Updated : 04 Sep 2021 04:17 IST

ప్రేమించి.. తప్పు చేశా

మనసులోమాట

నా కథ వింటే కొందరికి జాలి కలగొచ్చు. చాలామంది తిట్టుకోవచ్చు. కానీ.. నా గుండెలో భారం దిగాలంటే మీతో చెప్పుకొని తీరాల్సిందే అనిపించింది.

నా పేరు స్వీటీ. చిన్నప్పట్నుంచి నాన్న ఓ మాట చెబుతుండేవారు. ‘చదువే మనకు ఆస్తి.. అదుంటే ఏదైనా సాధించవచ్చు’ అని. అందుకే చదువు నాకు ఆరోప్రాణమైంది. నన్ను ర్యాంకర్‌ని చేసింది. డిగ్రీ పూర్తవగానే ప్రభుత్వ ఉద్యోగం దక్కేలా చేసింది.

జాబ్‌ చేయగలనో, లేదో అని కొత్తలో భయమేసేది. అప్పుడు మిక్కీ అండగా నిలిచాడు. ఇద్దరిదీ సేమ్‌ కేడర్‌. బాగా సహకరించేవాడు. కాకపోతే తను సైలెంట్‌. అమ్మాయిలంటే గౌరవం. నేను కోరుకున్న లక్షణాలన్నీ ఉన్నాయి. కొన్నాళ్లయ్యాక ప్రపోజ్‌ చేయాలనుకున్నా. ‘ఆడపిల్లవై ఉండీ నువ్వెలా ముందు చెబుతావేే.. నీకేమైనా పిచ్చా?’ అంది ఫ్రెండ్‌. సందిగ్ధంలో పడిపోయా. ‘తను మంచివాడనుకున్నావు. కానీ తనకి పెళ్లైందని తెలుసుకోలేకపోయావేంటి’ అంది మరోరోజు. నా మనసు ముక్కలైంది. బాధతో రెండ్రోజులు ఆఫీసు ముఖం చూడలేదు. స్నేహితురాలు చెప్పినట్టే మనసు రాయి చేసుకొని తనకు దూరంగా ఉండసాగా. కానీ ఓసారి తప్పనిసరై మిక్కీ డెస్కుకి వెళ్లా. ‘ఏంటి.. ఈమధ్య నన్నసలు పట్టించుకోవడమే లేదు. అంత చెడ్డవాడినైపోయానా? అన్నాడు. మనసు చివుక్కుమంది. ఫ్రెండ్లీగా ఉంటే తప్పేంటనిపించింది. మళ్లీ మాటలు కలిశాయి. తనూ ఆపేక్ష చూపించేవాడు.

నాకు నీళ్లున్న ప్రదేశాలంటే ఇష్టం. అది తెలుసుకొని ఓసారి అలాంటి ప్లేస్‌కి తీస్కెళ్లాడు. పరిచయమైన 15 నెలల్లో అదే మొదటిసారి మేం బయటికెళ్లడం. తిరిగొచ్చేటప్పుడు ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్టే ఉంటుంది’ అన్నాడు. ఆ మాటతో కరిగిపోయా. నేను గతంలో తనని ఇష్టపడ్డ విషయం చెప్పా. ఆపై మేం మరింత దగ్గరయ్యాం. కానీ ఏనాడూ హద్దులు దాటలేదు. పెళ్లైన వ్యక్తిగా నీ కుటుంబానికే తొలి ప్రాధాన్యం ఇవ్వు అనేదాన్ని. మేం ఎంత పద్ధతిగా ఉన్నా మామధ్య ఏదో ఉందనే గుసగుసలు వినపడేవి.

తొమ్మిదినెలలు గడిచాయి. నాకు మరో మంచి జాబ్‌ వచ్చింది. వెళ్లొద్దని బతిమాలాడు. మనం దూరంగా ఉన్నా మన మనసుల్లో ప్రేమ తగ్గదని ఊరడించా. వెళ్లాక అర్థమైంది నేను మిక్కీని చూడకుండా ఉండలేనని. అప్పుడప్పుడు తనకోసం వాళ్ల ఊరు వెళ్లేదాన్ని. కానీ ఏమైందో తెలియదు.. సడెన్‌గా తనలో మార్పు. నన్ను విపరీతంగా తిట్టేవాడు. ఫోన్‌ చేస్తే కసురుకునేవాడు. తన మాట విననందుకు కోపంలో అలా చేస్తున్నాడనుకున్నా. రోజులు గడిచినా అదే తీరు! ఓ అర్ధరాత్రి ఫోన్‌ చేసి ‘నువ్వు మనసులో చెడుగా కోరుకొని ఉంటావ్‌. అందుకే నా ఫ్యామిలీకి ఇబ్బందులొస్తున్నాయి’ అన్నాడు. నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా అని ఏడ్చాను. ఇంకోసారి తనని కలవొద్దనుకున్నా. కానీ నా మనసు మాటపై నిలబడలేకపోయింది. పుట్టినరోజని తెలిసి ఓరోజు హడావుడిగా పెద్ద గిఫ్ట్‌ తీసుకొని బయల్దేరా. బస్టాండ్‌లో ఉండి ఫోన్‌ చేశాను. ‘నువ్వు నా పాలిట దరిద్రం.. ఎందుకొచ్చావ్‌?’ అని తిట్టాడు. ఏడ్చుకుంటూ వెనక్కి వెళ్లిపోయా.

ఏడాదైంది మేం విడిపోయి. అసలు నా అపరాధమేంటి¨? ఒకబ్బాయిని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డా. హద్దుల్లో ఉంటూనే అనుబంధం కొనసాగించాలనుకున్నా. అదే నా తప్పా? పోనీ నేనే తనని వదిలేద్దాం అనుకుంటే ఒకప్పుడు తను నాపై చూపిన ప్రేమ వివశురాలిని చేస్తోంది. మొదట్లో ప్రేమ కురిపించిన తను నా పట్ల ఎందుకంత నిర్దయగా ప్రవర్తిస్తున్నాడు అన్నదే నాకిప్పటికీ అర్థం కాని విషయం. ఏదేమైనా నేను ఓడిపోయాను. నన్ను నేను గెలిపించుకోవడానికి మళ్లీ పుస్తకం పడుతున్నాను. ఈసారి నా లక్ష్యం పెద్దది. నిత్యం జనాల్లో ఉంటూ వాళ్ల జీవితాల్ని ప్రభావితం చేయగలిగే ఉద్యోగం కోసం ప్రయతిస్తున్నా. తప్పకుండా సాధిస్తాను.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు