తక్కువగా మాట్లాడేది. నాకు మాత్రం రోజురోజుకీ ఆమెపై ఇష్టం పెరిగిపోతుండేది. ఆమె ఫ్రెండ్‌ ద్వారా వివరాలు తెలుసుకున్నా. పద్ధతైన కుటుంబం. నాదీ మంచి ఉద్యోగం. ఎలాగైనా తనే నా అర్ధాంగి కావాలనే ఆరాటం ఎక్కువైంది. రాగిణిని అడిగితే కచ్చితంగా పేరెంట్స్‌ ఇష్టమే తన ఇష్టమంటుంది. అందుకే ముందు వాళ్లనే ఒప్పిస్తే పోలా! అనిపించింది. నేరుగా వాళ్లింటికెళ్లిపోయా. ‘రాగిణి చాలా పద్ధతైన అమ్మాయండీ. తనంటే నాకు ఇష్టం. మాకు ఊళ్లో పొలాలున్నాయి...’ చెబుతున్న నా మాట పూర్తి కానేలేదు. ‘ఏంటే.. సిటీకి పోయి నువ్వు చేస్తున్న పనులు. వీడెవడ్నో ఇంటికే పంపిస్తావా?..’ అంటూ గట్టిగా ఫోన్‌లో అరుస్తున్నాడు వాళ్ల నాన్న. ఇది ఊహించలేక బిత్తరపోయి నిల్చున్నా. అంతలోనే రాగిణి పెదనాన్న కొడుకట, వచ్చి నా కాలర్‌ పట్టుకుని, చెంప మీద కొట్టాడు. జీవితంలో తొలిసారి తీవ్ర అవమానం. బాధ దిగమింగి, గొంతు పెగిల్చి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నా. అయినా వినకుండా తలోమాట అంటూనే ఉన్నారు.
పది నిమిషాలు గడిచాయి. రాగిణి నాన్న ఫోన్‌ మోగింది. ‘అయ్యో! ఎంత పని చేసిందే. ఏ ఆసుపత్రికి...’ అంటుంటే నా మెదడు మొద్దుబారిపోయింది. రాగిణి ఏదో అఘాయిత్యం చేసుకుందని అర్థమైంది. ఆమె అన్న నన్ను పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్లాడు. అప్పుడు నా బాధ కన్నా తనకి ఏం కాకూడదనే కోరుకున్నా. అదృష్టవశాత్తు తనకి గండం తప్పింది. నా గుండె తేలిక పడింది. నెయిల్‌పాలిష్‌ రిమూవర్‌ తాగిందట. రాత్రి ఎస్సై మరో నాలుగు దెబ్బలేసి ‘వాళ్లు కేసు వద్దన్నారు కాబట్టి బతికిపోయావ్‌. వెళ్లు’ అన్నాడు.
ఇది జరిగి ఏడేళ్లు. ఆరోజు తనకి ఏమైనా జరిగి ఉంటే.. ఆ పాపం జీవితాంతం వెంటాడేది. అప్పుడు నా ఆలోచనల్లో తప్పేం లేదు. కానీ అత్యుత్సాహంతో ఓ మంచి అమ్మాయి జీవితంలో కల్లోలం రేపానన్న పశ్చాత్తాప గాయం ఇప్పటికీ నా గుండెల్లో కలుక్కుమంటూనే ఉంది.

- ఎంవీబీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని