బాస్‌.. యెస్‌ అనాలంటే!

మంచి కాలం.. చెడ్డ కాలం.. కరోనా కాలం.. సీజన్‌ ఏదైనా బాస్‌, యాజమాన్యానికి నచ్చేలా పనిచేసేవాడే మంచి ఉద్యోగి. మరి ఆ ట్యాగ్‌లైన్‌ దక్కాలంటే  కొన్ని లక్షణాలు అందిపుచ్చుకోవాలిగా!

Published : 05 Jun 2021 00:53 IST

మంచి కాలం.. చెడ్డ కాలం.. కరోనా కాలం.. సీజన్‌ ఏదైనా బాస్‌, యాజమాన్యానికి నచ్చేలా పనిచేసేవాడే మంచి ఉద్యోగి. మరి ఆ ట్యాగ్‌లైన్‌ దక్కాలంటే  కొన్ని లక్షణాలు అందిపుచ్చుకోవాలిగా!
నాయకత్వం: నలుగురిలో నారాయణలా ఉంటే ఎదగాలనే కోరికను చేజేతులా తెంచేసుకోవడమే. మంచి ఉద్యోగి బాధ్యతలకు ముందుండాలి. కష్టాలకు వెరవొద్దు. వేగంగా నిర్ణయాలు తీసుకోగలగాలి. ఇవే నాయకుడి లక్షణాలు. చొరవ తీసుకునే లక్షణం ఉంటే కెరీర్‌కి ప్లస్‌ అని గుర్తుంచుకోవాలి.
సరికొత్తగా: చేసే పనిలో కొత్తదనం చూపించాలి. టెక్నాలజీ, సరికొత్త నైపుణ్యాలు ఒడిసిపట్టాలి. ఒకే పంథాలో, మూసలో వెళ్తుంటే పనిపై నిరాసక్తత పెరుగుతుంది. బద్ధకం ఆవరిస్తుంది. పనిలో ప్రయోగాలు చేసేవాళ్లే నలుగురిలో గుర్తింపు దక్కించుకుంటారు.
గ్లోబల్‌ సిటిజన్‌షిప్‌: ‘థింక్‌ గ్లోబల్‌.. యాక్ట్‌ లోకల్‌’ ఉద్యోగికి బాగా వర్తించే సూత్రం. స్థానిక అవసరాలకు అనుగుణంగా పని చేస్తూనే నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. మెరుగైన ప్రయత్నాలు మెరుగైన ఫలితాలనిస్తుంటాయి.
సమాచార వారధి: బాస్‌ నుంచి ఫ్యూన్‌ దాకా అందరితో కలుపుగోలుగా ఉండటం మంచి ఉద్యోగి మరో లక్షణం. అవతలి వ్యక్తి స్థాయిని బట్టి ప్రవర్తన ఉంటే ఆ ఉద్యోగి కొందరివాడే అవుతాడు.
పనిమంతుడిగా: కేవలం మంచి మాటలు చెప్పినంత మాత్రాన పనులైపోవు. ఏం చేసినా, వ్యక్తిత్వం ఎలాంటిదైనా చివరగా చేస్తున్న పనిపై ప్రేమ ఉన్నప్పుడే మంచి ఉద్యోగి అనిపించుకుంటారు. ఉత్పాదకత పెంచినవాళ్లే మంచి ఉద్యోగిగా మెప్పు పొందొచ్చు. బాస్‌ని కనికట్టు చేయొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని