వదలొద్దు అని.. వదిలెళ్లిపోయింది

ఓ సాయంత్రం.. కంప్యూటర్‌ సెంటర్‌కి వెళ్తుంటే అమ్మాయిల గుంపు ఎదురైంది. అందులో ఒకరిపై నా చూపు ఆగింది. విశాలమైన కళ్లు.. నవ్వినప్పుడు బుగ్గల్లో సొట్టలు పడుతున్నాయి.

Published : 26 Jun 2021 00:41 IST

సాయంత్రం.. కంప్యూటర్‌ సెంటర్‌కి వెళ్తుంటే అమ్మాయిల గుంపు ఎదురైంది. అందులో ఒకరిపై నా చూపు ఆగింది. విశాలమైన కళ్లు.. నవ్వినప్పుడు బుగ్గల్లో సొట్టలు పడుతున్నాయి. రెప్ప వేయడం మర్చిపోయి తననే చూస్తుండిపోయా. వాళ్లు నన్ను దాటుకొని వెళ్లిపోయినా ఆమె రూపం నా గుండెలో నిలిచింది. పదేపదే గుర్తొస్తుంటే ఆరోజు రాత్రి నా కంటికి నిద్రే కరువైంది.

పీజీ పూర్తి చేసి సిటీకొచ్చా. మంచి జాబ్‌ సంపాదించాలన్నది నా కల. అప్పట్నుంచి పుస్తకాలే నా నేస్తాలయ్యాయి. వాటితోనే ప్రేమ. ఎవరినీ కన్నెత్తి చూసింది లేదు. కానీ ఎందుకో ఈ అమ్మాయి తెగ నచ్చేసింది. తనతో ఫ్రెండ్‌షిప్‌ చేయాలని మనసు ఉవ్విళ్లూరింది. మర్నాడే ఆరా తీశా. బీటెక్‌ సెకండియర్‌ చదువుతోందట. లక్కీగా మా రూంకి దగ్గరే తన ఇల్లు. కొన్నాళ్లు ఫాలో అయ్యా. ఏదోలా దృష్టిలో పడ్డా. ఓ పూట మాట కలిసింది. నేను హ్యాపీ. ఫ్రెండ్లీగా అప్పుడప్పుడు కలుసుకునేవాళ్లం. మాటల్లో తెలిసింది.. తన అభిరుచులు, ఇష్టాలు అచ్చంగా నావే.

సంతోషంగా ఉంటే మొదటి మాట తనకే. దుఃఖమొస్తే పంచుకునేది తనతోనే. నా కాల్‌ లిస్టులో ఆమె పేరు లేకుండా రోజు ముగిసేది కాదు. తనని చూడకుండా ఉండలేని స్థితికొచ్చా. ఓరోజు అదే మాట చెప్పా. ‘నాది ఫ్రెండ్షిప్‌ కాదు.. ప్రేమే. నువ్వు లేకుండా ఉండలేన’ని. ‘పిచ్చి మొద్దూ ఇంత ఆలస్యంగానా చెప్పడం? నువ్వు నాకెప్పుడో నచ్చేశావ్‌’ అంటూ నా ఆనందాన్ని డబుల్‌ చేసింది. సరదాలు, షికార్లే కాదు.. అప్పుడప్పుడూ మా ప్రేమలో అలకలు, కోపతాపాలూ ఉండేవి. అయినా ఎవరో ఒకరం సారీ చెప్పుకునేవాళ్లం. ఒక్క హగ్‌తో మా మధ్య దూరాలు కరిగిపోయేవి.

ఓరోజు తను బాబా గుడికి రమ్మంది. వెళ్లగానే కావలించుకొని పసిపాపలా ఏడ్చేసింది. నాకేం అర్థం కాలేదు. ‘నీకో నిజం చెబుతా. అయినా మునుపటిలా ప్రేమ పంచుతావా? నన్నొదలవు కదూ?’ అంది. మాటిచ్చా. ‘నేనొక అనాథని. ఇప్పుడున్న పేరెంట్స్‌ నన్ను దత్తత తీసుకున్నారు’ అనడంతో కొంచెం ఆశ్చర్యమేసింది. ఆ క్షణం నుంచే తనకి అమ్మానాన్న అవ్వాలనుకున్నా. తన కంట్లో చెమ్మ చూడొద్దనుకున్నా. తనని నవ్వించడం కోసం ఎన్నోసార్లు ఫూల్‌నయ్యా.

మంచిరోజు చూసి అమ్మానాన్నలకూ పరిచయం చేశా. వాళ్లకి విషయం అర్థమైంది. తన మంచితనం, నాపై ఉన్న ప్రేమనంతా చెప్పి పెళ్లికి కూడా ఒప్పించా. భవిష్యత్తు ఊహల్లో ఉండగానే తన నుంచి ఫోన్‌. మేం కలుసుకునే ప్లేస్‌కి అర్జెంట్‌గా రమ్మంటూ. ఏదైనా శుభవార్త చెబుతుందని పరుగెత్తుకెళ్లా. కానీ పరిస్థితి వేరుగా ఉంది. తన కళ్లు ఎరుపెక్కి ఉన్నాయి. కన్నీళ్లు ఉబికొస్తున్నాయి. ‘అంతా అయిపోయింది శ్రీ.. నన్నడక్కుండానే మావాళ్లు ఓ సంబంధం ఫిక్స్‌ చేశారు. నోరు తెరిచే అవకాశమే లేదు. నన్ను చేరదీసి నాకో జీవితం ఇచ్చినవాళ్లను ఎదిరించలేను’ తను చెబుతోంటే కన్నీళ్లతో నా చొక్కా తడిసిపోతోంది. ‘నిన్నొదులుకోవడం నా దురదృష్టం. వాళ్ల కోసం నా ప్రేమ త్యాగం చేయక తప్పడం లేదు’ అనేసి ఏడుస్తూ వడివడిగా వెళ్లిపోయింది. తనవైపే చూస్తూ అక్కడే కూలబడిపోయా.
తన ప్రేమలో కల్తీ లేదని తెలుసు. కానీ ఎలాంటి ప్రయత్నం చేయకపోవడమే నాకు నచ్చలేదు. తను వాళ్ల పేరెంట్స్‌ని ఒప్పించే ఒక్క అవకాశం నాకిస్తే బాగుండేది. తర్వాత తనని కలవాలని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. ఆమె నాకు దక్కదని తెలిశాక క్షణమొక యుగంలా గడుపుతున్నా. అమ్మ ప్రేమ తప్ప అమ్మాయి ప్రేమ తెలియని నాకు కొత్త రుచులు చవి చూపించింది. నాలో కొత్త ఆశలు రేకెత్తించింది. ఇంతలోనే ఇలా. ఈమధ్యే తనకు పెళ్లైందని తెలిసింది. ఇక నేను చేయగలిగిందేముంది? ఆమె జ్ఞాపకాలనే తలచుకుంటూ జీవిస్తా. తనెక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటా.

- శ్రీ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని