ఎయిర్‌ డిఫెన్స్‌లో.. ఒకే ఒక్కడు

దేశవ్యాప్తంగా వేల మంది పోటీ... తొంభై మందికే అవకాశం... అందులోనూ ఐదుగురికే ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌లో చోటు... దాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఒకే ఒక్కడిగా నిలిచాడు మన విశాఖపట్నణం కుర్రాడు సజ్జా భార్గవ్‌కృష్ణ. లెఫ్టినెంట్‌ హోదా అందుకున్న అతడితో ముఖాముఖి.

Published : 10 Jul 2021 03:00 IST

దేశవ్యాప్తంగా వేల మంది పోటీ... తొంభై మందికే అవకాశం... అందులోనూ ఐదుగురికే ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌లో చోటు... దాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఒకే ఒక్కడిగా నిలిచాడు మన విశాఖపట్నణం కుర్రాడు సజ్జా భార్గవ్‌కృష్ణ. లెఫ్టినెంట్‌ హోదా అందుకున్న అతడితో ముఖాముఖి.

భార్గవ్‌కృష్ణ చిన్నప్పట్నుంచీ చదువుల్లో చురుకు. జేఈఈ మెయిన్స్‌లో మంచి స్కోరు సాధించాడు. ఆ సమయంలోనే భారత రక్షణ రంగం ఆధ్వర్యంలో కొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయని తెలిసింది. వాటిలో ప్రవేశం పొందాలనుకున్నాడు. జేఈఈ స్కోరుతోపాటు ఎస్‌.ఎస్‌.బి. నిర్వహించే ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధిస్తే ఇంజినీరింగ్‌ పూర్తవడంతోపాటు, సైనికాధికారిగా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భావించాడు. కానీ దేశవ్యాప్తంగా దీనికి తీవ్రమైన పోటీ ఉంటుంది. కొద్దిమందికే అవకాశం దక్కుతుంది. సీటు రావాలంటే వివిధ దశల పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి. ఐదురోజుల సుదీర్ఘ ఇంటర్వ్యూ ప్రక్రియ ఎదుర్కోవాలి. వీటన్నింటికీ పట్టుదలగా సిద్ధమయ్యాడు. చివరికి తొంభై మందిలో ఒకడిగా నిలిచాడు.

కఠోర శిక్షణ..
భారత రక్షణ రంగ అవసరాలకు అనుగుణంగా అభ్యర్థులను తీర్చిదిద్దడం కోసం కోర్సులో చేరేవారికి ఏడాదిపాటు ప్రాథమిక మిలటరీ శిక్షణ ఇస్తారు. శారీరకంగా, మానసికంగా అన్ని రకాల సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దుతారు. ఇదయ్యాకే ఇంజినీరింగ్‌ కోర్సు బోధన ఉంటుంది. మొదటి దశ పూర్తి చేయలేక చాలామంది వెనుదిరుగుతుంటారు. దీన్ని దాటి భార్గవ్‌కృష్ణ పుణెలోని ప్రతిష్ఠాత్మక కాలేజ్‌ ఆఫ్‌ మిలటరీ ఇంజినీరింగ్‌లో సివిల్‌, మెకానికల్‌ విభాగంలో మూడేళ్ల డ్యుయల్‌ ఇంజినీరింగ్‌ కోర్సు చదివాడు. లెఫ్టినెంట్‌ హోదా అందుకున్నాడు. దేశం మొత్తమ్మీద ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఒక్కరికే ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ విభాగంలో చోటు దక్కుతుంది. ఈ అరుదైన అవకాశాన్నీ సొంతం చేసుకున్నాడు. దాంతోపాటు ఐదుగురికే ‘పైలెట్‌ ఆప్టిట్యూడ్‌ బ్యాటరీ టెస్ట్‌’ (పి.ఎ.బి.టి.) అవకాశం రాగా.. దాన్నీ చేజిక్కించుకున్నాడు. ఉత్తీర్ణులైన ముగ్గురిలో ఒకడిగా నిలిచాడు. ఈ ఏడాది దేశంలోనే ఈ ఘనత అందుకున్న ఒకే ఒక్కడిగా నిలిచాడు. తల్లిదండ్రుల చేతుల మీదుగా సైనిక యూనిఫాంపై నక్షత్రాలు అలంకరింపజేసుకున్నాడు.

- బి.ఎస్‌.రామకృష్ణ, విశాఖపట్నం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని