ఆ ప్రయాణం.. బతుకు గమ్యం చూపింది

కేసారి రెండు దెబ్బలు. ఇంజినీరింగ్‌ పోయింది. సర్వస్వం అనుకున్న అమ్మాయి నా జీవితంలోంచి వెళ్లిపోయింది. బీటెక్‌ నాకర్థం కాలేదు. ప్రేయసి నన్నర్థం చేసుకోలేదు. ప్రేమలో విఫలమైన బాధకంటే, ఇంట్లో ఖాళీగా ఉండటం నరకంలా అనిపించేది.

Updated : 10 Jul 2021 03:25 IST

ఒకేసారి రెండు దెబ్బలు. ఇంజినీరింగ్‌ పోయింది. సర్వస్వం అనుకున్న అమ్మాయి నా జీవితంలోంచి వెళ్లిపోయింది. బీటెక్‌ నాకర్థం కాలేదు. ప్రేయసి నన్నర్థం చేసుకోలేదు. ప్రేమలో విఫలమైన బాధకంటే, ఇంట్లో ఖాళీగా ఉండటం నరకంలా అనిపించేది. పక్కింటి బాబాయి, ఎదురింటి పిన్ని.. అందరికీ నా జీవితం మీదే శ్రద్ధ. ‘ఏం చేస్తున్నావు?’, ‘ఎప్పుడు సెటిల్‌ అవుతావు?’ ప్రశ్నలతో సూదుల్లా గుచ్చేవారు. ఇక తప్పదని ఇంట్లోంచి బయటికొచ్చేశా. కానీ ఇప్పుడేం చేయాలి? కనీసం చేతిలో డిగ్రీ లేకుండా ఉద్యోగం ఎవరిస్తారు? బతుకు అర్థం కానీ పజిల్‌లా ఉండేది. కొన్నాళ్లు ఫ్రెండ్స్‌ రూంలో ఉన్నా. ఉద్యోగాల కోసం ప్రయత్నించా. ప్చ్‌.. లాభం లేకపోయింది.

నా మాజీ ప్రేయసి అప్పుడప్పుడు నన్ను హీరోలా ఉంటావనేది. దీంతో మెగాస్టార్‌ కాకపోయినా కనీసం సైడ్‌  క్యారెక్టర్లైనా దక్కితే చాలని కృష్ణానగర్‌లో వాలిపోయా. నేను ఊహించిన దానికి భిన్నంగా ఉంది అక్కడ. సినిమా కలలు మోసుకొచ్చిన వాళ్లే కాదు.. బతుకు బండిని లాగే జీవితాలెన్నో కనిపించాయి. ఆ గల్లీల్లో తిరగడం, కేఫుల్లో గంటలకొద్దీ ఒంటరిగా కూర్చొని రావడం ఇదే దినచర్య. ఖాళీగా ఉండలేక అప్పుడప్పుడు ఎవరైనా చెప్పే ముచ్చట్లు వినేవాడిని. సినిమా నేను అనుకున్నంత ఈజీ కాదనిపించింది. ఈలోగా ఏడాది గడిచిపోయింది. ఇక ఆ ప్రయత్నమూ వదులుకున్నా. జీవితంలో దేనికీ పనికి రానేమో అనే బాధతో కుంగిపోయా. అన్నీ వదులుకొని పరాజితుడిగా ఇంటికి తిరిగి వెళ్లాలనుకున్నా.

ఆ అంధకారంలో ఉన్న నాకు ఒక పరిచయం వెలుగు బాట పరిచింది. ఊరెళ్లడానికి బస్‌ కోసం వెయిట్‌ చేస్తుంటే ఓ వ్యక్తి కారులో లిఫ్ట్‌ ఇచ్చాడు. నలభై అయిదు నిమిషాల ఆ ప్రయాణం నా చుట్టూ కమ్ముకున్న మబ్బు తెరలు తొలగించింది. జీవితాన్ని స్పష్టంగా చూపించింది. బాల కార్మికుడిగా మొదలై ఆయన ఎదిగిన తీరు చెబుతూంటే ఓ క్షణం అది నిజమేనా? అని అనుమానం కలిగింది. ఆయన జీవితంలో సినిమాకు కావాల్సినన్ని మలుపులు, పుస్తకం రాయడానికి కావాల్సినంత స్ఫూర్తి ఉన్నాయి. తన మాటలు, జీవిత విశేషాలు కొన్ని రోజుల పాటు నన్ను వెంటాడాయి. ‘అవసరమైతే కాల్‌ చెయ్‌.. కానీ ప్రయత్నం చేయకుండా ఓటమిని అంగీకరించకు’ అంటూ ఫోన్‌ నెంబర్‌ ఇచ్చాడు. ఆ ధైర్యంతోనే ఇంటికివెళ్లా. నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ వచ్చింది. ఈసారి కాస్త సీరియస్‌గా చదివాను. ఒక్కో చాప్టర్‌ అర్థం చేసుకుంటూ సిలబస్‌ కంప్లీట్‌ చేశాను. అవసరమైతే జూనియర్లనూ అడిగేందుకు కూడా వెనకాడలేదు. మొత్తానికి మిగిలిన రెండు సబ్జెక్టులు క్లియర్‌ అయ్యాయి. వెంటనే ఆయనకు కాల్‌ చేశా. ఇంజనీరింగ్‌తో ఉద్యోగం చేయలేను, ఏదైనా కోచింగ్‌ తీసుకుంటానని చెప్పాను. తెలిసిన ఇనిస్టిట్యూట్‌లో చేర్పించాడు. ఆర్థిక సాయమూ చేశాడు. సంవత్సరం తిరిగే సరికి చిన్న ఉద్యోగం దొరికింది. జీతం తక్కువైనా అదిచ్చిన ధైర్యం వెల కట్టలేనిది. ఇప్పుడు మరింత మెరుగైన సంపాదన కోసం ప్రయత్నాలు చేస్తున్నా. ఈసారి త్వరగానే లక్ష్యం చేరుకుంటాననే నమ్మకం ఉంది.

జీవితంలో స్ఫూర్తి వెతుక్కుంటే రాదు. ఊహించని రూపంలో ఎప్పుడో మనల్ని పలకరిస్తుంది. అందుకు నా జీవితమే ఉదాహరణ. ఒక రోడ్డు ప్రయాణం, అపరిచిత వ్యక్తితో మాట కలపడంతో దొరికిన ఫలితమిది.

- హరీశ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని