మత్తులో పడి.. మనిషిగా దిగజారా

మత్తు, ఆవేశం మహా చెడ్డవి. క్షణాల్లోనే జీవితాన్ని తలకిందులు చేస్తాయి. అలాంటి క్షణికావేశంలో సరిదిద్దుకోలేని తప్పు చేశానంటున్నాడు ఓ యువకుడు. జరిగిందేంటో అతడి మాటల్లోనే....

Published : 02 Oct 2021 01:10 IST

మత్తు, ఆవేశం మహా చెడ్డవి. క్షణాల్లోనే జీవితాన్ని తలకిందులు చేస్తాయి. అలాంటి క్షణికావేశంలో సరిదిద్దుకోలేని తప్పు చేశానంటున్నాడు ఓ యువకుడు. జరిగిందేంటో అతడి మాటల్లోనే.

‘మామా.. మావాళ్లు ఊరెళ్లారు. ఈరోజు మందు పార్టీ చేసుకుందాం’ మధుగాడి మాటతో నా ఒంటికి నిషా ఎక్కింది. పెద్ద తాగుబోతునేం కాదుగానీ ఫ్రెండ్స్‌తో కూర్చొని జాలీగా మాట్లాడుతూ ఒకట్రెండు బీర్లు లాగిస్తే ఆ కిక్కే వేరు. ఆ సరదా కోసమే ఎక్కడ పార్టీ జరిగినా వాలిపోతుంటా.

సాయంత్రం ఆరింటికి కూర్చున్నాం. గంటలో నాలుగు బీర్లు ఖాళీ. ‘మళ్లీమళ్లీ ఛాన్స్‌ రాదురా.. ఇంకో రెండు వేద్దాం’ అన్నాడు మధు. సరేనన్నా. రెండుతో ఆగలేదు. మూడు.. నాలుగు.. చివరికి ఒళ్లు తెలియకుండా తాగాం. అంతా అయిపోయాక మెల్లగా గేటు దాటి బయటికెళ్తుంటే ‘రేయ్‌.. ఒక్క నిమిషం. ఓసారి రాజేశ్‌ ఇంటిదాకా వెళ్లొద్దాం పదా’  అంటూ ఆర్డరేశాడు. ‘వారంలో తిరిగిస్తానని ఇరవై వేలు తీసుకున్నాడు. ఆర్నెల్లైంది. రేపు, మాపంటున్నాడు. వాడికి వార్నింగ్‌ ఇవ్వాలిరా’ అసలు విషయం చెప్పాడు. రాజేశ్‌             మా దూరపు చుట్టమే. నాకంటే పదేళ్లు పెద్ద. ఎందుకో ముందునుంచీ తనంటే నచ్చదు. నా కోపం తీర్చుకోవడానికి ఇదో సందర్భం అనిపించింది.

వాళ్లింటి ముందు నిల్చొని కేకలేశాం. రాజేశ్‌ బయటికొచ్చాడు. నేరుగా వెళ్లి తన చొక్కా పట్టుకున్నా. ‘మావాడికి డబ్బులు ఎప్పుడిస్తావ్‌? ఆర్నెల్ల్లైౖంది. సిగ్గులేదా?’ అంటూ నిలదీశా. ఇది నీకు సంబంధం లేని విషయమంటూ అరిచాడు. నా ఫ్రెండ్‌ తరపున అడుగుతున్నానన్నా పట్టించుకోలేదు. బూతులు తిట్టా. మాటామాటా పెరిగింది. ‘పీకల్దాకా తాగొచ్చి గొడవ చేస్తున్నావు. నేను డబ్బులివ్వను. మగాడివైతే ఏం చేసుకుంటావో చేస్కోపో’ అన్నాడు. ఆ మాటతో నా ఆవేశం కట్టలు తెంచుకుంది. అటూఇటూ చూశా. మూలన పెద్ద ఇనుపచువ్వ కనిపించింది. మత్తులో ఏం చేస్తున్నానో సోయి లేదు. రాజేశ్‌ చేయిపై బలంగా పొడిచా. అరచేయి, మోచేయి మధ్యలో దిగబడి బయటికొచ్చింది. రక్తం ధారగా కారుతోంది. తను బాధతో విలవిల్లాడుతున్నాడు. జనం పోగయ్యారు. మధు నన్ను అక్కడ్నుంచి లాక్కెళ్లిపోయాడు. ఆ రాత్రి ఓ ఫ్రెండ్‌ పొలం దగ్గర పడుకున్నాం.

మర్నాడు కులం పెద్దమనుషుల నుంచి పిలుపొచ్చింది. తప్పంతా నాదేనన్నారు. తాగుబోతునని తిట్టారు. పరువు పోయిందని అమ్మానాన్నలు ఏడ్చారు. ఆఖరికి ఆసుపత్రి ఖర్చుల కింద పదివేల రూపాయలు ‘జరిమానా’ వేశారు. అప్పట్నుంచి మా రెండు కుటుంబాల మధ్య మాటలు బంద్‌. తర్వాత ఈ విషయం గురించి ఆలోచిస్తే తప్పంతా నాదేననిపించింది. మైకంలో నాకు సంబంధంలేని విషయంలో తల దూర్చాననిపించింది. సిగ్గుతో కుంచించుకుపోయాక ఇక జీవితంలో మందు జోలికి వెళ్లొద్దనుకున్నా.

కానీ కథ అంతటితో ముగియలేదు. రాజేశ్‌కి షుగర్‌ ఉంది. సరైన వైద్యం అందకపోవడంతో పుండు పెద్దదైంది. చివరికది గ్యాంగ్రీన్‌గా మారిందట. ప్రాణాలకే ప్రమాదమని చేయి తీసేశారు. అది విన్నాక నా గుండె కలుక్కుమంది. సమసిపోయిందనుకున్న వివాదం పోలీస్‌స్టేషన్‌కి చేరింది. కేసు పెడతామన్నారు. రెండున్నర లక్షలు ఇచ్చి ‘రాజీ’ కుదుర్చుకున్నాం. మధ్యలో పోలీసులు, పెద్దమనుషుల చుట్టూ తిరగడం, వాళ్ల కాళ్లావేళ్లా పడటం.. ఓ నరకం.

నాలుగేళ్లైంది. మందు మానేశా. ప్రస్తుతం నాకో పాప. ఇంట్లో ఉంటే క్షణం వదలదు.  తనని భుజాలపై ఎక్కించుకొని ఆటలాడిస్తుంటా. గాల్లోకి విసిరి పడిపోకుంటా పట్టుకుంటా. ఇలా చేస్తుంటే చెప్పలేనంత హ్యాపీ. కానీ ఆ క్షణం రాజేశ్‌ గుర్తొస్తే.. కన్నీళ్లాగవు. తను చేయి కోల్పోయే సమయానికి ఇద్దరు చిన్నపిల్లల  తండ్రి. తనకీ నాలాగే పిల్లల్ని ఆడించాలనీ, వాళ్లతో అల్లరి చేయాలని ఉండేదేమో! నా ఆవేశం కారణంగా ఆ సంతోషాలకు దూరమయ్యాడు. వికలాంగుడయ్యాడు. ఇది గుర్తొచ్చినప్పుడల్లా పెద్ద తప్పు చేశాననిపిస్తుంటుంది. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని కొద్దికొద్దిగా డబ్బులు కూడబెడుతున్నా. ఐదారేళ్లయ్యాక ఆ మొత్తం తనకిచ్చేసి క్షమించమని కాళ్లపై పడతా.

- మహేశ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని