Published : 10 Jul 2021 03:00 IST

చెడుదూరమైతేనే.. విజయం చేరువ

ఆఫీసులో టార్గెట్‌.. పరీక్షల్లో మంచి మార్కులు.. ఎంత ప్రయత్నించినా కొంతమందికి అస్సలు సాధ్యం కాదు. ఎందుకిలా? అంటే మనకుండే కొన్ని చెడు అలవాట్లే. విజయం సాధించడానికి పక్కా ప్లాన్‌ ఉన్నట్టే.. మనని వెనక్కి లాగే అలవాట్లనూ దూరం పెట్టాల్సిందే. అప్పుడే యువతకు సక్సెస్‌ దక్కుతుంది.

మాధ్యమాలపై అదుపు: పని చెడగొట్టడంలో సామాజిక మాధ్యమాలు ముందుంటాయి. స్నేహితులతో ఎప్పుడూ టచ్‌లో ఉండాలనుకోవడం, ఏదైనా విషయం మిస్‌ అవుతామనే భయంతో మనసెప్పుడూ ఫోన్‌పైనే ఉంటుంది. ఇది వ్యసనంలా మారితే కష్టం. నియంత్రణలో ఉండాలంటే ఆన్‌లైన్‌లో గడిపే సమయాన్ని కుదించుకోవాలి. ఏకాగ్రత చెడగొట్టే నోటిఫికేషన్లు ‘ఆఫ్‌’ చేయాలి.

నిద్ర వేళలు: సరైన నిద్ర లేకపోతే పనిపై తీవ్ర ప్రభావం పడుతుంది. త్వరగా అలసిపోతాం. దేనిపై దృష్టి పెట్టలేకపోతాం. మూడ్‌ మారిపోతుంది. వీటన్నింటితో ఆటోమేటిగ్గా పని సామర్థ్యం తగ్గిపోతుంది. తప్పులూ దొర్లుతాయి. నాణ్యమైన నిద్ర ఉంటే మెదడు చురుగ్గా పని చేస్తుంది. 6 నుంచి 8 గంటలు నిద్ర పోవాలి.
మల్టీ టాస్కింగ్‌ వద్దు: ఒకే సమయంలో రెండు, మూడు పనులు ముందు వేసుకుంటారు కొందరు. చివరగా దేనికీ న్యాయం చేయలేక అసంపూర్తిగా వదిలేస్తారు. అలా కాకుండా ఒకే పనిపై పూర్తిస్థాయిలో దృష్టి పెడితే అనుకున్న సమయంలో టాస్క్‌ పూర్తి చేసేయొచ్చు. మానసికంగా ప్రశాంతంగానూ ఉంటాం.

వాయిదా వద్దు: మార్చి పోతే సెప్టెంబరు ఉందిగా అనుకుంటే.. అక్కడా గట్టెక్కలేం. ఆఫీసులో పనిని పక్కకు నెట్టడమూ ఇంతే. చివరికి బాస్‌తో చీవాట్లు తప్పవు. చివరి నిమిషం దాకా వాయిదా వేస్తే చిక్కులు తప్పవు. రేపటి పనిని ఇప్పుడే పూర్తి చేస్తే నిశ్చింతగా ఉండొచ్చు. పదోన్నతుల నిచ్చెన త్వరగా ఎక్కేయొచ్చు.

జాబితా: మన బలాలు-బలహీనతలేంటో అందరికన్నా మనకే ఎక్కువ తెలుసు. ఒక పనిని ఎలాంటి సమయంలో పూర్తి చేశామో, ఎలాంటి సమయంలో చేయలేకపోయామో.. ఒక జాబితా రాసుకోండి. విజయం సాధించినప్పటి పరిస్థితులు, లక్షణాలనే అలవాటుగా మలచుకుంటే ఇక మనకు ఎదురేముంటుంది?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని