Published : 09 Oct 2021 01:23 IST

నిస్సత్తువని తరిమేద్దామిలా..

బాస్‌తో చర్చలు.. కాలేజీ విద్యార్థికి పాఠాలు... ఉద్యోగార్థికి పార్ట్‌టైమ్‌ కోర్సు.. అన్నింటికీ ఆన్‌లైనే. వీడియో మీటింగ్‌లతో పనే! ఇదే గంటలకొద్దీ కొనసాగితే ఏమవుతుంది? తీవ్ర అలసట, వికారం.. మొదలవుతుంది. దీన్నే ‘జూమ్‌ ఫెటీగ్‌’ అంటున్నారు స్టాన్‌ఫోర్డ్‌ పరిశోధకులు. ఆపెదెలా?

* కాలేజీ క్లాసులో, ఆఫీసు చర్చల్లో లెక్చరర్‌, బాస్‌ చెబుతుంటే శ్రద్ధగా వింటుంటాం. అప్పుడప్పుడు నోట్స్‌ రాసుకుంటాం. వీడియో మీటింగ్‌లో అలా కాదుగా! స్మార్ట్‌ఫోన్లు, ల్యాపీ, కాన్ఫరెన్స్‌ హాలు తెరకి గుడ్లప్పగించి చూస్తుంటాం. ఎక్కువ సమయం ఇలాగే చేస్తే ఒత్తిడి మొదలవుతుంది. పెద్ద తెరలకి దగ్గరగా ఉండి చూసే వీడియోలను మెదడు, కళ్లు త్వరగా ఆమోదించవు.

పరిష్కారం: సెల్‌ఫోన్‌లో మీటింగ్‌ అయితే అప్పుడప్పుడు దృష్టి మరల్చుతుండాలి. కొన్ని క్షణాలైనా విరామం తీసుకోవాలి. పెద్ద తెరపై మీటింగ్‌ నిర్వహిస్తుంటే తెరని జూమ్‌ అవుట్‌ చేయడమో, దూరంగా కూర్చోవడమో చేయాలి.

* సెల్‌ఫోన్‌ మాట్లాడుతున్నప్పుడు మనం అటుఇటూ తిరగడానికి అవకాశం ఉంటుంది. కానీ వీడియో కాల్స్‌, వీడియో మీటింగ్‌తో ఆ ఛాన్స్‌ లేదు. ఒక్కచోటే స్థిరంగా ఉండాలి. దీనికి భిన్నంగా శరీరాన్ని కదిలిస్తూ, అటుఇటూ తిరుగుతూ పని చేసేవాళ్లలో విషయగ్రహణ శక్తి అధికమని అధ్యయనాల్లో నిరూపితమైంది.

పరిష్కారం: కొంచెం అటు ఇటు తిరిగినా మనం కనబడేలా కెమెరాని అడ్జస్ట్‌ చేయాలి. పెద్ద తెర అయితే దూరంగా కూర్చోవాలి. అవసరం లేనప్పుడు వీడియో ఆఫ్‌ చేస్తుండాలి.

* అవతలివారికి మనం ఎలా కనిపిస్తున్నామో చెప్పడానికి మన గ్యాడ్జెట్‌ తెరపై చిన్న బాక్స్‌లో మన ప్రతిబింబం కనిపిస్తుంటుంది. దాన్ని పదేపదే చూడటాన్ని మన మెదడు జీర్ణించుకోలేదు అంటారు అధ్యయనానికి నాయకత్వం వహించిన బెయిలెన్సన్‌. మన మాటలు, చర్యలు ఎవరైనా గమనిస్తున్నారని తెలిస్తే ప్రతికూల భావోద్వేగాలు పెరుగుతాయంటాడాయన.

పరిష్కారం: ‘హైడ్‌ సెల్ఫ్‌ వ్యూ’ మీటను నొక్కి మన వీడియోని ఆఫ్‌ చేయాలి. అవసరం ఉన్నప్పుడే ఆన్‌ చేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని