మన జిందగీ.. మన చేతుల్లో!

ఇలాంటివే కాదు.. కాలి గోరుకి వేసుకునే పాలిష్‌ దగ్గర్నుంచి కాలేజీ ఎంపిక దాకా ఇతరులు చెబితేనే సంతృప్తి చెందే బాపతు చాలామందే ఉంటారు.

Published : 26 Jun 2021 00:41 IST

జర సోచో

బీకామ్‌ తర్వాత ఎంబీఏకి వెళ్లాలా? కంప్యూటర్‌ కోర్సు చేయాలా?

- శ్రీరాం సంశయం.. నిర్ణయం నాన్నకే వదిలేశాడు.

ఫ్రెషర్స్‌ పార్టీ. చుడీదార్‌లో రావాలా? జీన్స్‌ వేసుకోవాలా?

జాహ్నవి అనుమానం.. క్లోజ్‌ఫ్రెండ్‌ తనూజ చెప్పినట్టే చేసింది.'

లాంటివే కాదు.. కాలి గోరుకి వేసుకునే పాలిష్‌ దగ్గర్నుంచి కాలేజీ ఎంపిక దాకా ఇతరులు చెబితేనే సంతృప్తి చెందే బాపతు చాలామందే ఉంటారు. ఏంటిది అంటే ‘నాకు వాళ్లతో ఉండే అటాచ్‌మెంట్‌ అలాంటిది’ అని గొప్పగా చెబుతారు. మరీ మరీ అడిగితే ‘అరె యార్‌.. నా లైఫ్‌ తెరిచిన పుస్తకం. ఏ చిన్న నిర్ణయం అయినా ఫ్రెండ్స్‌ లేదా పేరెంట్స్‌కి తెలియాల్సిందే’ అని స్టైల్‌ కొడుతుంటారు. చిన్నచిన్న వాటికైతే ఫర్వాలేదు.. జీవితాన్నే మార్చేసే విషయాల్లోనూ పరుల మాటే ఫైనల్‌ అనే తీరు అస్సలేం బాగుండదు బాస్‌. దగ్గరివాళ్లకు ప్రాముఖ్యం ఇవ్వడం, వాళ్ల అభిప్రాయాలు తీసుకోవడం మనకు సంతోషం కలిగించే విషయమే. కానీ వాళ్లు పరిధికి మించి చొరవ చూపితే, అదే అలవాటుగా మారితే.. మన ఆత్మవిశ్వాసమే దెబ్బ తింటుంది. ఏ నిర్ణయమూ తీసుకోలేని చేతగాని వాడిలా మార్చేస్తుంది. సొంతంగా ఆలోచించే శక్తినీ కోల్పోతుంటాం. కొందరైతే మన జీవితాల్లో తలదూర్చడం మొదలుపెడితే ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. కీలుబొమ్మని చేసి ఆడిస్తుంటారు. ఇది మొదటికే మోసం. ఆ నిర్ణయాలు సానుకూలమై మనలో జోష్‌ నింపేవైతే ఓకే. కానీ ప్రతికూల ఫలితాలు వస్తే మానసిక అశాంతి మొదలవుతుంది. దానికితోడు ఆ సమయంలో ఏవైనా విమర్శలు తలెత్తితే సొంత నిర్ణయాలు తీసుకోలేక, ఏం చేయాలో తెలియక గందరగోళంలో పడిపోతాం. అలాంటి మనస్తత్వం మీదైతే ఆ సంప్రదాయాన్ని బద్దలు కొట్టాల్సిందే. చిన్నదైనా, పెద్దదైనా.. ఆలోచనైనా, నిర్ణయమైనా అన్నీ సత్ఫలితాలు ఇవ్వవు. పదికి పది సక్సెస్‌ కావు. ఒక్కోసారి ప్రతికూల ఫలితాలు రావొచ్చు. అంతమాత్రాన కుంగిపోవాల్సిన పనిలేదు. దానికి ముందే సిద్ధమైపోవాలి. ఫెయిలైతే కొంపలేం మునగవు. ఇంకోసారి ఆ పొరపాటు జరగకుండా చూసుకోవచ్చు. అది అలవాటుగా మారితే మనపై మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడటం తగ్గుతుంది. అప్పుడిక ఆల్‌ ఈజ్‌ వెల్‌నే! మన జిందగీ మన చేతుల్లోనే ఉండాలి. ఏమంటారు?


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని