Updated : 04 Dec 2021 05:08 IST

పెళ్లి కళ వచ్చేసిందా బాలా..?

ఇప్పుడసలే పెళ్లిళ్ల సీజన్‌. బ్రహ్మచారులు కొత్త బంధంలో ఒదిగిపోతున్నారు. కన్నెపిల్లలు సిగ్గులమొగ్గలవుతూ కొత్త పెళ్లి కూతుళ్లవుతున్నారు. పెళ్లీడుకొచ్చిన కుర్రకారు తామూ ఆ ఆలోచనల్లో ఉక్కిరిబిక్కిరవడం సహజమే. మరి మూడు ముళ్లు.. ఏడడుగులు వేయడానికి మనలో ఏమేం లక్షణాలు ఉండాలంటే..

* బ్రహ్మచారి ఆడింది ఆట, పాడిందే పాట. పెళ్లయ్యాక అదేం కుదరదు. ఇంకొకరికి సమయం కేటాయించాలి. మనల్ని నమ్ముకొని వచ్చిన వారి కోసం అభిరుచులు మార్చుకోవాలి. అవసరమైతే త్యాగాలు చేయాలి. అలా చేయగలిగితేనే ఏడో అడుగుకి ముందడుగేయాలి.

* పెళ్లితో కొత్త ఇన్నింగ్స్‌ మొదలవుతుంది. పాత ప్రేమలు, పక్కచూపులకు బై చెప్పేయాల్సిందే. నాకు నీవు, నీకు నేనూ.. అని పాడుకోవాల్సిందే. భాగస్వామిపై అపార నమ్మకం ఉంచాల్సిందే. ఇవన్నీ చేయగలిగితేనే ముందుకి.

* అబ్బాయి, అమ్మాయి ఒకొరికొకరు నచ్చితేనే సరిపోదు. కుటుంబానికీ నచ్చాలి. ఇంట్లోవాళ్లతో సర్దుకుపోగలగాలి. ఈ ఓర్పు నాలో ఉందని భావించినప్పుడే ముందుకెళ్తే ఉత్తమం.

* పెళ్లైతే సుఖసంతోషాలే కాదు.. కొత్త బాధ్యతలూ మొదలవుతాయి. నమ్ముకున్న అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవడం కుర్రాడి బాధ్యత. ఆ అబ్బాయికి ప్రేమ పంచుతూ హ్యాపీగా ఉండేలా చేయడం ఆమె రోల్‌. ఇంటి పనులు, బయటి పనులు, ఆపదల్లో తోడుండడాలు.. సరేసరి.

* బ్రహ్మచారిగా ఉంటే నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి సర్దుకుపోవచ్చు. ఒంటరైతే నీ ఖర్చులు, సంపాదన పట్టించుకునే వారే ఉండరు. కొత్త జంటగా మారితే మాత్రం.. తగినంత సంపాదన తప్పదు. అద్దెలు, సరదాలు, రెస్టరెంట్లు, అనుకోని ప్రయాణాలు.. ఖర్చులు డబుల్‌. తట్టుకోగలిగితేనే మూడు ముళ్లకు సిద్ధం కావాలి.

* సత్తువుంది.. నెత్తురుంది.. బతకడానికి కావాల్సినంత డబ్బుంది పెళ్లే తరువాయి అనుకుంటే కుదరదు. దానికో వయసూ ఉండాలంటారు పెద్దలు. 25 దాటితేనే మానసిక పరిణతి వస్తుంది.. ఆటుపోట్లను ఎదుర్కొనే ధైర్యం ఉంటుందంటారు పెద్దలు. అదీ గమనించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని