నువ్వు లేవన్నది అబద్ధం చెయ్‌రా..

వాడు కుడి అయితే నేను ఎడమ. తను నిప్పు అయితే నేను నీరు. మా అభిప్రాయాలు దూరమైనా మనసులు మాత్రం దగ్గర. వాడే నరేశ్‌. పార్టీలు చేసుకోవడం, స్నేహితులతో తిరగడం, అమ్మాయిల్ని ఫాలో కావడం.. రేపు ఏంటన్నది ....

Updated : 18 Sep 2021 04:43 IST

వాడు కుడి అయితే నేను ఎడమ. తను నిప్పు అయితే నేను నీరు. మా అభిప్రాయాలు దూరమైనా మనసులు మాత్రం దగ్గర. వాడే నరేశ్‌. పార్టీలు చేసుకోవడం, స్నేహితులతో తిరగడం, అమ్మాయిల్ని ఫాలో కావడం.. రేపు ఏంటన్నది ఆలోచించక పోవడమే వాడి దృష్టిలో ఎంజాయ్‌మెంట్‌. మందు తాగితే ఆరోగ్యం పాడవుతుంది అని నేనంటే.. ‘అమ్మేవాడు బాగుపడతాడు కదరా’ అంటూ నవ్వేవాడు. చెడులోనూ మంచి చూస్తూ జాలీగా ఉండేవాడు.

పదిలో మా స్నేహం మొదలైంది. ఇంటర్లో ఒకర్నొకరం విడిచి ఉండలేనంత ఎదిగింది. పొలంగట్లపై షికార్లు, బైక్‌ రైడింగ్‌లు, క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకెళ్లడం.. మామధ్య ఎన్ని జ్ఞాపకాలో! తర్వాత నేను బీటెక్‌లో చేరా. వాడు చదువుకు విరామం ప్రకటించాడు. తను నా పక్కన లేకుంటే ఏదోలా ఉండేది. రోజంతా డల్‌గా గడిచేది. నేను థర్డియర్‌లో ఉండగా మా కాలేజీలోనే చేరాడు.. నాకు జూనియర్‌గా.

వేరొకరిపై ఆధారపడటం నరేశ్‌కి నచ్చదు. ఇంటర్‌ నుంచే పార్ట్‌ టైం జాబ్‌, వ్యవసాయ పనులు చేసేవాడు. సంపాదించిన డబ్బులతో సొంత బైక్‌ కూడా తీసుకున్నాడు. అంతవరకు నాకూ సంతోషమే. కానీ, ఇంటికి దూరంగా సొంతంగా ఓ రూం తీసుకున్నాడు. నాకది నచ్చలేదు. అమ్మానాన్నల్ని వదిలి దూరంగా ఉండొద్దన్నా. వాడు విన్లేదు. అప్పట్నుంచి మామధ్య మాటలు తగ్గాయి. కొన్నాళ్లకి నా చదువు పూర్తైంది. జాబ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చా. నా పనిలో నేను, వాడి చదువులో వాడు.. బిజీ అయిపోయాం.

ఆరోజు నా పుట్టినరోజు. సాయంత్రం ఒక తెలియని నెంబరు నుంచి ఫోన్‌.. వాడే. ముందు అమ్మాయి వాయిస్‌తో ఆట పట్టించాలని చూశాడు. కనిపెట్టేసరికి మామూలు మాటల్లోకి దిగిపోయాడు. చిన్ననాటి జ్ఞాపకాలు, ఊరి విషయాలు, చదువు.. చాలాసేపు మనసు విప్పి మాట్లాడుకున్నాం. చివర్లో ఏదో విషయం చెప్పాలని ప్రయత్నించి చెప్పలేకపోయాడనిపించింది. ఆ సమయంలో వాడి గొంతులో జీర. నేను చెప్పమని బలవంతం చేయలేదు. కానీ అదే వాడితో ఆఖరి మాట అవుతుందని ఊహించలేకపోయా.

కొన్నాళ్లకి ఓ మిత్రుడి ఫోన్‌. ‘మన ఫ్రెండ్‌ నరేశ్‌ ఇక లేడు’ అని. ఏం విన్నానో ముందు అర్థం కాలేదు. అర్థమయ్యాక ఆ క్షణం కాలం ఆగిపోతే బాగుండు అనిపించింది. ఎవరో నా ప్రాణాన్ని లాక్కుపోతున్నట్టు అనిపించింది. వెంటనే బ్యాగ్‌ సర్దేసుకొని ఆదరాబాదరాగా ఊరు బయల్దేరా. వాడి నిర్జీవ శరీరాన్ని చూశా. ‘ఏడిస్తే మన బాధంతా మాయమైపోతుందిరా’ అని తను చాలాసార్లు చెప్పిన మాట గుర్తొచ్చింది. కానీ ఆ క్షణం నేను ఏడవాలనుకోలేదు. ఎందుకంటే.. వాడు సొంతంగా గది తీసుకొని ఉన్నప్పుడు, చివరిసారి ఫోన్‌ చేసినప్పుడు.. ఎందుకలా చేశావ్‌? నీకేమైనా ఇబ్బందా? అని గట్టిగా ఆరా తీయాల్సింది. మనసు విప్పేవాడేమో. నేను తప్పు చేశా. అందుకే ఏడవకుండా బాధనంతా గుండెలోనే దాచుకోవాలనుకున్నా. ‘ఎవరినో ప్రేమించాడట, వాళ్లే ఇలా చేశారట..’, ‘కాదు.. ఆ అమ్మాయి దక్కదని తనే ఆత్మహత్య చేసుకున్నాడట’ శ్మశానం నుంచి తిరిగొస్తుంటే కొన్ని మాటలు నా చెవిన పడ్డాయి. కానీ నిజం ఏంటో ఎవరికీ తెలియదు.

వాడి చావు ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నే. కానీ స్నేహం అంటే ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌ చేయడం.. వారికి సంతోషం పంచడమే కాదు.. బాధలుంటే చెప్పుకోవడం కూడా.  అది తెలుసుకోలేక మమ్మల్ని అర్ధాంతరంగా వదిలి ఎంతో క్షోభకు గురి చేశాడు. కనీసం వాళ్ల అమ్మానాన్నల గురించి అయినా ఆలోచించాల్సింది. వాడినే తలచుకుంటూ ఇంకా  కుమిలిపోతున్నారు. నరేశ్‌.. నువ్వు మందు తాగినప్పుడు, క్లాసులు బంక్‌ కొట్టినప్పుడు, పార్టీలు చేసుకున్నప్పుడు పెద్ద తప్పుగా అనిపించలేదు. కానీ మమ్మల్ని వదిలి నువ్వు క్షమించరానంత పెద్ద తప్పు చేశావ్‌రా. ఐ మిస్‌ యూ రా.. 

 - రవి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని