బ్రేకప్‌ చెప్పాలా? వద్దా?

ఏడాదిన్నర కిందట ఫేస్‌బుక్‌ ద్వారా బంధువులమ్మాయి పరిచయమైంది. మంచి ఉద్యోగంలో ఉంది. నాలుగైదుసార్లు బయట కలుసుకున్నాం. నేనంటే తనకి ప్రాణం. అడక్కముందే అన్నిరకాలుగా సాయం చేస్తుంది. నాకు ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. సమస్య ఏంటంటే.. తనకి కొంచెం అనుమానం.

Published : 19 Jun 2021 01:17 IST

* ఏడాదిన్నర కిందట ఫేస్‌బుక్‌ ద్వారా బంధువులమ్మాయి పరిచయమైంది. మంచి ఉద్యోగంలో ఉంది. నాలుగైదుసార్లు బయట కలుసుకున్నాం. నేనంటే తనకి ప్రాణం. అడక్కముందే అన్నిరకాలుగా సాయం చేస్తుంది. నాకు ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. సమస్య ఏంటంటే.. తనకి కొంచెం అనుమానం. ఆన్‌లైన్‌లో ఉంటే వెంటనే రిప్లై ఇవ్వకపోతే ఊరుకోదు. వేరే అమ్మాయిలతో మాట్లాడొద్దు అంటుంది. తన మాటే నెగ్గాలనే పంతం. నాకు అది నచ్చడం లేదు. బ్రేకప్‌ చెప్పాలా? కొనసాగాలా? అర్థం కావడం లేదు.

- ఆర్‌.ఎస్‌.ఆర్‌., ఈమెయిల్‌

అసలు ఆన్‌లైన్‌ ద్వారా పుట్టే ప్రేమలో గాఢత ఎంతవరకు ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒకర్నొకరు పలకరించుకోవడం, అవతలి వారికి నచ్చేలా మాట్లాడుకోవటం.. ఇది ఆకర్షణే తప్ప ప్రేమ కాదు. మీరు చెప్పినట్టు ఒక వ్యక్తిని నాలుగైదుసార్లు కలవగానే మనస్తత్వం అర్థం చేసుకోవడం సాధ్యమవుతుందా? ఈ కొద్ది పరిచయాన్ని పెళ్లి దాకా తీసుకెళ్లడం ఎంత వరకు సమంజసమో మీరే ఆలోచించుకోండి. ఇద్దరి మధ్యా నమ్మకం, ఒకర్నొకరు అర్థం చేసుకోవడం ప్రతి అనుబంధానికి ముఖ్యం. మీ రిలేషన్‌షిప్‌లో అవి కనిపించడం లేదు. తను అనుమానించడం, రిప్లై ఇవ్వకపోతే అలగడం.. ఇవన్నీ చూస్తుంటే మీ మధ్య సరైన అవగాహన లేదనిపిస్తోంది. ఓసారి మీ ఇద్దరు కూర్చొని ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకోండి.  మీ జీవితం ఎలా ఉండాలి అనుకుంటున్నారో? ఒకర్నుంచి ఒకరు ఏం ఆశిస్తున్నారో.. మనసు విప్పి మాట్లాడుకోండి. ఇవేం లేకుండా తొందరపడి ఒక నిర్ణయానికి వస్తే జీవితాంతం పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది. ఇద్దరి మధ్య ప్రేమ ఉంది అనుకోవడం వేరు, ప్రేమించడం వేరు. క్షుణ్నంగా మాట్లాడుకుంటేనే అది తెలుస్తుంది. ఆ అరమరికలు తొలగించుకొని ముందుకెళ్లండి. ఆల్‌ ది బెస్ట్‌.

- అర్చన నండూరి, కౌన్సెలింగ్‌ సైకాలజిస్టు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని