శ్రీవారూ అని.. ముద్దు చేసేది!

బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాలా బోరింగ్‌గా సాగిపోతున్న రోజులవి. గీత రాకతో నా జీవితం ఒక్కసారిగా కలర్‌ఫుల్‌గా మారిపోయింది. అదేదో సినిమాలో డైలాగ్‌లా తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా అన్నట్టుండేది. తన పరిచయంతో ఫైవ్‌ థౌజండ్‌వాలా మెరుపులు. 

Published : 12 Jun 2021 01:58 IST

బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాలా బోరింగ్‌గా సాగిపోతున్న రోజులవి. గీత రాకతో నా జీవితం ఒక్కసారిగా కలర్‌ఫుల్‌గా మారిపోయింది. అదేదో సినిమాలో డైలాగ్‌లా తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా అన్నట్టుండేది. తన పరిచయంతో ఫైవ్‌ థౌజండ్‌వాలా మెరుపులు.  పెళ్లీడొచ్చిందని సరదాగా ఓ మ్యాట్రిమొనీ సైట్‌ తెరిచా. అక్కడే నా గుండెను మీటింది గీత. మొదట్లో చిరుజల్లుల్లా మొదలయ్యాయి మా మధ్య మాటలు. వరదై, గట్టు తెగిన గోదారిలా మారడానికి అట్టే రోజులు పట్టలేదు. సూర్యుడు ఉదయించకముందే మా సెల్‌ఫోన్లు పలకరించుకునేవి. చంద్రుడు కనుమరుగయ్యాకే మా కళ్లు కునుకేసేవి. మూణ్నెల్లు గడిచేసరికి మేం వేర్వేరు అనే సంగతే మర్చిపోయాం.

నేను తనని ప్రేమగా ‘బంగారం’ అనేవాణ్ని. ‘శ్రీవారూ’ అంటూ ముద్దు చేసేది తను. ఏడడుగులు నడవకుండానే మాది ఎన్నో జన్మల బంధం అన్నట్టుగా ఉండేవాళ్లం. అలాగని ఎప్పుడూ హద్దు దాటింది లేదు. ఇంత ప్రేమని పెళ్లితో మరింత పదిలం చేసుకోవాలనుకున్నాం. కానీ అమ్మాయి, అబ్బాయి ఏకం కావడానికి రెండు కుటుంబాలు, మంచి ముహూర్తంతోపాటు ఇంకోటీ ముఖ్యమని అర్థమైంది నాకు. అదే కులం. ఈ కాలంలో కూడా అంతగా పట్టించుకునేవాళ్లు ఎవరు? అనుకునేవాణ్ని. అది మాత్రమే పట్టించుకునే వాళ్లుంటారని తర్వాత తెలిసింది. సిటీలో నాకో వ్యాపారం ఉండేది. డబ్బులకు ఢోకా లేదు. మంచి పేరున్న కుటుంబం. గీత పేరెంట్స్‌కి ఇవన్నీ నచ్చాయి. కులం విషయం వచ్చేసరికే వెనకడుగు వేశారు. ‘నాకు మీ అమ్మాయంటే ప్రాణం. మా అమ్మలా చూసుకుంటా. మీరిచ్చే ఒక్క పైసా వద్దు’ అని ఎంత ప్రాధేయపడ్డా వినరే! మొదటిసారి మర్యాదగానే చెప్పారు. రెండు, మూడోసారి వెళ్లి అడిగితే దారుణంగా తిట్టారు. అయినా ఎలాగైనా వాళ్లని ఒప్పించాలనుకునేవాణ్ని.

ఓరోజు పిడుగు లాంటి వార్త. ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి కుదిర్చారని. దాంతో వాళ్లు ఏం సాధిస్తారో అర్థం కాలేదు. తనకి నేనంటే ఇష్టం. ఇష్టం లేని పెళ్లి చేసుకొని తను సుఖంగా ఉండగలదా? ఆ అబ్బాయిని పెళ్లాడకపోతే చనిపోతామని బెదిరించారట. నాకు తెలిసిన వాళ్ల ద్వారా ప్రయత్నించాను. ఆ పెద్దల మనసు కరగలేదు. వాళ్లని ఒప్పించలేక, నా గీతను దక్కించుకోలేక విలవిల్లాడిపోతున్నా. సరిగా నిద్రపోయి, అన్నం తిని ఎన్నిరోజులైందో. దిక్కుతోచక రాత్రిళ్లు పెడుతున్న కన్నీళ్ల బరువు నా తలగడకు మాత్రమే తెలుసు. అమ్మానాన్నల్ని కాదని నా కోసం తను బయటికి వచ్చే పరిస్థితి లేదు.

చివరగా ఆ పెద్దవాళ్లనే వేడుకుంటున్నా. మేం మిమ్నల్ని కాదని గడప దాటితే మీ పరువు, కులం ఏమవుతుంది? కానీ మీరు మాకు కావాలి. దయచేసి కులమతాల పేరుతో మమ్మల్ని విడదీయకండి. ప్రేమించిన వ్యక్తి మంచోడా? కాదా? అన్నది చూడండి. తను నా కూతుర్ని పోషించగలడా? లేదా? అని ఆలోచించండి. అది వదిలేసి మీరు ఎంత గొప్ప సంబంధం తెచ్చినా ఆ లోటు జీవితాంతం ఉండిపోతుంది. ఇది అర్థం చేసుకొని, మనసు మార్చుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తారనే ఆశతో ఎదురుచూస్తున్నా.

- సురేష్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని