తన బాధ.. ఇతరులు పడొద్దని!

శ్రీధర్‌ ఐటీ ఉద్యోగి. నూతన ఆవిష్కరణలు చేసే వారికి సహకారం అందించాలనే ఉద్దేశంతో 2018లో ‘ఐటీ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ఫోరం’ ప్రారంభించాడు.

Updated : 03 Jul 2021 05:46 IST

ఇంట్లోవాళ్లకి కరోనా సోకితే తల్లడిల్లిపోతాం. కానీ మంచిర్యాల యువకుడు మేరుగు శ్రీధర్‌ తను అనుభవించిన బాధ ఇతరులు పడొద్దని ఓ కొత్త పనికి శ్రీకారం చుట్టాడు. కొవిడ్‌ బాధితులకు భరోసాగా ఉండేలా వైద్యులతో సలహాలు ఇప్పిస్తున్నాడు. ఔషధాలు, ఇతర సామాగ్రి అందిస్తూ మనసున్న మనిషినని చాటుకుంటున్నాడు.

శ్రీధర్‌ ఐటీ ఉద్యోగి. నూతన ఆవిష్కరణలు చేసే వారికి సహకారం అందించాలనే ఉద్దేశంతో 2018లో ‘ఐటీ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ఫోరం’ ప్రారంభించాడు. ఇదిలా ఉండగా ఇటీవల అతడి సతీమణి కొవిడ్‌ బారిన పడింది. శ్రీధర్‌ కుమారుడితో కలిసి వేరుగా ఉండాల్సి వచ్చింది. అప్పుడు ‘అమ్మకు మనం ఉన్నాం. మందులు ఇస్తున్నాం. ఎవరూ లేనివాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్ల బాగోగులు ఎవరు చూసుకుంటారు నాన్నా?’ అని అడిగాడు కొడుకు. శ్రీధర్‌ ఆలోచనలో పడ్డాడు. తనలాగే ఇబ్బందులు పడుతున్నవాళ్లని ఆదుకోవాలనుకున్నాడు. స్నేహితులు, బంధువులు, సామాజిక మాధ్యమాల ద్వారా బాధితుల సమాచారం సేకరించసాగాడు. ముఖ్యంగా కరోనా బారిన పడి అవస్థలు పడుతున్నవారు, వైద్యుడి దగ్గరికి వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారి సమస్యలను పరిష్కరించేందుకు వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేశాడు. తన ఫోన్‌ నెంబర్‌ 8463912345 నే సహాయ కేంద్రంగా మార్చేశాడు. ఆన్‌లైన్‌ ద్వారా బాధితులకు ఔషధాలు పంపిస్తూ వారి భారాన్ని తగ్గిస్తున్నాడు. వైద్యులు, వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, కొవిడ్‌ బాధితులు అంటూ నాలుగు గ్రూపులు ఏర్పాటు చేశాడు. సేవా దృక్పథం ఉన్న వైద్యులను ఇందులో చేర్చి బాధితులతో నేరుగా మాట్లాడిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని డాక్టర్లతోపాటు విదేశాల్లోని వారూ ఇందులో భాగస్వాములు కావడం విశేషం. దీంతోపాటు ఆసుపత్రుల్లో పడకలు సమకూర్చడం, భోజన సదుపాయం కల్పించడం, నిత్యావసర సరుకులు అందివ్వడంలాంటి కార్యక్రమాలెన్నో చేస్తున్నాడు. ఈ గ్రూపుల్లోని సేవా కార్యకర్తలు ఇవన్నీ నేరుగా బాధితుల దగ్గరికే వెళ్లి అందిస్తున్నారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులే దగ్గరకు రాకపోయినా సొంత మనుషుల్లా మేం సేవలందించడం గర్వంగా ఉందంటున్నాడు శ్రీధర్‌.

- కుందారపు సతీష్‌, మంచిర్యాల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని