లావైపోయింది.. బ్రేకప్‌ చెప్పేయనా?

నేనొక అమ్మాయిని ప్రేమించాను. చాలా అందంగా ఉండేది తను. రెండేళ్లు ఆమె వెనకాలే తిరిగి నా ప్రేమను ఓకే చేయించుకోగలిగాను. నాకు మంచి ఉద్యోగం ఉంది, తనకన్నా మేం స్థితిమంతులం. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాం.

Updated : 31 Jul 2021 06:14 IST

మనలో మనం

నేనొక అమ్మాయిని ప్రేమించాను. చాలా అందంగా ఉండేది తను. రెండేళ్లు ఆమె వెనకాలే తిరిగి నా ప్రేమను ఓకే చేయించుకోగలిగాను. నాకు మంచి ఉద్యోగం ఉంది, తనకన్నా మేం స్థితిమంతులం. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాం. పెద్దలూ ఒప్పుకున్నారు. సమస్య ఏంటంటే మూడు నెలల కిందట తనకి కరోనా వచ్చి కోలుకుంది. అప్పట్నుంచి బాగా లావైపోయింది. తరచూ ఆయాసం వస్తోందంటోంది. నేను తన అందం చూసే ప్రేమించాను. ఇప్పుడిలా మారిపోయాక నాకు ఆమెపై ఆసక్తి తగ్గుతోంది. బ్రేకప్‌ చెప్పొచ్చా?

- ఎస్‌.వి., వైజాగ్‌

వయసులో ఉన్న అమ్మాయిలు అందంగా కనిపించాలని తహతహలాడటం సహజం. అలాగే అబ్బాయిలు కూడా తమకు కాబోయే భార్య అందంగా ఉండాలని కోరుకుంటారు. తమ జంటను చూసి ఇతరులు అసూయ పడాలి అనుకుంటారు. కానీ వాస్తవాలు, ఆచరణ వేరేగా ఉంటాయి. వాస్తవం, అవాస్తవం మధ్య ఊగిసలాడుతూ.. మీరు ఇబ్బంది పడుతూ, తనని ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తోంది. మీ జీవిత భాగస్వామి పెళ్లి విషయంలో ఇలా ఆలోచించడం కరెక్ట్‌ కాదు. మీరు తనతో ఏకాంతంగా మాట్లాడండి. ఆమె మనోభావాలను అర్ధం చేసుకోండి. ఈరోజుల్లో ఆడవాళ్లు లావు కావడం, సన్నబడటం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే కరోనా తర్వాత తన శరీరంలో మార్పులొచ్చాయని మీరే చెప్పారు. అది తాత్కాలికమైన మార్పు మాత్రమే! ఈ విషయంలో మీరంతగా భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం కష్టపడితే తను మళ్లీ మామూలుగా మారిపోవచ్చు. పోనీ అలా కాదు అనుకొని ఈ అమ్మాయిని కాదని మీరు సన్నగా, నాజూగ్గా ఉన్న మరో అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అనుకుందాం. పెళ్లైన తర్వాత ఆమె లావుగా మారదని గ్యారెంటీ ఏమిటి? అలా జరిగితే అప్పుడేం చేస్తారు? అందుకే మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి.

అందం చూసి పుట్టేది ప్రేమ కాదు.. ఆకర్షణ. స్వచ్ఛమైన మనసు, వ్యక్తిత్వం చూసి పుట్టేదే నిజమైన ప్రేమ. అలాంటి ప్రేమ మీ ఇద్దరిలో ఉంటే లావు కావడం అనేది చిన్న సమస్యే అవుతుంది. తను గనక మిమ్మల్ని బాగా ఇష్టపడుతుంటే అస్సలు వదులుకోవద్దు. ఆమె సన్నబడటానికి ఒబెసిటీ సెంటర్లు ఉన్నాయి. కొన్నాళ్లు వ్యాయామం చేస్తే నాజూగ్గా అవుతుంది. అదీకాకుండా వేరే ఇతర సమస్యలు ఉన్నాయేమో కనుక్కోవడానికి ఓసారి వైద్యుడిని సంప్రదించండి. తల్లి తర్వాత మనల్ని ప్రాణంగా ప్రేమించేది భార్య మాత్రమే. డబ్బు ఉన్నా, లేకపోయినా కష్టాలు, కన్నీళ్లలో అండగా నిలబడేది ఆమెనే. ఇష్టపడి, అర్థం చేసుకునే అలాంటి అమ్మాయిని వదులుకోవద్దు. కాబట్టి అనవసరమైన ఆలోచనలతో మీ మనసుని పాడు చేసుకొని మంచి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఇక కరోనా తర్వాత ఆయాసం రావడం, ఇతర చిన్నచిన్న అనారోగ్య సమస్యలు సహజం. వైద్యుల సలహాలతో సరైన చికిత్స తీసుకుంటే ఎప్పటిలా మారిపోతారు. దీని గురించి అనవసర భయాలు వద్దు. అవకాశవాదులు మాత్రమే అవసరం తీరిపోయాక ప్రేమకు బ్రేకప్‌ చెబుతుంటారు. మీరూ ఆ జాబితాలో ఉండొద్దు.

- డా.టీఎస్‌ రావు, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని