నా ఎదుగుదల.. నీ భిక్ష!

‘నువ్వు చేస్తోంది తప్పు శ్రీ.. అమ్మానాన్నల్ని ఎదిరించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నేనొప్పుకోను’ ఆ మాటతో మొదటిసారి అక్క నచ్చలేదు. ఈ ఐదేళ్లలో ప్రతి నిర్ణయంలో తనుంది. బీటెక్‌ కోర్సు, వేసుకునే డ్రెస్‌, వాడే ఫోన్‌.. ప్రతీ విషయంలో...

Published : 21 Aug 2021 03:29 IST

‘నువ్వు చేస్తోంది తప్పు శ్రీ.. అమ్మానాన్నల్ని ఎదిరించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నేనొప్పుకోను’ ఆ మాటతో మొదటిసారి అక్క నచ్చలేదు. ఈ ఐదేళ్లలో ప్రతి నిర్ణయంలో తనుంది. బీటెక్‌ కోర్సు, వేసుకునే డ్రెస్‌, వాడే ఫోన్‌.. ప్రతీ విషయంలో. కానీ ఇప్పుడు అసలు తనెవరు? తన మాటెందుకు వినాలి? అనిపించింది.

శ్రీలతది ప్రకాశం జిల్లా. నాది వరంగల్‌. ఫేస్‌బుక్‌ మమ్మల్ని కలిపింది. ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్న ఫ్రెండ్‌లా మాట్లాడేది. తొందర్లోనే మా ఫోన్‌ నంబర్లు తర్జుమా అయ్యాయి. తను ప్రతి విషయం షేర్‌ చేసుకునేది. ఏ అవసరం వచ్చినా ఆదుకునేది. సలహాలిచ్చేది. ఓసారి మాటల్లో తెలిసింది.. తను నాకన్నా రెండేళ్లు పెద్దని.

ఒకరోజు క్యాజువల్‌గా ఫోన్‌ చేశా. గొంతులో ఏదో తేడా. ఏమైందని అడిగా. ‘ఎనిమిదేళ్ల కిందట ఇదేరోజు తమ్ముడు యాక్సిడెంట్‌లో చనిపోయాడు. ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా. వాడంటే నాకు ప్రాణం శ్రీ’ అంది. నాకూ కన్నీళ్లొచ్చాయి. ‘నేను నిన్ను తమ్ముడు అని పిలవొచ్చా?’ అంది తేరుకొని. నాపై ఎంతో అభిమానం, ఇష్టం ఉంటేగానీ అలా అడగదనిపించింది. సరేనన్నా. అప్పట్నుంచి తను నాకు తోబుట్టువుకన్నా ఎక్కువైంది.

మామధ్య అనుబంధం అల్లుకున్నాక మొదటిసారి విభేదించింది ఇప్పుడే. కారణం కీర్తి. నా బీటెక్‌ క్లాస్‌మేట్‌. మా ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. కులం పేరెత్తారు. జీవితంలో స్థిరపడలేదన్నారు. వాళ్లని ఎదిరించాలనుకున్నాం. అర్థం చేసుకొని అండగా నిలుస్తుందనుకుంటే అక్క కూడా అమ్మానాన్నల పాటే పాడింది. ఫ్రెండ్స్‌ సాయంతో మేం గుడిలో ఒక్కటయ్యాం. టౌనులో కాపురం పెట్టాం. మాట వినలేదని మొదట్లో కొంచెం బెట్టు చేసినా, కొన్నాళ్లయ్యాక మమ్మల్ని వాళ్లింటికి పిలిచింది. మూడ్రోజులు ఆప్యాయతలతో ముంచెత్తింది. వచ్చేటప్పుడు ఇద్దరికీ కొత్త బట్టలు పెట్టి, ఖర్చులకంటూ జేబులో కొన్ని కరెన్సీ నోట్లు కుక్కింది.

మొదట్లో మా సంసారం స్వర్గంలాగే ఉండేది. కొన్నాళ్లయ్యాక ఇంట్లో అది లేదు.. ఇది లేదు అంటూ అలిగేది కీర్తి. తను పెద్దింటి పిల్ల. నాది చిన్న ఉద్యోగం. బుజ్జగించేవాణ్ని. తన కోర్కెలు తీర్చడానికి నెలనెలా అప్పులు చేసేవాణ్ని. అయినా సంతృప్తి లేదు. ఇదికాక నేను ఎవరైనా పరిచయం ఉన్న అమ్మాయితో మాట్లాడితే నేరం. గొడవలు నిత్యకృత్యమయ్యాయి. ఓరోజు కొలీగ్‌ బర్త్‌డే పార్టీకెళ్లా. కొంచెం మందు తాగి ఇంటికొచ్చా. అరిచి గోల చేసింది. తాగుబోతుననీ, తిరుగుబోతుననీ, పెళ్లాం కోర్కెలు తీర్చలేని చేతగానివాడినని తిట్టింది. కోపంలో చేయి చేసుకున్నా. ఆ రాత్రే పుట్టింటికెళ్లిపోయింది. తర్వాత క్షమించమని వేడుకున్నా. రెండునెలలు కాళ్లావేళ్లా పడ్డా. కనికరించలేదు. నాలుగేళ్ల ప్రేమ, ఏడాదిన్నర బంధం ముగిసిపోయింది.

పెళ్లాం వదిలేసిన భర్తగా ఊళ్లో తలెత్తుకోలేకపోయా. తాగుడు ఎక్కువైంది. ఉద్యోగం పోయింది. ఆ సమయంలో అక్కే దేవతలా ఆదుకుంది. ‘నీకు డబ్బు, ఉద్యోగం లేదని చిన్నచూపు చూపు చూసినవాళ్లు కుళ్లుకునేలా ఎదిగి చూపించు’ అంది. తన సలహాతోనే బ్యాంకింగ్‌ ఉద్యోగాల శిక్షణలో చేరా. ఖర్చంతా అక్కదే. అప్పుడప్పుడు ఫోన్‌ చేసి లక్ష్యం గుర్తు చేసేది. ఎనిమిది నెలలు పుస్తకాలు, ప్రాక్టీసే లోకంగా బతికా. తన ఆశీర్వాదం, నా పట్టుదల ఫలించాయి. తొలి ప్రయత్నంలోనే పీవోగా ఎంపికయ్యా. నాకన్నా ఎక్కువ సంతోషపడింది తనే.

ఊరిలో నేనిప్పుడు ఓ హీరోని. ఈ క్రెడిట్‌ అంతా శ్రీలత అక్కదే. నేను కిందపడ్డ ప్రతిసారీ భుజం పట్టుకొని పైకి లేపింది. దుఃఖమొస్తే కన్నీళ్లు తుడిచింది. ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా అంతకన్నా ఎక్కువ ప్రేమ పంచింది. నేను ప్రయోజకుడిని అయ్యానంటే తనే కారణం. ఏమిచ్చినా తన రుణం తీర్చుకోలేదు. రేపు అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రక్షా బంధన్‌. ఓసారి నా సోదరిని గుర్తు చేసుకోవాలనిపించింది.

-  శ్రీకాంత్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని