Updated : 07 Aug 2021 05:06 IST

వర్క్‌ ఫ్రం హోం.. ఇంటి నుంచే కాదు..

ఆఫీసు పని సొంతింటికి వచ్చేసింది. నెట్టిల్లే వారధిగా బాస్‌కి, ఉద్యోగికి దూరం చెరిపేసింది. వర్క్‌ ఫ్రం హోం.. చాలామందికి హాయిగానే ఉన్నా కొంతమందికి అప్పుడే బోర్‌ కొట్టేసింది. కార్యాలయంలో కోల్పోయే సరదాలతో బోరుమనే వాళ్లెందరో. ఆ జాబితాలో మీరున్నారా? అలాగైతే వర్క్‌ ఫ్రం హోం సరికొత్తగా ఇలా ప్రయత్నించండి.


కాఫీని గుటకేస్తూ..

కాఫీని సిప్‌ చేస్తూ.. స్నాక్స్‌ ఆరగిస్తూ ఓ మూలన కూర్చొని పని మొదలు పెట్టాలనుకుంటే కేఫ్‌లు, కాఫీ షాపులు మంచి ఎంపిక అవుతుంది. కొన్నిచోట్ల ఉచిత వై-ఫై సౌలభ్యం కూడా ఉంటోంది. ఫ్రీలాన్స్‌ ఉద్యోగాలు చేసే చాలామంది ఇలా ల్యాపీలతో కుస్తీ పడుతూ కనపడుతూనే ఉంటారు. వాళ్లతో చేరిపోవచ్చు.


అదే అనుభూతి

వర్క్‌ ఫ్రం హోంతో ఎన్ని సౌలభ్యాలున్నా ఆఫీసులో ఉండి పని చేస్తున్నప్పుడు కలిగే ఫీల్‌ రాదు. అలాంటి వాళ్లు కో-వర్కింగ్‌ స్పేస్‌ని తీసుకోవచ్చు. కొన్ని సంస్థలు పెద్దపెద్ద కార్యాలయాలను చిన్నచిన్న భాగాలుగా విడగొట్టి అద్దెకిస్తుంటాయి. డెస్క్‌, ప్రింటర్లు, కంప్యూటర్లు.. అన్నీ ఉండటంతో ఆఫీసులో ఉన్న అనుభూతి కలుగుతుంది.


స్నేహితుడి చెంతన...

కొంచెం సరదా వాతావరణం కావాలనుకుంటే స్నేహితుడు లేదా సహోద్యోగి ఇంటినే వర్క్‌ ఫ్రం హోం కేంద్రంగా మార్చేయొచ్చు. అప్పుడు పక్కన సహోద్యోగులు ఉన్న ఫీలింగ్‌ కలుగుతుంది. అప్పుడప్పుడు సరదాగా కాసిన్ని కబుర్లు కూడా చెప్పుకోవచ్చు. సందేహాలుంటే తీర్చుకోవచ్చు.


చదువుతూ.. పని చేస్తూ 

బాగా పుస్తకాలు చదివే అలవాటు ఉన్న కుర్ర ఉద్యోగులకి గ్రంథాలయాల నుంచి పని చేయడం తెగ నచ్చేస్తుంది. ఇక్కడ బోలెడంత ప్రశాంతత దొరుకుతుంది. సీరియస్‌గా పని చేసుకోవచ్చు. వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పనిలో పనిగా చిన్నచిన్న బ్రేక్‌లు వచ్చినప్పుడు మనకిష్టమైన పుస్తకాలు చదువుకోవచ్చు.


ప్రకృతి ఒడిలో..

పచ్చని ప్రకృతి మధ్య, సెలయేర్ల చెంతన హాయిగా పని చేయాలంటే అమ్మమ్మ, నానమ్మ, బంధువులుండే పల్లెటూళ్లకు వెళ్లిపోండి. హిల్‌ స్టేషన్లలో సేదతీరండి. అక్కడ మనసుకు నచ్చే హాయి దొరుకుతుంది. అన్నట్టు ఇంటర్నెట్‌ సదుపాయం, సిగ్నళ్లు సరిగా ఉన్నాయో, లేదో ముందే చూసుకోవాలి సుమా!

ఇంటి నుంచి పని.. మొదలైందే కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి. ఈ కాన్సెప్ట్‌ బోర్‌గా ఫీలయ్యేవాళ్లు, మార్పు కోరుకునేవాళ్లు.. నచ్చిన చోటి నుంచి పని చేసినా కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు