Updated : 20 Nov 2021 01:08 IST

పెళ్లి ఆపాలని.. రాక్షసుడినయ్యా!

‘ఇష్టపడ్డ అమ్మాయి కోసం ప్రాణం ఇచ్చేవాళ్లను చూశా. జీవితం నాశనం చేసినవాడ్ని నిన్నే చూస్తున్నా’.. మూడేళ్ల కిందట సుజీ అన్నమాట నా గుండెనింకా రంపంలా కోస్తూనే ఉంది.

సుజీ.. నా కొలీగ్‌. తనంటే ఇష్టం కాదు.. పిచ్చి! చేరిన మూడోరోజే మాట కలిసింది. విశాలమైన నుదురు, పెద్ద కళ్లు.. వాటి కొసల దాకా కాటుక అద్దేది. చెవులకు లోలాకులు.. మాట్లాడుతుంటే లయబద్ధంగా కదిలేవి. అప్పుడు తననలాగే చూస్తుండిపోవాలనిపించేది. ఓసారలాగే కన్నార్పకుండా చూస్తున్నా. కనుబొమలు విరిచి, కళ్లెగరేస్తూ ‘ఏంటి బాస్‌.. అమ్మాయిల్ని ఎప్పుడూ చూడలేదా?’ అంది కొంటెగా. అందం ప్లస్‌ తెలివితేటలున్న నీలాంటి సౌందర్యరాశినైతే ఎప్పుడూ చూడలేదబ్బా’ అన్నా.. నవ్వింది. పొగడ్తల కోసం చెప్పిన మాట కాదది. తను పనిలో పక్కా పర్‌ఫెక్ట్‌. జూనియర్‌ అయినా పెద్ద ప్రాజెక్టుల్ని ఈజీగా డీల్‌ చేసేది.

మా స్నేహంలో గాఢత పెరిగింది. రెప్ప మూసి తెరిచినంత వేగంగా రెండేళ్లు గడిచాయి. ఈ మధ్యలో పార్టీలు, ఔటింగ్‌లకు లెక్కేలేదు. మామధ్య దాపరికాలేం ఉండేవి కావు. ఇంక నా మనసులో మాట చెప్పి, తన చేయి అందుకునే సమయం కోసం ఎదురుచూస్తున్నా. కానీ ఈలోపే అనుకోని ఉపద్రవం.

ఆ రోజు యథాలాపంగా ఫేస్‌బుక్‌ తెరిచా. సుజీ ప్రొఫైల్‌పై నా చూపు ఆగిపోయింది. ‘హ్యాపీలీ ఎంగేజ్డ్‌’ అంటూ ‘బయో’లో మార్పు. ఎవరో అబ్బాయితో కలిసి ఉన్న ఫొటో. నా గుండె ఆగిపోయింది. ‘అమ్మానాన్నలు అర్జెంటుగా రమ్మంటున్నారు. ఊరెళ్లొస్తా’ అని రెండ్రోజుల క్రితం చెప్పిన గుర్తు. గబగబా ఫోన్‌ అందుకున్నా. ‘ఔను.. మావాళ్లు సడెన్‌ సర్‌ప్రైజ్‌ చేశారు. అబ్బాయి మా దూరపు చుట్టమే. నాకూ పరిచయమే. వారంలో ఆస్ట్రేలియా వెళ్లిపోవాలట. అందుకే హడావుడి చేశారు’ తను చెప్పుకుపోతోంది. కన్నీళ్లతో నా చొక్కా తడిసిపోయింది. నాకే సొంతమైన అపురూపమైన వస్తువును మరొకరు లాక్కుపోతున్న ఫీలింగ్‌.

ఆఫీసు బయటే నిల్చున్నా. తనొచ్చింది. ‘నేను చచ్చిపోయాననుకున్నావా? నేనుండగా వాడెవడినో పెళ్లెలా చేసుకుంటావ్‌?’ దాదాపు అరిచా. కాసేపు బ్లాంక్‌ ఫేస్‌ పెట్టి, పక్కకి తీస్కెళ్లింది. అంతా అర్థమైనట్టు తలూపింది. ‘నిన్ను నా బెస్ట్‌ఫ్రెండ్‌ అనుకున్నా. అంతేగానీ ఇలా ప్రేమ పెంచుకుంటావనుకోలేదు. అయినా ఆ ఫీలింగ్‌ ఉంటే ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదు’ తప్పు నాదేనన్నట్టు నిలదీసింది. నేను కన్విన్స్‌ కాలేదు. ‘నేనెప్పుడైనా నువ్వంటే ఇష్టమని చెప్పానా.. నీతో లిమిట్స్‌ దాటి ప్రవర్తించానా? నీకు నువ్వే ఎలా ఊహించుకుంటావ్‌?’ తన ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. కానీ అర్థమైందొక్కటే. తనిక నా సొంతం కాదు. ఆ ఊహ రాగానే సుజీ కాళ్లపై పడిపోయా. నువ్వు లేకపోతే బతకలేనన్నా. ‘సారీ సునీల్‌. ఇంతదాకా వచ్చాక కష్టం. పేరెంట్స్‌ పరువు పోతుంది’ అంది.

తను నాకు దక్కదనే ఆలోచనతో విచక్షణ కోల్పోయా. ఆ అబ్బాయి నెంబర్‌ సంపాదించి  ‘మేం ప్రేమించుకున్నాం’ అని చెప్పా. తను నమ్మలేదు. మేం సరదాగా దిగిన ఫొటోలు పంపించా. లైట్‌ తీస్కున్నాడు. నాలో అసహనం ఎక్కువైంది. పూర్తిగా దిగజారిపోయి మామధ్య ఫిజికల్‌ రిలేషన్‌షిప్‌ ఉందని అడ్డంగా అబద్ధం ఆడేశా. ఆఖరికి కొన్ని ఫొటోలు మార్ఫింగ్‌ చేసి కూడా పంపా. నా ‘వ్యూహం’ ఫలించింది. ‘సరే.. మీమధ్య అంత చనువు, ప్రేమ ఉంటే నువ్వే పెళ్లి చేసుకో. నేను తప్పుకుంటున్నా’ అన్నాడు.

ఇక సుజీ నాదేనని ఊహల్లో ఊరేగుతున్నా. కానీ జరిగింది వేరు. నేను పంపినవన్నీ తను సుజీకి పంపాడు. సంబంధం క్యాన్సిల్‌ చేసుకోవడానికి వివరణ ఇస్తున్నట్టు. సుజీకి ‘విషయం’ తేలిగ్గానే అర్థమైంది. ఫోన్‌ చేసింది. ‘నేను స్వచ్ఛమైన అభిమానాన్ని పంచా. నువ్వు నా వ్యక్తిత్వంపైనే దాడి చేశావు. ఇంత నీచంగా ప్రవర్తిస్తావనుకోలేదు. నీపై కేసు పెట్టగలను. కానీ స్నేహానికి విలువ ఇచ్చి వదిలేస్తున్నా. జీవితంలో నీ మొహం చూపించకు. మాట్లాడాలని ప్రయత్నించకు’ అని పెట్టేసింది. తర్వాత కొద్దిరోజులకే జాబ్‌ మానేసి వెళ్లిపోయింది. రోజులు గడిచి రియలైజ్‌ అయ్యాక నేనెంత పాడు పనికి ఒడిగట్టానో అర్థమైంది. తను నాకు దక్కాలనుకొని దారుణంగా ప్రవర్తించా. అప్పుడే ఆలోచిస్తే కనీసం తన స్నేహమైనా మిగిలేది. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం?          

- సునీల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts