ఖాదీ ముబారక్‌

సాయి సిద్ధార్థ.. ఈ కాలం కుర్రాడే. సరదాలకు ‘సై’ అనే మనస్తత్వం. కానీ గాంధీ అంటే వల్లమాలిన అభిమానం. ఆయన సిద్ధాంతాలు ఆచరిస్తాడు. పలుమార్లు సబర్మతీ ఆశ్రమమూ...

Published : 02 Oct 2021 01:10 IST

సాయి సిద్ధార్థ.. ఈ కాలం కుర్రాడే. సరదాలకు ‘సై’ అనే మనస్తత్వం. కానీ గాంధీ అంటే వల్లమాలిన అభిమానం. ఆయన సిద్ధాంతాలు ఆచరిస్తాడు. పలుమార్లు సబర్మతీ ఆశ్రమమూ వెళ్లొచ్చాడు. అయినా ఇంకేదో చేయాలనే తపన! ఇంతలో తన పెళ్లి కుదిరింది. దాన్నే సందర్భంగా మలుచుకొని గాంధీయిజం చూపించాడు ఈ వరంగల్‌ యువకుడు. గాంధీ జయంతి సందర్భంగా తన ఖాదీ షాదీ ముచ్చట్లు.

ఇంతకీ ఏం చేశాడు?: స్వతంత్ర పోరాటంలో గాంధీ చేసిన ఖద్దరు ఉద్యమం కీలకమైంది. స్వదేశీ నినాదంతో ఖాదీనే ధరించాలనేవారు మహాత్ముడు. తన వివాహంలోనూ అదే పిలుపునిచ్చాడు సిద్ధార్థ. పెళ్లిలో తాను స్వయంగా ఖాదీ షేర్వాణీ, దుపట్టా ధరించాడు. వధువు సత్య శ్రావణి చేనేత కలంకారీ చీర, రవికెలో ముస్తాబైంది. వీళ్లే కాదు.. పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, అక్కాబావా, మేనత్తలు, వధువు తరపు దగ్గరి బంధువులంతా కూడబలుక్కుని చేనేత దుస్తులనే ధరించి విందులో పాల్గొన్నారు. ఎప్పుడూ జీన్స్‌, టీస్‌లో ఆధునికంగా కనిపించే పెళ్లికొడుకు స్నేహితులు హ్యాండ్లూమ్‌ దుస్తులు వేసుకొని బుద్ధిమంతుల్లా వచ్చారు. లక్షలు పోసి, బంగారు పూతలు వేయించి పెళ్లి దుస్తులు కొనే స్తోమత ఉన్నా.. స్వదేశీయతపై మమకారం, గాంధీపై ఇష్టంతోనే ఈరకంగా వెరైటీగా పెళ్లి చేసుకున్నానంటున్నాడు సాయి సిద్ధార్థ. అతడి నిర్ణయాన్ని అతిథులంతా స్వాగతించారు. టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన ఈ ఖాదీ షాదీలో కొత్తజంటను నెటిజన్లు పొగడ్తల్లో ముంచెత్తారు. ఖాదీవే అయినా దుస్తులు స్టైలిష్‌గా ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలొచ్చాయి.

అమ్మ ప్రోత్సాహంతో: సిద్ధార్థ మొదట్నుంచీ గాంధీ బాటలో నడవడానికి కారణం వాళ్ల అమ్మే. ఇంట్లో ప్లాస్టిక్‌ను వినియోగించడానికి ఒప్పుకునేది కాదు. ప్రకృతిహితంగా జీవించాలనేదామె. ఎప్పుడూ నిజాలే మాట్లాడమని చెప్పేది. పిల్లలకు చెప్పడమే కాదు.. సిద్ధార్థ తల్లిదండ్రులు స్వయంగా ఆచరించి చూపేవాళ్లు. వాళ్ల అక్క పెళ్లిలో ఈ ఖాదీ, చేనేత దుస్తుల ట్రెండ్‌ మొదలు పెట్టారు. సిద్ధార్థకు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం అమ్మాయి శ్రావణితో పెళ్లి కుదిరినప్పుడు తన అభిప్రాయం చెప్పాడు. మొదట్లో ఆశ్చర్యపోయినా, అతడి నిర్ణయాన్ని స్వాగతించిందా అమ్మాయి. ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లోని ఓ బొటిక్‌కు వెళ్లి, ప్రత్యేకంగా చేనేత దుస్తులతో ఫ్యాషన్‌ డిజైన్స్‌ చేయించుకున్నారు. ఈ ఉత్పత్తులకు గిరాకీ పెరగాలనే ఉద్దేశంతోనే తాము అలా చేశామంటోంది కొత్త జంట. ఖాదీతోనూ స్టైలిష్‌ డిజైన్స్‌ రూపొందించవచ్చు అంటున్నారు వాళ్లు. ఇదేకాకుండా పెళ్లిలో ప్రతీదీ పర్యావరణహితంగా ఉండేలా చూసుకున్నారు. శుభలేఖల్ని తులసి విత్తనాలతో చేయించారు. కార్డుని నీళ్లలో కరిగించి భూమిలో వేస్తే మొక్కలు వచ్చేలా తయారు చేయించారు. అతిథులకు రెండు రకాల పూలు, రెండు రకాల పండ్ల విత్తనాలు తిరుగు కానుకలుగా ఇచ్చారు. సిద్ధార్థ బిట్్స పిలానీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. మంచి జీతమిచ్చే కార్పొరేట్‌ ఉద్యోగావకాశాలు వదులుకొని దేశీయ విత్తనాలతో ప్రకృతి సేద్యం చేస్తున్నాడు.

- గుండు పాండురంగశర్మ, వరంగల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని