వయసే.. 20 ఇరవై!

చదువే లోకమైన కుర్రాడు కొత్తగా సరదాలకు సై అంటాడు. పుస్తకం వదలని అమ్మాయి డేటింగ్‌ బాట పడుతుంది. ఐటీ జాబో, సర్కారు కొలువో కావాలనుకున్న అబ్బాయి కెరీర్‌ వదిలి ప్రేమ పరుగు మొదలెడతాడు.

Published : 04 Sep 2021 01:02 IST

చదువే లోకమైన కుర్రాడు కొత్తగా సరదాలకు సై అంటాడు. పుస్తకం వదలని అమ్మాయి డేటింగ్‌ బాట పడుతుంది. ఐటీ జాబో, సర్కారు కొలువో కావాలనుకున్న అబ్బాయి కెరీర్‌ వదిలి ప్రేమ పరుగు మొదలెడతాడు.  ఏంటిదంతా? అంటే ఇరవై ఏళ్ల వయస్సునామీ చేసే గందరగోళం బాస్‌! ఇక్కడే అడుగు జాగ్రత్తగా పడాలి. లేదంటే అనుబంధం, చదువు, కెరీర్‌ అగమ్యగోచరమవుతుంది.

* కొత్తగా రిలేషన్‌షిప్‌ మొదలైంది అంటే లవ్‌, రొమాన్స్‌, ఎంజాయ్‌మెంట్‌.. ఇవే ఊహించుకుంటుంటారు యూత్‌. కానీ అన్నింట్లోనూ ఎత్తుపల్లాలు, గిల్లికజ్జాలూ ఉంటాయి. ఇవి తట్టుకోలేనివాళ్లు డేటింగ్‌, ప్రేమ పేరెత్తకుండా ఉంటేనే మంచిది.

* ప్రేమలో పడ్డాక నేనేదైనా మంచి పని చేస్తే భాగస్వామి ‘వావ్‌’ అనాలి. ఆకాశానికెత్తేయాలి అనుకుంటారు చాలామంది. ఇలా అనుకుంటే ఆశాభంగం తప్పదు. ఒకర్నొకరు ప్రేమించడం, గౌరవించడం వరకైతే ఓకే. తను అలా ఉండాలి.. ఇలా ఉండాలి అనుకుంటూ ఉంటే ఇబ్బందే.

*చాలామందికి గతంలో ఏవో పాత అనుబంధాలు, ప్రేమలు ఉంటాయి. ఈ బ్యాగేజీలు మనసులోనే దాచుకుంటే అనర్థదాయకం. అవే కొంపముంచుతాయి. అన్నీ పంచుకుంటే.. పెద్దమనసుతో క్షమిస్తేనే.. కొత్త బంధాలు బలపడతాయి.

* ఏ బంధానికైనా నమ్మకమే పునాది. మాట నచ్చలేదనో, తీరు బాగా లేదనో మనసులోనే దాచుకున్నా మంచిది కాదు. అన్నీ ఓపెన్‌గా మాట్లాడుకుంటే మనస్పర్థలు పటాపంచలవుతాయి. నమ్మకం ఆటోమేటిగ్గా మన దరి చేరుతుంది.

* ఒకరంటే ఒకరిపై నమ్మకం ఉండటం ఫర్వాలేదుగానీ.. వ్యక్తిత్వం పలుచనయ్యేలా భాగస్వామిపై ఆధారపడాల్సిన పన్లేదు. ప్రేమలో సక్సెస్‌ కావాలంటే అవతలి వారి వ్యక్తిగత పరిధుల్లోకి చొచ్చుకొని వెళ్లకుండా ఉండటమే ఉత్తమం.

* రిలేషన్‌షిన్‌లో దేనికదే, ఎవరికి వారే ప్రత్యేకం. ఇతరులతో పోల్చుకోవద్దు. మనం వాళ్లలా, వీళ్లలా ఉండాలని ఆంక్షలు పెట్టుకోవద్దు. పోలికలు మొదలైతే.. మనలోని లోపాలు కనిపిస్తాయి. మనస్ఫూర్తిగా ఉండలేం.

* ప్రేమలో పడ్డప్పుడు ఉన్నంత గాఢత తర్వాత ఉండదు. అంతమాత్రాన ఆ ఆపేక్ష తగ్గిందని అనుకోవడానికి వీల్లేదు. కాలం సాగేకొద్దీ ఇష్టం మనుషుల మధ్య మాటల్లో కన్నా చేతల్లో బలపడుతుంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని