Published : 12 Jun 2021 01:53 IST

నడిస్తే.. నాజూకే

జిమ్‌కెళ్లే ఓపికుండదు.. డైట్‌ పాటించే తీరికుండదు. అయినా సక్కనయ్యలు, చక్కనమ్మలు అయిపోవాలని కుర్రకారు ఆశ. దీనికి నడకొక్కటే మార్గం అంటున్నాయి తాజా అధ్యయనాలు. ఓ మోస్తరు వేగంతో రోజుకి అరగంట నుంచి గంట నడిస్తే బరువు తగ్గిపోతారట. దాంతోపాటు ఈ జాగ్రత్తలూ జోడించాలండోయ్‌!

లెక్క తప్పొద్దు: మనం ఆహారం ద్వారా తీసుకునే వాటి కన్నా ఎక్కువ కేలరీలు ఖర్చైతేనే ఒంట్లో కొవ్వు కరుగుతుంది. శరీరాకృతి కోరుకున్నట్టుగా వస్తుంది. ఆహారంతో ఎన్ని కేలరీలు తీసుకుంటున్నామో డైరీ లేదా యాప్‌లో నమోదు చేసుకోవాలి. వ్యాయామం, ఆహార నియమాల ద్వారా ఎక్కువ కేలరీలు ఖర్చయ్యేలా ప్రణాళిక వేసుకోవాలి.

మనకు అనుకూలంగా: నడిచే వేగం, శరీర బరువుకు అనుగుణంగా కొవ్వు కరుగుతుంది. అంటే నడకలో కాస్త వేగం పెంచితేనే మంచిది. గంటకు 6.44 కి.మీ వేగంతో నడిస్తే అరగంటలో 175-189 కేలరీలు ఖర్చవుతాయట.

రాత్రికి రాత్రే కుదరదు: మెరుపుతీగలా సన్నగా కావాలంటే ఒక్కరోజులో లేదా నెలలో సాధ్యం కాదు! ఇది నిరంతర ప్రక్రియ. మధ్యలో మానెయ్యకుండా అలవాటుగా కొనసాగించాలి. అప్పుడే ఫలితం. వారంలో కనీసం మూడు సార్లు గంటపాటు క్రమం తప్పకుండా నడిచే అమ్మాయిలు బరువు తగ్గినట్టు ఓ అధ్యయనంలో తేలింది. వాళ్ల నడక అలవాటును 12 వారాలు గమనించాకే ఇది తేల్చారు.

నెమ్మదిగా పెంచాలి: నడకకి అత్యుత్సాహం పనికి రాదు. మొదట్నుంచే మారథాన్‌లు చేస్తానంటే కుదరదు. ముందు ఒకట్రెండు కిలోమీటర్లతో మొదలు పెట్టి నెమ్మదిగా వేగం, దూరం పెంచాలి. ఎత్తుగా ఉన్న చోటు ఎంచుకుంటే ఇంకా మంచిది. రోజుకు 5-10 నిమిషాలు పెంచుకుంటూ రావాలి. ప్రతి వారానికి కొన్ని నిమిషాలు జోడించాలి.

వైవిధ్యంగా: రోజూ ఒకే పని చేస్తే ఎవరికైనా బోర్‌ కొడుతుంది. అందుకే కాస్త వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. నడక చోటు మార్చడం, ఒకరోజు ఎక్కువ దూరం నడిస్తే మరోరోజు తక్కువ దూరం.. ఇలా. ఇయర్‌ ఫోన్‌లో ఇష్టమైన పాటలు వినడం, స్నేహితులతో కలిసి నడవడం.. ఇవి బోర్‌ కొట్టకుండా చేస్తాయి.

మంచి ఆహారం: వ్యాయామానికి తగ్గట్టు మంచి ఆహారం తీసుకున్నప్పుడే ఫలితం ఉంటుంది. అన్ని పోషకాలతో నిండిన ఆహారం కేలరీలు ఖర్చు కావటానికీ తోడ్పడుతుంది. పోషకాలు లేని జంక్‌ ఫుడ్‌, శీతల పానీయాలు బరువు పెంచుతాయి. వీటిని ముట్టుకోవద్దు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు