‘నేను తనకి బోర్‌ కొట్టానా? బంగారం అని పిలవడం లేదు’

ఏడాదిన్నరగా నేను, ఓ అమ్మాయి ప్రేమించుకుంటున్నాం. మొదట్లో నేనంటే తెగ ఇష్టం చూపించేది. ‘డియర్‌’, ‘బంగారం’ అంటూ సంబోధించేది. రోజుకి రెండు గంటలైనా ఫోన్‌లో మాట్లాడుకునే వాళ్లం. ఏ నిర్ణయమైనా నన్ను అడిగే ...

Updated : 25 Sep 2021 08:59 IST

ఏడాదిన్నరగా నేను, ఓ అమ్మాయి ప్రేమించుకుంటున్నాం. మొదట్లో నేనంటే తెగ ఇష్టం చూపించేది. ‘డియర్‌’, ‘బంగారం’ అంటూ సంబోధించేది. రోజుకి రెండు గంటలైనా ఫోన్‌లో మాట్లాడుకునే వాళ్లం. ఏ నిర్ణయమైనా నన్ను అడిగే తీసుకునేది. ఇప్పుడు అంతగా ఆసక్తి చూపించడం లేదు. పైగా అప్పుడప్పుడు నాపై చిరాకు పడుతోంది. ముందులా ప్రేమగా పిలవడం లేదు. నేను తనకి బోర్‌ కొట్టానా? తను మునుపటిలా ఉండాలంటే ఏం చేయాలి?

- తేజస్‌, ఈమెయిల్‌

ప్రేమ.. ఒక అనిర్వచనీయమైన భావోద్వేగం. అది ఇలాగే ఉంటుంది, ఉండాలని చెప్పలేం. ఎందుకంటే ప్రేమను వ్యక్తపరిచే పద్ధతి ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉంటుంది. వాళ్ల మనస్తత్వాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మీ విషయానికొస్తే మీ వయసు, వివరాలు.. స్పష్టంగా చెప్పలేదు. ఏ బంధంలో అయినా మొదట్లో ఉన్నంత గాఢత తగ్గుతూ వస్తుంది. కొత్త పరిచయం, బంధం ఏర్పడేటప్పుడు మనం దానిమీద చాలా సమయం కేటాయిస్తాం. సహనంగా ఉంటాం. కానీ బంధం బలపడే కొద్దీ ప్రతిసారీ ప్రేమను వ్యక్తపరచనవసరం లేదు.. అవతలి వ్యక్తి అర్థం చేసుకుంటాడు అనుకుంటాం. మన అసలైన వ్యక్తిత్వంతో ప్రవర్తిస్తుంటాం. మీ విషయంలోనూ అలాగే అయ్యుండొచ్చు. డియర్‌, బంగారం అని పిలిస్తేనే ప్రేమ ఉన్నట్టుగా భావించకండి. ఫోన్లో గంటలకొద్దీ మాట్లాడే విషయానికొస్తే మొదట్లో ఒకర్నొకరు తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఎన్నో విషయాలుంటాయి. తర్వాత తెలుసుకునే అవసరం ఉండదు గనక మాట్లాడుకునే సమయమూ తగ్గిపోతుంటుంది. ఇవన్నీ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే ఆ అమ్మాయికి మీపై ఆసక్తి తగ్గింది అనే ఆలోచనే రాదు. ఇదికాకుండా నిజంగానే తనకి మీపై ఇష్టం తగ్గిందనిపిస్తే.. మీ తీరుతో తనేమైనా నొచ్చుకునేలా ప్రవర్తించారేమో ఓసారి ఆలోచించండి. చొరవ తీసుకొని ఏమైనా చులకనగా మాట్లాడారేమో ఓసారి గుర్తు తెచ్చుకోండి. తననైనా అడగండి. మీకు తెలియకుండానే తప్పు చేస్తే క్షమించమనండి. అంతేగానీ డియర్‌ అని పిలవలేదనీ, ఎక్కువగా ఫోన్‌ మాట్లాడటం లేదని, ప్రేమ తగ్గిపోయిందని ఒక నిర్ణయానికి వచ్చి కుంగిపోవద్దు. ఇదే కాదు.. బంధం బలపడుతున్నకొద్దీ ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి. ప్రేమలోనూ అవి తప్పవు. ఆ విషయం మరవొద్దు.

- అర్చన నండూరి, కౌన్సెలింగ్‌ సైకాలజిస్టు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని