ధోనీలా.. మెచ్చేలా

మనోళ్లు మిస్టర్‌ కూల్‌ అంటారు... ప్రత్యర్థులు గొప్ప కెప్టెన్‌ అంటూ కితాబిస్తారు... ధోనీ అందరికీ నచ్చినోడే! అందుకే జట్టుని వదిలినా పిలిచి మరీ ప్రతిష్ఠాత్మక వరల్డ్‌కప్‌కి మెంటర్‌గా తీసుకొచ్చారు... ఇంతకీ ఏంటట తన గొప్ప? అంటే..

Updated : 31 Oct 2021 00:50 IST

మనోళ్లు మిస్టర్‌ కూల్‌ అంటారు... ప్రత్యర్థులు గొప్ప కెప్టెన్‌ అంటూ కితాబిస్తారు... ధోనీ అందరికీ నచ్చినోడే! అందుకే జట్టుని వదిలినా పిలిచి మరీ ప్రతిష్ఠాత్మక వరల్డ్‌కప్‌కి మెంటర్‌గా తీసుకొచ్చారు... ఇంతకీ ఏంటట తన గొప్ప? అంటే.. తను నిఖార్సైన నాయకుడని అంతా చెబుతుంటారు.  ఈ సందర్భంగా యూత్‌ తన నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే...


ప్రయోగాలు: ‘రిస్క్‌ హైతో ఇష్క్‌ హై...’ ఈమధ్య బాగా పేలిన సినిమా డైలాగ్‌. ఆఫీసు, వ్యాపారం, కంపెనీ.. ఏదైనా ధోనీలా ప్రయోగాలు చేయడంలో ముందుండాలి. రిస్క్‌ తీసుకోవాలి. సృజనాత్మకత చూపాలి. అప్పుడే ఊహించని ఫలితాలొస్తాయి. స్పిన్నర్‌తో ఓపెనింగ్‌ బౌలింగ్‌ వేయించడం, అనామక బౌలర్‌తో ఫలితం తేల్చే ఆఖరి ఓవర్‌ వేయించడం.. ఇలాంటి ప్రయోగాలెన్నో చేశాడు తను.


హుందాతనం: ధోనీ ఎన్ని విజయాలు సాధించినా పొంగిపోడు. అపజయాలకు కుంగిపోడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రత్యర్థిని పల్లెత్తు మాట అనడు. సంయమనం కోల్పోవడం అరుదు. సీనియర్లను గౌరవిస్తాడు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటాడు... ఈ హుందాతనమే ప్రపంచవ్యాప్తంగా అతడికి అభిమానులు ఏర్పడేలా చేసింది. ఈ సూత్రం అందరికీ, అన్ని రంగాలకూ వర్తిస్తుంది.


లాభం నీకు.. నష్టం నాకు: బాగా పని చేసే ఉద్యోగిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తే మరింత ఉత్సాహంగా పని చేస్తాడు. ఏదైనా పొరపాటు చేసినప్పుడు తప్పులు కాచి కాపాడుకుంటే విధేయత చూపిస్తాడు. విజయాలు దక్కినప్పుడు జట్టు సభ్యుల పేరు చెప్పి ఓటమి ఎదురైనప్పుడు నేనే బాధ్యత వహిస్తున్నానని చాలా సందర్భాల్లో చెప్పాడు ధోనీ.


వైఫల్యాలకు కుంగిపోడు: 2011వరల్డ్‌ కప్‌ ఓటమి తర్వాత ధోని నాయకత్వం, ఆటపై తీవ్ర విమర్శలొచ్చాయి. ఎవరేమన్నా ప్రతిస్పందించలేదు. నేలకి కొట్టిన బంతిలా పైకెగిసాడు. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ సహా ఎన్నో విజయాలు అందించాడు. యువతకి చదువులు, కెరీర్‌, వ్యాపారంలో ఎన్నో ఓటములు ఎదురవుతాయి. వాటికి కారణాలు తెలుసుకొని సరిదిద్దుకోవాలే తప్ప కుంగిపోవద్దు.


ప్రతిభకు పట్టం: గ్రూపులు కట్టడం.. పొగిడేవాళ్లను అందలం ఎక్కించడం ధోనీకి తెలియదు. ప్రతిభ ఉంటే అవకాశం ఇస్తాడు. గెలిపించే సత్తా ఉంటే అందలం ఎక్కిస్తాడు. అవసరమైతే బ్యాటింగ్‌ ఆర్డర్‌లో తను వెనక్కి వెళ్లిపోతాడు. జోగిందర్‌ శర్మ, జడేజా, భువి, షమీ, బుమ్రా, శార్దూల్‌.. ఇలా ఎందరికో తమ ఆటపై నమ్మకం కలిగించేలా ప్రోత్సహించాడు. ఆఫీసులు, స్టార్టప్‌లు, వ్యాపార సంస్థల్లో టీం లీడర్లకు ఈ గుణం ఉంటే అవి రాకెట్‌ వేగంతో ఎదుగుతాయి.


ముందుండి నడిపించడం: వికెట్ల వెనకాల వ్యూహాలు రచించడంలో ధోనీని కొట్టే మొనగాడు లేడంటారు. అంతేకాదు.. సత్తా చూపించి జట్టుని గెలిపించిన సందర్భాలూ ఎన్నో. ఆఖరి బంతిని సిక్స్‌గా మలచడం, నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్‌లో కడదాకా వికెట్‌ కాపాడుకొని జట్టును విజయతీరాలకు చేర్చడం చాలాసార్లు చూశాం. అందుకే తను మిస్టర్‌ కూల్‌. అలాగే లీడర్‌ గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు గాబరా పడిపోవద్దు. తను కంగారు పడితే కిందివాళ్లు బేజారు అవుతారు. నాయకుడు ఆజ్ఞలిచ్చేవాడే కాదు.. ఆచరించి చూపేవాడు కూడా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని