బాహుబలి విలుకాడు

బాహుబలి సినిమాతోపాటు అందులో ఉపయోగించిన ఆయుధాలు, విల్లంబులూ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అచ్చంగా అలాంటి వాటినే తయారు చేస్తూ అరుదైన నైపుణ్యం ప్రదర్శిస్తున్నాడు కేరళ యువకుడు టిన్స్‌ ఎం.థామస్‌.

Published : 05 Jun 2021 00:47 IST

బాహుబలి సినిమాతోపాటు అందులో ఉపయోగించిన ఆయుధాలు, విల్లంబులూ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అచ్చంగా అలాంటి వాటినే తయారు చేస్తూ అరుదైన నైపుణ్యం ప్రదర్శిస్తున్నాడు కేరళ యువకుడు టిన్స్‌ ఎం.థామస్‌.
లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి చాలామంది రోడ్డున పడుతున్నారు. తొట్టుముక్కాం ప్రాంతానికి చెందిన థామస్‌ మాత్రం దీన్నో అవకాశంగా మలచుకున్నాడు. బాహుబలి సినిమా స్ఫూర్తితో విల్లు, బాణాలు తయారు చేసి, యువతకు విలువిద్య నేర్పిస్తున్నాడు. గతంలో ఈ పనిలో కొద్దిపాటి ప్రావీణ్యం ఉన్న థామస్‌.. లాక్డౌన్‌లో తన ప్రతిభకు మరింత మెరుగులద్దుకున్నాడు. గతేడాది లాక్‌డౌన్‌లోనే థామస్‌ వ్యాపారం దెబ్బతింది. చేసేదేం లేక ఇంటికే పరిమితమయ్యాడు. ఆ సమయంలో బాహుబలి సినిమా చూశాడు. అందులో వాడిన విల్లు, బాణాలను పోలిన ఆయుధాలను తయారు చేయాలనుకున్నాడు. కానీ ఇది అనుకున్నంత తేలికేం కాలేదు. ఈ ప్రయత్నంలో ఎన్నోసార్లు విఫలమయ్యాడు. అయినా పట్టు వదలకుండా ప్రయత్నించి చివరకు విజయం సాధించాడు.

ఆయుధాలివేే..
గిరిజనులు వేట కోసం ఉపయోగించే విల్లంబులతోపాటు మూణ్నాలుగు బాణాలు ఒకేసారి వదిలే ఓతాంబు (ఓతులి), పరంకి పాతిలనూ ఇప్పుడు తయారు చేస్తున్నాడు. ఫిషింగ్‌ గన్‌ అని పిలిచే తోక్కు తెట్టాలీ రకం విల్లంబులూ అతడి అమ్ములపొదిలో ఉన్నాయి. ఫోల్డబుల్‌ (మడిచేందుకు వీలుగా ఉండే) విల్లును సైతం రూపొందించాడు. నోటితో ఊదుతూ సంధించే అస్త్రాలనూ అలవోకగా ఆవిష్కరిస్తున్నాడు. ఇంతటితో ఆగకుండా.. మరో అడుగు ముందుకేసి తానూ విలువిద్య నేర్చుకున్నాడు. ఫలితంగా.. అతడు తయారు చేసే ప్రతి విల్లు, బాణాలను మరింత కచ్చితత్వంతో పరీక్షించగలుగుతున్నాడు. విల్లంబులు, బాణాల కోసం థామస్‌.. మహోగని, అరేకా నట్‌ పామ్‌, వెదురు కలపలను ఉపయోగిస్తున్నాడు. బాణాల్ని వదిలేచోట (ట్రిగ్గర్‌) మాత్రం.. గేదె కొమ్ములతో తయారైన వస్తువుల్ని వినియోగిస్తానంటున్నాడు. ఇలా ఒక్కో విల్లు రూపొందించేందుకు సుమారు 3-4 రోజుల సమయం పడుతుందంటున్నాడు థామస్‌.

సహకారం: ఈటీవీ యువ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని