బతుకులోంచి పుట్టిన బతుకమ్మ పాట

తీరొక్క పూల బతుకమ్మ అంటే గుర్తొచ్చేది మిట్టపల్లి సురేందరే. తన గుండె కలం నుంచి జాలువారిన పాట.. ప్రతి తెలంగాణ గడపనీ తాకింది. పల్లె, పట్నం తేడా లేకుండా పడుచుప్రాయుల గళంలో

Published : 09 Oct 2021 01:23 IST

తీరొక్క పూల బతుకమ్మ అంటే గుర్తొచ్చేది మిట్టపల్లి సురేందరే. తన గుండె కలం నుంచి జాలువారిన పాట.. ప్రతి తెలంగాణ గడపనీ తాకింది. పల్లె, పట్నం తేడా లేకుండా పడుచుప్రాయుల గళంలో జీవం పోసుకుంది. ‘పచ్చిపాల వెన్నెల నేలపై పారబోసినట్టు పూసెనే గునుగుపూల తోటలు..’ అంటూ తన అక్షరంతో పూవుని అందలం ఎక్కించాడు. ‘కొమ్మలే అమ్మలై పువ్వులా బిడ్డల్ని కనిపెంచినాయమ్మా..’ అంటూ పండగ ప్రాశస్త్యం వివరించాడు. ఇలాంటివి పది రాస్తే, కోట్ల వ్యూస్‌ వచ్చాయి. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌తో కలిసి మరోసారి అక్షర సుమాలు పూయించిన ఈ రచయితకి బతుకమ్మతో ఉన్న అనుబంధం అతడి మాటల్లోనే...

బతుకమ్మ గురించి నేను ఎప్పుడూ వెతికి, తెలుసుకొని రాసింది లేదు. అభూతకల్పనల్లేవు. కృతకంగా ఇరికించిన పదాల్లేవు. నేను అనుభవించిన జీవితంలో నుంచి పుట్టిన, రాసిన పాటే అది. సాధారణంగా ప్రతి తెలంగాణ పల్లెలోలాగే మా ఊరు వెల్లంపల్లిలో నెలరోజుల ముందే బతుకమ్మ సందడి మొదలయ్యేది. గునుగు పూలు కోసుకొచ్చి, ఆరబోసి, కట్టలు కట్టి, రంగులద్దేది మా అమ్మ. తర్వాత వాటితో పెళ్లికూతురిని ముస్తాబు చేసినట్టుగా బతుకమ్మను పేర్చేది. అలా అందరూ పేర్చి తీసుకొచ్చిన బతుకమ్మల్ని ఊరి మధ్యలో బొడ్రాయి దగ్గర పెట్టేవాళ్లు. పేదాగొప్ప తేడాల్లేకుండా అంతా కలిసి ఆడేవాళ్లు. అప్పుడు ప్రతీ ఆడబిడ్డ ఒక్కో కోయిలలా పాడేది. వాళ్లకు సంగీతం తెలియదు. సాహిత్యం రాదు. అయినా జీవిత అనుభవాలనే పాటలుగా మలిచేవాళ్లు. అలాంటి సంస్కృతి, సందడి, సంబురాన్ని దగ్గరగా చూస్తూ పెరిగినవాణ్ని.

ఈ పండగ గొప్పతనం తెలియజేసేలా 2008లో మొదటిసారి బతుకమ్మ పాట రాశాను. దాన్ని ఆల్బమ్‌గా చేద్దామని మ్యూజిక్‌ డైరెక్టర్ల చుట్టూ తిరిగా. చాలామందికి నా పాట నచ్చలే. కొంతమంది నీకు డబ్బులిస్తా నా పేరు పెట్టు అన్నారు. ఒకాయనైతే ‘ఈ బతుకమ్మ మీద పాటేంది.. నీ లొల్లి ఏంది? ఇలాంటి పాటతో ఇంకోసారి నా స్టూడియోవైపు రాకు’ అన్నాడు. తర్వాత తనతోనే కలిసి పని చేశాను. తెలంగాణ జాగృతి కవితక్క ప్రోత్సాహంతో మొత్తానికి ఐదేళ్ల తర్వాత నా పాట బయటికొచ్చింది. అప్పటి నుంచి దాదాపు 10 బతుకమ్మ పాటలు రాశాను. ‘తెలంగాణలో పుట్టి.. పువ్వుల పల్లకి ఎక్కి...’ ‘పచ్చిపాల వెన్నెల నేలన పారబోసినట్టు పూసెనే గునుగుపూల తోటలు..’, ‘ఓ పువ్వుల బొమ్మా.. శివుని ముద్దుల గుమ్మా...’ ఈ పాటలు మంచి పేరు తీసుకొచ్చాయి.
ఒక్క పాట రాయడానికి రోజు పట్టొచ్చు. ఒక్కోసారి ఏళ్లు పట్టొచ్చు. నేను ఈమధ్య ఎ.ఆర్‌.రెహమాన్‌తో చేసిన పాట.. ఒక్కరోజులో పూర్తైంది. సెప్టెంబరు 15 రాత్రి రెహమాన్‌ సర్‌ ఫోన్‌ చేశారు. బతుకమ్మ పాట కోసమంటూ ఒక ట్యూన్‌ పంపించారు. నాకది నచ్చలేదు. కమర్షియల్‌గా ఉందని చెప్పా. అరగంటయ్యాక ఇంకోటి పంపారు. అదీ బాగా లేదన్నా. మూడో బాణీ బాగుంది. రెండు గంటల్లో పల్లవి, మరో రెండు గంటల్లో చరణం రాసి పంపించాను. కుదిరితే పాటని అలా పూటలో రాసేస్తాను. ఇంకోపాట పల్లవి పదమూడేళ్ల కిందట రాశా. చరణం ఇప్పటికీ పూర్తవలేదు. బతుకమ్మ పండగ జనం మనసులకి దగ్గరైన పండగ. ఈ సంబరం మీద ఎన్ని పాటలొచ్చినా జనం గుండెల్ని తాకుతూనే ఉంటాయి. కానీ ఇందులో సహజత్వం చనిపోవద్దు. పల్లెతనం, గ్రామీణ వాయిద్యాలు, అమ్మలక్కల చప్పట్లు మోగుతూనే ఉండాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని