Updated : 23 Oct 2021 06:41 IST

స్టేటస్‌ పెట్టి.. స్టేటస్‌ లేదంటోంది

భోజనం చేసి, కొలీగ్స్‌తో పచార్లు చేస్తున్నా. దూరం నుంచి మావైపే వస్తున్న ఒకమ్మాయిని చూడగానే నా గుండె ఝల్లుమంది. అలాగే ఉండిపోయా. ‘ఈమధ్యే జాయినైంది. ఏంటలా కొరుక్కుతినేలా చూస్తున్నావ్‌. వెళ్దాం పదా’ కొలీగ్‌ పిలుపుతో ఈ లోకంలోకొచ్చా. జ్ఞాపకాలు పదిహేనేళ్లు వెనక్కి లాక్కెళ్లాయి.

స్కూల్లో మాకో టీచర్‌ ఉండేది. నిర్మలా కుమారి. పేరులాగే స్వచ్ఛంగా ఉండేది. ఎందుకో తెలియదు.. ఆమె అంటే నాకు ప్రత్యేకమైన ఆకర్షణ, ఆరాధన. బహుశా ఆమె నాపై అభిమానం చూపిస్తోంది అనేమో! చదువు, ఆటల్లో బాగా ప్రోత్సహించేది. నేను డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగంలో చేరినా ఆమె రూపం నా మదిలోంచి చెరిగిపోలేదు. ఇదిగో.. ఇప్పుడు కనిపించిన అమ్మాయి అచ్చం మా టీచర్‌లాగే ఉంది. తను టీచర్‌ చెల్లెలా, కూతురా? రకరకాల ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయింది. యాదృచ్ఛికంగా తన పేరూ  కుమారినే. దాంతో నాలో కొత్త అలజడి మొదలైంది.

ఎలాగోలా ఆమె నెంబర్‌ సంపాదించి మెసేజ్‌ పెట్టా. రిప్లై లేదు. మరో రోజు ‘భోజనం చేశారా?’ అనడిగా. కొరకొరా చూసింది. అయినా నేను తగ్గలేదు. వాట్సాప్‌లో మెసేజ్‌ చేశా. దేవత కరుణించింది. కొన్నాళ్లకే పరిచయం.. స్నేహంగా మారింది. రానురాను ఆమెపై ఇష్టం పీకల్దాకా పెరిగిపోయింది. నా మనసులోమాట చెప్పే ఘడియ కోసం ఎదురుచూస్తున్నా. ‘ఏంటీ సరికొత్త భావన? ఇదంతా ప్రేమేనా.. ఇలాగే సాగనీ ఈ ప్రయాణం’ అని తన వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టిందోరోజు. అది చూడగానే నా ఆశలకు రెక్కలొచ్చాయి. తన మనసులో నేనున్నానని ఫిక్సయ్యా. అప్పట్నుంచి నాదో కొత్త బంగారు లోకం.

కొన్నాళ్లకు నేను ఆఫీసు పని మీద బయటికెళ్లా. తను పక్కన లేని ప్రతిక్షణం నరకంలా అనిపించింది. ఫోన్‌ కలిపితే తనదీ నాలాంటి ఫీలింగే అనిపించింది. ఆప్యాయంగా మాట్లాడింది. వ్యక్తిగత విషయాలన్నీ పంచుకుంది. అప్పుడు అభిమానం కురిపించే మా టీచరే గుర్తొచ్చింది. ఒకే పోలికతో ఉన్న మనుషుల వ్యక్తిత్వాలూ ఒకేలా ఉంటాయనిపించింది. తను నా సొంతం అని నమ్మకం కుదిరాక, నేను అక్కడ ఉన్నన్నాళ్లూ తన చిరునామాకి రకరకాల బహుమతులు పంపేవాణ్ని. నా అడ్రెస్‌ చెప్పకుండా సర్‌ప్రైజ్‌ చేసేవాణ్ని.

నెలల తర్వాత తిరిగొచ్చా. నేను కనపడగానే తన మొహంలో కనపడే వెలుగు చూడాలని ఆతృతగా ఉన్నా. కానీ నేను ఊహించిందేం జరగలేదు. తను మొహం తిప్పుకుంది. నన్ను తప్పించుకొని తిరగసాగింది. నా మనసు విలవిల్లాడింది. ఏం జరిగిందో తెలియదు. కొన్నాళ్లు చూసి మనసు చంపుకోలేక అడిగేశా. ‘నువ్వూ అందరిలాంటి అబ్బాయివే. నా వెనకాల తిరిగి టైం వేస్ట్‌ చేసుకోకు’ అంది. మరి ఇన్నాళ్ల పరిచయం, వాట్సాప్‌ స్టేటస్‌లూ అంటే.. నీకు నన్ను పెళ్లి చేసుకునేంత స్టేటస్‌ లేదంది. ఆ మాటలు నా గుండెని చీల్చేశాయి. బాధ భరించలేక ఉద్యోగం మానేసి ఊరెళ్లిపోయా. తనని మర్చిపోలేక ఎప్పుడైనా ఫోన్‌ చేస్తే కట్‌ చేసేది. పిచ్చివాడినైపోయా. నా బాధ చూడలేక ఓ ఫ్రెండ్‌ నేరుగా కలిసి మాట్లాడమన్నాడు. వెళ్లి కలిశా. నేను చేసిన తప్పేంటని నిలదీశా. ‘నిన్నెప్పుడూ లవర్‌లా భావించలేదు. నీపై ప్రేమ పెంచుకోలేదు. అన్నింటికీ మించి... నాకెప్పుడో పెళ్లి కుదిరింది’ అంది. ఆ మాటలు చెబుతున్నప్పుడు తన కళ్లలో నీళ్లు. తను చెబుతోంది అబద్ధమనీ, తనకి నాపై ప్రేమ ఉందనీ తెలుసు. అయినా ఇంకా బలవంతం చేయడం భావ్యం కాదని తిరిగొచ్చేశా. తర్వాత ఆరా తీస్తే పెద్దల మాటకి ఎదురుచెప్పలేక తనలా తల వంచుకుందని తెలిసింది.

ఇది జరిగి మూడేళ్లవుతోంది. ఇప్పటికీ తనపై ప్రేమ తగ్గలేదు. తనకి ఇబ్బంది కలిగించేలా నేనెప్పుడూ ప్రవర్తించలేదు. నాకు తెలియకుండా ఏదైనా తప్పు చేస్తే క్షమించమని వేడుకుంటున్నాను. ఒక్క అవకాశం ఇస్తే పెద్దవాళ్లని ఒప్పించడానికీ సిద్ధం. ఒప్పుకుంటుందని ఆశిస్తున్నా.

- కుమార్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని