Updated : 06 Nov 2021 06:03 IST

ఫ్రెండ్‌ కాదు ఫ్రెనెమీ..

పక్కన ఉంటూనే పడదోసే
పనులు చేస్తుంటారు...


జిగిరీ దోస్త్‌లంటారు..
జిందగీని చిక్కుల్లోకి నెట్టేస్తుంటారు...


ఎవరు వీళ్లు? ఫ్రెండ్‌ రూపంలో ఉండే ఎనెమీలు.. ‘ఫ్రెనెమీ’లు.
దూరం పెట్టకపోతే మనశ్శాంతికి దూరమవుతాం.
మరి వాళ్లని కనిపెట్టేయండిలా!

* గాసిప్‌లు: భుజమ్మీద చేయేస్తారు. నీ భారం నాదంటారు. మనం అటు వెళ్లగానే మనపై గాసిప్‌లు అల్లేస్తారు. మన లోపాల్ని చిలవలు పలవలు చేసి కథలుగా చెబుతారు. ఒక్కసారైనా ఇవి మన చెవిన పడకపోవు. అప్పుడే ఈ తీరుకి చరమగీతం పాడాలి. ఇలాంటివి నచ్చవని ఫ్రెనెమీని హెచ్చరించాలి.

* ఆశిస్తారు: ‘నీ బర్త్‌డేకి నాకేం ట్రీట్‌ ఇస్తావ్‌?’, ‘నువ్వు మంచి జాబ్‌ కొట్టావ్‌ కదా.. నాకేం గిఫ్ట్‌ ఇస్తున్నావ్‌..’ ఇలా ప్రతి సందర్భంలోనూ మన నుంచి ఏదో ఆశిస్తూనే ఉంటారు. అదే మనకు ఏదైనా అవసరం, ఆపద వస్తే ముఖం చాటేస్తుంటారు. ఇలాంటి స్నేహితుల్ని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు.

* భావోద్వేగాలతో బంతాట: మనం కొంచెం సున్నితం అయితే మన భావోద్వేగాలతో ఆడుకోవడం ఫ్రెనెమీలకి అలవాటు. తాము అనుకున్నది జరగడం కోసం.. ‘మన స్నేహం ఇంతేనా?’, ‘ఫ్రెండ్‌ కోసం ఆమాత్రం చేయలేవా?’ అంటూ డైలాగులు వల్లించి మనల్ని మాయ చేస్తారు.

* విజయాలు నచ్చవు: మన ఫ్రెండ్‌ ర్యాంక్‌ కొడితే మనం పార్టీ చేసుకుంటాం. ప్రమోషన్‌ వస్తే ఉప్పొంగిపోతాం. ఫ్రెనెమీకి అంత సీన్‌ ఎక్కడుంటుంది? మనకేదైనా విజయం దక్కితే ‘అబ్బే.. అదేమంత గొప్ప విషయం కాదు’ అంటూ తేలిక చేస్తారు. ‘ఇలాంటివి నేనెన్నో సాధించా’ అంటూ సొంతడబ్బా కొట్టుకుంటారు. మొహమాటానికి పొగిడినా లోపలంతా కుళ్లే.

* ముఖం మీదే: పొరపాటున మనం ఏదైనా చిన్న తప్పు చేస్తే మనసు నొచ్చుకునేలా మాటలంటారు. సద్విమర్శలు చేసేవాడే నిజమైన ఫ్రెండ్‌ అంటూ కవరింగ్‌లు ఇస్తారు. సందు దొరికితే మనపై బ్యాడ్‌ జోక్స్‌ పేలుస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని