జిమ్‌లో.. ఇవి చేయొద్దు

ఏం చేస్తే ఫిట్‌గా అవుతామో కాదు.. బాడీబిల్డింగ్‌ సమయంలో ఏం చేయకూడదో తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. సరైన వ్యాయామం శరీరాన్ని ఫిట్‌గా మార్చితే.. జిమ్‌లో జిగ్‌జాగ్‌ కసరత్తులు లేనిపోని ఇబ్బందులు సృష్టిస్తాయంటారు. అందుకే జిమ్‌లో ఇవి వద్దు.

Updated : 23 Oct 2021 06:53 IST

ఏం చేస్తే ఫిట్‌గా అవుతామో కాదు.. బాడీబిల్డింగ్‌ సమయంలో ఏం చేయకూడదో తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. సరైన వ్యాయామం శరీరాన్ని ఫిట్‌గా మార్చితే.. జిమ్‌లో జిగ్‌జాగ్‌ కసరత్తులు లేనిపోని ఇబ్బందులు సృష్టిస్తాయంటారు. అందుకే జిమ్‌లో ఇవి వద్దు.

* వార్మప్‌: కసరత్తులు, కఠిన వ్యాయమాలు చేసేముందు వార్మప్‌లు చేయడం తప్పనిసరి. కానీ ఇవేం చేయకుండానే కొందరు నేరుగా భారీ వర్కవుట్లు చేసేస్తుంటారు. ఇలా బరువులు ఎత్తడం, కఠోర వ్యాయామాలు చేస్తుంటే కండరాలు పట్టేయడం, గాయాల పాలయ్యే ప్రమాదం ఉంది.

* విశ్రాంతి: చాలామంది ఇష్టంగా కసరత్తులు చేస్తారు. వర్కవుట్లు ఇరగదీస్తారు. కానీ దానికి తగ్గట్టు విశ్రాంతి తీసుకోరు. నిద్ర విషయంలో అలక్ష్యం చేస్తారు. తీవ్రంగా అలసిపోయిన శరీరానికి మళ్లీ శక్తి కావాలంటే తగినంత నిద్ర కావాలి. దృఢమైన కండరాలు ఏర్పడాలంటే తగినంత విశ్రాంతి కావాలి.

* తాహతుకి మించి: జిమ్‌లో చేరగానే తామేంటో చూపించాలనే ఆరాటంలో పడతారు. శక్తికి మించి బరువులు ఎత్తుతారు. గంటలకొద్దీ వ్యాయామాలు చేస్తుంటారు. ఇది తగదు. మన శక్తికి మించి వ్యాయామాలు చేస్తే కండరాలను అరగదీస్తాయి. బాడీపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీర్ఘకాలంలో తీవ్ర గాయాల పాలవుతారు. కండరాలు పట్టేస్తాయి.

* సొంత ప్రయోగాలు: వీడియోలు చూసి, బ్లాగులు చదివి సొంతంగా కసరత్తులు చేసేస్తుంటారు కొందరు. చిన్నచిన్న వ్యాయామాలకైతే ఫర్వాలేదుగానీ.. కోర్‌, డెడ్‌లిఫ్ట్‌లు, హై-ఇంటెన్సిటీ, సిక్స్‌ప్యాక్‌ లాంటివాటికైతే సొంత ప్రయోగాలు ప్రమాదకరం. ఏమాత్రం తేడా వచ్చినా శరీరంలో అంతర్గత గాయాలవుతాయి. కండరాల సమతౌల్యం దెబ్బ తింటుంది.

* ఆహారం: బరువు తగ్గడం, మంచి ఫిజిక్‌ కోరుకోవడం, ఆరు పలకలు సాధించడం.. ఇలాంటి లక్ష్యాలున్నవారు అత్యధిక కేలరీల ఆహారాన్ని శత్రువులా భావిస్తారు. ఒకస్థాయి వరకైతే అది ఫర్వాలేదు కానీ మరీ తక్కువ కేలరీలు తీసుకోవడం ప్రమాదకరమే. ఈ విషయంలో నిపుణుల సలహా తీసుకోవాలి. మరీ గ్రాముల్లో కొలిచి తీసుకునే పద్ధతికి బై చెప్పాలి. లేదంటే నీరసం వచ్చి కింద పడిపోవడం ఖాయం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని