ప్రేయసితో పెళ్లిచూపులు

ప్రేమకోసం యుద్ధాలు జరిగాయని విన్నప్పుడు.. ప్రేమ కోసం ప్రాణాలు తీసుకున్నారని చదివినప్పుడు.. సిల్లీగా అనిపించేది నాకు. అందులో అంత గొప్పతనం ఏముందని ఆశ్చర్యపోయేవాణ్ని. చచ్చినా ఆ మాయలో పడొద్దూ.. అనుకునేవాణ్ని. కానీ జరిగింది వేరు. ఆ వలపు బాణానికి నేనూ చిక్కుకోక తప్పలేదు.

Updated : 19 Jun 2021 03:27 IST

ప్రేమకోసం యుద్ధాలు జరిగాయని విన్నప్పుడు.. ప్రేమ కోసం ప్రాణాలు తీసుకున్నారని చదివినప్పుడు.. సిల్లీగా అనిపించేది నాకు. అందులో అంత గొప్పతనం ఏముందని ఆశ్చర్యపోయేవాణ్ని. చచ్చినా ఆ మాయలో పడొద్దూ.. అనుకునేవాణ్ని. కానీ జరిగింది వేరు. ఆ వలపు బాణానికి నేనూ చిక్కుకోక తప్పలేదు.
కాలేజీలో ఎదురుపడింది ఆ మెరుపు తీగ. తొలిచూపులోనే మాయ చేసింది. నా ప్రవర్తనో, తనపై చూపిస్తున్న కేరింగ్‌నో.. మొత్తానికి తనకీ నచ్చేశాను. అయితే ఈ మూడేళ్లలో మేం పట్టుమని పదిసార్లు కలుసుకుంది లేదు. కాలేజీ ముగిసింది. ఒకర్ని విడిచి ఒకరం ఉండలేమని అర్థమైంది. చాటుమాటుగా కలుసుకోవడం కాదు.. జీవితాంతం ఒక్కటిగా ఉండాలనుకున్నాం. ‘ప్రేమ పేరెత్తితే నాన్న చంపేస్తాడు. ఏం చేస్తావో తెలియదు. మావాళ్లని ఒప్పించే బాధ్యత నీదే’ అందోరోజు. సరేనన్నా. వాళ్లకి నచ్చాలంటే ముందో ఉద్యోగం కావాలి. ఆర్నెల్లు కష్టపడి మంచి కొలువు కొట్టా. సమయం కోసం ఎదురుచూస్తున్నా. ‘నాకు సంబంధాలొస్తున్నాయి. నువ్వు తొందరపడకపోతే నేన్నీకు దక్కనేమో’ ఏడుస్తూ చెప్పిందోసారి. వచ్చిన సంబంధాలను నాకోసం ఎలాగో చెడగొట్టసాగింది. నాకేమో ఎలా ముందుకెళ్లాలో తెలియక టెన్షన్‌ పెరుగుతోంది. చివరికో ఉపాయం తట్టింది. వాళ్ల బంధువొకాయనతో అపరిచితుడిలా మాట కలిపాను. కొన్నాళ్లు తననే ఫాలో చేసి పరిచయం పెంచుకున్నా. తొందర్లోనే మేం మంచి ఫ్రెండ్స్‌ అయ్యాం. ఓ నెలయ్యాక ‘మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. నీకు తెలిసిన అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పు’ అంటూ అసలు విషయం బయట పెట్టా. నా వ్యక్తిత్వం, మాటతీరు, ఉద్యోగం అప్పటికే ఆయనకు బాగా నచ్చేశాయి. సీరియస్‌గానే నాకోసం వాళ్ల బంధువుల అమ్మాయిల గురించి చెప్పసాగాడు. కానీ నా ప్రియసఖి గురించి నోరు విప్పడే! ఇలా కాదనుకొని నాకెలాంటి అమ్మాయి కావాలో వివరిస్తూ దాదాపు నేను ప్రేమించిన అమ్మాయి గురించే చెప్పా. తను ముందే తెలుసని పసిగట్టేస్తాడని భయపడిపోయా.  కానీ అలా ఏం జరగలేదు.
రెండ్రోజులయ్యాక ఓ ఫొటో చూపించాడు. ‘రేపే వీళ్లింటికి పెళ్లిచూపులకు వెళ్తున్నాం. రెడీగా ఉండు’ అన్నాడు. తను నా లవరే. మనసు మబ్బుల్లో తేలిపోయింది. మర్నాడే వాళ్లింటికెళ్లాం. లోపల అడుగు పెట్టగానే నాలో వణుకు మొదలైంది. గంభీరంగా ఉన్న వాళ్ల నాన్నని చూడగానే భయం రెట్టింపైంది. తనొచ్చింది. ఫార్మాలిటీస్‌ కోసం ఏవో అడుగుతుంటే అమాయకంగా జవాబు చెప్పింది. ఏమీ తెలియనట్టే. చివర్లో ‘అంతా నాన్న ఇష్టం’ అని ఓ కామెంట్‌ చేసింది. నాకు నవ్వాగలేదు. అదృష్టవశాత్తు వాళ్ల నాన్నతో సహా అందరికీ నచ్చేశాను.
నా ప్రేమ కథ సుఖాంతం అవుతోంది అనుకుంటే మావాళ్లు అడ్డు తగిలారు. ఏదో విషయం నచ్చలేదని ‘సంబంధం కాన్సిల్‌’ అన్నారు. ఇక తప్పదనుకొని అసలు విషయం చెప్పా. అమ్మానాన్నలు చెడామడా తిట్టారు. అన్నీ భరించి, బతిమాలి ఒప్పించాను. ఈలోపు మరో ట్విస్టు. వాళ్ల నాన్న కొందరిని ఊళ్లోకి పంపారు.. నా గురించి ఎంక్వైరీ కోసం. ఇప్పుడు కూడా మా ప్రేమ గుట్టు తెలిస్తే నా ఎముకలు విరిగిపోయేవే. ఊళ్లో నాకు మంచి పేరు ఉండటంతో ఆ విషయం బయటికి రాలేదు. చివరికి ఓరోజు ఆయనే ఫోన్‌ చేసి ముహూర్తం పెట్టుకుందాం అన్నారు. మొత్తానికి ఆ రకంగా మేం ప్రేమలో సక్సెస్‌ అయ్యాం. పెద్దల దీవెనలతో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాం. నేను చేసింది తప్పో, ఒప్పో తెలియదు గానీ తనని మిస్‌ అయితే జీవితాంతం ఏడ్చేవాణ్ని. నేను చేసిన సాహసంతోనే నా ప్రాణసఖి సొంతమైంది.       

   - ఆర్కే


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని